నీడలా వెంటాడుతున్న.. " స్థానిక"త అభ్యంతరం..!

"స్థానికేతరుడు" అని కూటమి నేతలు అభ్యంతరం చెప్పారు. అనేక మలుపుల తర్వాత వారంతా ఒకే గొడుగు కిందికి వచ్చారు. అయినా పాత అభ్యంతరం వెంటాడుతూనే ఉంది.

Update: 2024-05-02 12:48 GMT

(ఎస్.ఎస్.వి భాస్కర్ రావ్)

తిరుపతి: " ఓన్నా.. ఇది ఎన్నో వార్డు..

ఇదా... 42 అన్నా.

ఏమనా... యాడికి పోవాలా?

లేదులెన్నా... మా ఓళ్ళు.. ఆ పక్క పెచారంలో ఉండారు. ఈ తట్టుకు రమ్మనాలే.

అవునా..

ఏ పార్టీనా మీది.

మాది.. చిత్తూరే అన్న.. ఈ పక్కనే (తిరుపతిలో) ఉంటా. చిత్తూరు నుంచి మా వోళ్ళు చాలామంది వచ్చినారు. వాళ్లకు ఈ పక్క ఈదులు సరిగ్గా తెలీవు.

అవునా..! గ్లాస్ గుర్తోల్లా మీరు.

తిరుపతిలో యట్టవుండాది. సీనివాసులు అన్నకి ...

ఏమి లేదు నా... గెల్చుడు. కట్టంగా ఉండాది.

అదేంది.. శ్రీనివాసులు మనిషి అంటావు. చిత్తూరు నుంచి వచ్చినా అంటుండావు. గెల్చడు అంటే ఎట్టాబ్బా?

అవున్నా.. శీనన్నకు ముందు నుంచే తిరుపతి వాళ్ళు లోకల్ కాదు లోకల్ కాదు అని చెప్పినారు. వోళ్లంతా ఇప్పుడు కలిసినారు. కానీ డ్యామేజ్ అయిపోయింది. లోకల్ కాదు అనేది బాగా నాటేసినారు. అదే పెద్ద దెబ్బకొచ్చింది. "మా ఓళ్లు చెప్పిన మాట మాకే తిరగబడింది. కానీ పార్టీ కోసం కష్టపడాలి లే..!

ఎట్టైతే అట్టాయితాది"

తిరుపతి నగరంలో ఫెడరల్ ప్రతినిధికి ఎదురైన అనుభవమిది. కూటమిలోని ప్రధానంగా టిడిపి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ నాయకులు మొదట్లో లేవనెత్తిన " స్థానికత" అనే అంశం వారికే తిరగబడినట్లు కనిపిస్తోంది. ఒక నెల వెనక్కి వెళితే...


టిడిపి- జనసేన - బిజెపి కూటమిగా ఏర్పడడం. సీట్ల సర్దుబాటు వ్యవహారం సాగుతుండగానే... వైఎస్ఆర్సిపి చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులుకు మళ్లీ అక్కడ అభ్యర్థిత్వం దక్కలేదు. దీంతో ఆయన జనసేన పార్టీలో చేరడం ద్వారా నాటకీయ పరిణామాలు, టిడిపి నేతల అభ్యంతరాల మధ్య " జనసేన పట్టుబట్టి సాధించుకున్న తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి" ఆరణి శ్రీనివాసులును రంగంలోకి దించారు. అభ్యర్థి ఎంపిక కాక ముందు నుంచి.. స్థానికేతరుడికి టికెట్ ఇవ్వొద్దంటూ, టిడిపి నాయకులతో సహా జనసేన తిరుపతి నాయకులు కూడా గొంతు కలిపారు. టిడిపి నుంచి నారా లోకేష్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబును ఆయా పార్టీల నాయకులు విడివిడిగా వెళ్లి కలిసి పరిస్థితిని వివరించారు. ఈ సమస్య ఎంతకీ కొలిక్కి రాలేదు.

కదిలించిన జనసేన అని "దండం"

జనసేన, టిడిపి రాష్ట్ర నాయకులు దశలవారీగా చేసిన నష్ట నివారణ చర్యలతో.. ఆలస్యంగా నైనా తిరుపతిలో టిడిపి నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన అసంతృప్తి నాయకులు దిగి వచ్చారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్వయంగా తిరుపతికి వచ్చి రెండు రోజులు మకాం వేశారు. " చేతులెత్తి నమస్కరించి అందరికీ విన్నవించారు" ఈ వ్యవహారం టిడిపి అసంతృప్తి నాయకులను కదిలించింది. ఆ తరువాత..

