సిక్కోలులో జనసైనికుల గగ్గోలు దేనికీ?

'ఒక్క టికెట్ ఇవ్వండి ప్లీజ్... పరువు నిలబెట్టుకుంటాం...' అంటున్నారు సిక్కోలు జిల్లా జనసైనికులు... ఆ ఒక్క సీటు దక్కుతుందా...? పరువు నిలబడుతుందా...?

Update: 2024-03-18 09:34 GMT
Source: twitter

(తంగేటి నానాజీ,)

విశాఖపట్నం: అంత‌న్నాడింత‌న్నాడే గంగ‌రాజు.. అన్న చందంగా సిక్కోలు జనసేన పార్టీ పరిస్థితి తయారైంది. ఈ ఎన్నికల్లో జనసేన చక్రం తిప్పుతుందనుకుంటే టీడీపీ, బీజేపీతో జతకట్టి 21 అసెంబ్లీ స్థానాలకే పరిమితమయింది. దీంతో గత ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి పదికి పది నియోజకవర్గాలలో పోటీ చేసిన జనసేన ఇప్పుడు ఒక్క స్థానం నుంచి కూడా పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. గత ఐదేళ్లుగా ప్రతిపక్షాలను విమర్శిస్తూ రానున్న ఎన్నికల్లో ప్రతాపం చూపిస్తానన్న సిక్కోలు జనసైనికులు ఇప్పుడు ఒక్క సీటూ దక్కకపోవడంతో సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. జిల్లాకు కనీసం ఒక్క సీట్ అయినా కేటాయించండి అంటూ అధిష్టానాన్ని వేడుకుంటున్నారు.

పది నుంచి సున్నాకి...

జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించి పదేళ్లు అయినప్పటికీ.. గత ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి పదికి పది స్థానాల్లోనూ అభ్యర్థులు పోటీకి దిగారు. గెలుపోటములు పక్కన పెడితే తమ పార్టీ.. ప్రజల్లో ఉందని నిరూపించుకోగలిగారు అభ్యర్థులు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కమ్యూనిస్టులతో జతకట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పదింట తొమ్మిది నియోజకవర్గాల్లో జనసేన, ఒక నియోజకవర్గంలో సీపీఎం పోటీ చేశాయి. శ్రీకాకుళం నుంచి కోరాడ సర్వేశ్వరరావు, నరసన్నపేట, మెట్ట వైకుంటారావు, టెక్కలి నుంచి కణితి కిరణ్, పలాస నుంచి కోత పూర్ణచంద్రరావు, ఇచ్చాపురం నుంచి దాసరి రాజు, పాతపట్నం నుంచి గేదల చైతన్య, ఆముదాలవలస నుంచిపేడాడ రామ్మోహన్, ఎచ్చెర్ల నుంచి బాడన దేవ భూషణ్ రావు, రాజాం నుంచి మొచ్చ శ్రీనివాస్‌లు జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో ఒక్క సీటు కేటాయించకపోవడంతో వీరంతా డీలా పడిపోయారు.

పాలకొండకు జనసేన సీటు...?

'పొత్తులో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తారని సమాచారం. ఒక్క సీటు అయినా కేటాయిస్తే జిల్లాలో జనసేన లీడర్లు, క్యాడర్లో ఉత్సాహం వస్తుంది. ఆ దిశగా అధిష్టానం ఆలోచించాలి' అన్నారు జనసేన శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్. శ్రీకాకుళం జిల్లా జనసేనకు ఒక్క సీటు కేటాయించకపోవడంతో ఇటీవల జరిగిన జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ వేడుక‌ల‌ను సైతం జిల్లాలో అంతంత మాత్రంగా నిర్వ‌హించారు. జిల్లా కేంద్రంలో అస‌లు ఆవిర్భావ వేడుక‌లే నిర్వ‌హించ‌లేదు. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన పవన్ కళ్యాణ్.. పార్టీకి అన్యాయం చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మూడో జాబితాలోనైనా సిక్కోలు సైనికులకు ఒక్క సీట్ అయినా ఇస్తారా లేదా అనేది చూడాలి.



Tags:    

Similar News