కలిసి సాగుదాం...

జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఉపదేశం తర్వాత ఆ పార్టీలోని అసంతృప్తి నాయకులు, టిడిపి ప్రధాన కీలక నేతలందరూ.. జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసలుతో కలిసి ఉదయం, సాయంత్రం అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. "పువ్వులు పరిచిన ముళ్ళబాటపై నడకగా" తిరుపతిలో కూటమి అభ్యర్థి పరిస్థితి కనిపిస్తోంది. ఎలాగంటే.. కూటమి నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వెంట టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి జి. నరసింహ యాదవ్, కర్నూలు జిల్లా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తిరుపతిలో టిడిపిలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కుమారుడు మబ్బు దేవనారాయణరెడ్డి, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ మురళీకృష్ణ రెడ్డి, కోడూరు బాలసుబ్రమణ్యం, జనసేనలో అసంతృప్తిగా ఉన్న కిరణ్ రాయల్, అంతకుముందు రాజారెడ్డి సహా బిజెపి రాష్ట్ర నాయకులు జి. భాను ప్రకాష్ రెడ్డి, సీనియర్ నాయకురాలు కే. శాంతారెడ్డి, సామంచి శ్రీనివాస్ లాంటి వారు కూడా సమష్టిగా కలిసి వచ్చారు. ఎందరో కొందరు కేడర్ లేని నాయకులు మాత్రమే ఉన్నారు.


కడుపులో కత్తులు ఉన్నాయా..?

జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వెంట కూటమి నాయకులు కలిసి వస్తున్నారు. వీరిలో మొదట నాటుకున్న బీజం ఇంకా తొలుస్తూనే ఉన్నట్లు అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఒకవేళ జనసేన పార్టీ అభ్యర్థి గెలిచి, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాకుంటే పరిస్థితి ఏమిటి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినా, సామాజిక సమీకరణను పరిగణలోకి తీసుకుంటే బలిజలకు ఎలాంటి పదవులు దక్కే అవకాశం ఉండకపోవచ్చని ఒక నేత చెప్పిన మాట ఇది. ఇది వాస్తవం కూడా. వారి అభిప్రాయంతో చాలామంది ఏకీభవిస్తున్న బలిజ సామాజిక వర్గం నేతలు నోరు మెదపలేకపోతున్నట్టు సమాచారం.

ఈ పరిస్థితుల్లో "హాజరు వేసుకునే రీతిలో" ప్రచారంలో మమేకం అవుతున్నారా? అనే చర్చ కూడా జరుగుతోంది. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విజయం సాధిస్తే. "కూటమిలోని పార్టీ అగ్రనేతల ప్రమేయం" వల్లే జరుగుతుందని ఆ విజయం వారికి ఖాతాలోకి వెళుతుంది. ఓడితే మాత్రం.. అది మిత్రపక్షంలోని కూటమి నాయకుల బాధ్యతగా భావించాలని అభిప్రాయపడుతున్నారు. ఈ లుకలుకలు అంతర్గతంగా మండుతున్న విషయం " స్థానికేతర సమస్య" కీలకంగా మారిందనే చర్చ ఇంకా నాయకులు నే కాదు తిరుపతి ఓటర్లలో కూడా నాటుకున్నట్లు తెలుస్తోంది. ఇది కాస్త...

ఫ్యాన్ జోరు పెంచుతుందా..!?

"కూటమి నేతల మధ్య అంతర్గతంగా ఉన్న వ్యవహారాలు తమ విజయాన్ని ఆపలేవు" అనే ధీమాతో వైఎస్ఆర్సిపి అభ్యర్థి భూమన అభినయ రెడ్డి ప్రచార బాధ్యతలను భుజానికి ఎత్తుకున్న ఆయన తండ్రి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ధీమాగా ఉన్నారు.

తిరుపతి నగర ఆధ్యాత్మిక చరిత్రలో ఎన్నికల నామ సంవత్సరానికి ముందు ఊహించని అభివృద్ధి జరిగింది. మొదటి పునాది వేసిన ఫ్లైఓవర్లు, రహదారుల విస్తరణ వంటి కార్యక్రమాలపై తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తన కుమారుడు భూమన అభినయరెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా... రంగంలోకి దించాలనే ముందస్తు వ్యూహంలో భాగంగానే అభివృద్ధి పనుల పేరిట రాచమార్గం ఏర్పాటు చేశారని అభిప్రాయం ఉంది. ఇటీవల ఓ సందర్భంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి "నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా ఉన్న అభినయదే రోడ్ల విస్తరణ ప్లాన్" అని ఆ క్రెడిట్ తన కుమారుడికి దక్కేలా వ్యాఖ్యలు చేశారు. అంటే "తన కుమారుడు ఎమ్మెల్యేగా గెలిస్తే నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయగలడనే మాట"ను భూమన కరుణాకర్ రెడ్డి చెప్పకనే చెప్పారు.

" అభివృద్ధి మాటున అవినీతి రాజ్యమేలింది" అని టిడిపి రాష్ట్ర నాయకులతోపాటు, ఆ పార్టీ స్థానిక నాయకులు, జనసైనికులు కూడా మూకుమ్మడిగా మాటల దాడులు సాగించారు. "రోడ్ల విస్తరణ, పరిహారం చెల్లింపు, భూ సేకరణ"లో రూ. కోట్ల అవినీతి జరిగిందనే విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయడంలో ప్రతిపక్ష పార్టీలు సఫలమయ్యాయి. "బాండ్ల జారీ నిలిపివేయాలని" ఆదేశాలను మున్సిపల్ పరిపాలన శాఖ గత నెలలో జారీ చేసింది. " అభివృద్ధి కార్యక్రమాల అమలులో.. టీటీడీ కీలక అధికారి సహకారం అందించారని, ఇందులో ఆశ్రిత పక్షపాతం ఎక్కువగా ఉంది" అనే ఆరోపణలను కూడా ప్రతిపక్ష కూటమి నాయకులు ఆధారాలతో సహా బహిర్గతం చేశారు.

" ఎన్నికల నగారా మోగడానికి ముందు కూటమి నాయకులు ఏకపక్షంగా అధికార పార్టీ ఎమ్మెల్యే, నాయకులు సాగించిన కలాపాలను నిగ్గదీశారు" ప్రస్తుతం ఈ వ్యవహారాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో ఎవరికి వారు విఫలమైనట్లు కనిపిస్తోంది.



పేలుతున్న మాటల తూటాలు

తిరుపతి నగరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మధ్య ఆరోపణల తూటాలు పేలుతున్నాయి. " ఏ వ్యాపారాలు చేసి, రూ. కోట్లు గడించావు" అని జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు నిలదీస్తే, తిరుపతిలో "మళ్లీ రౌడీ రాజ్యాన్ని" పరిచయం చేస్తున్నావా? అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల మూడు రోజుల క్రితం తిరుపతి నగరంలో "కూటమి కార్యకర్తలతో కలిసి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారానికి వెళ్లారు. అదే సమయంలో వైఎస్ఆర్సిపి నాయకులు కూడా ఎంట్రీ ఇచ్చారు" ఈ సందర్భంలో చోటుచేసుకున్న ఘర్షణలో కొంతమంది స్వల్పంగా గాయపడడానికి దారితీసింది. దీంతో అధికార వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జనసేన అభ్యర్థి శ్రీనివాసులు మధ్య మాటల తూటాలు పెరిగాయి. ఇది కాస్త పాత ఆరోపణలు తెర మరుగయ్యాయని కనిపిస్తోంది.

తండ్రి చాటు బిడ్డ కాదు..

స్థానిక ఎమ్మెల్యే భూమా కరుణాకర రెడ్డి ఎన్ఎస్‌యుఐ నుంచి రాజకీయ కలాపాలు ప్రారంభించిన నేపథ్యం ఉంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలోనూ తాను నిర్మించుకున్న సహచరుల సహకారం ఎక్కువగా ఉండేది. "అంతకంటే ఎక్కువ నెట్వర్క్ నడిపిన అనుభవం" వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమన అభినయరెడ్డి ప్రత్యేకత అని, వారికి సన్నిహితంగా మెలిగే వారు చెప్పే మాట. భువన కరుణాకర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా.. "తనతో కలిసి చదువుకున్న మిత్రులు, అభిమానులు, సన్నిహితులతో ప్రత్యేకంగా కార్యాచరణ" తయారు చేయడమే కాకుండా. తన అంతరంగిక మిత్రుల ద్వారా వ్యూహం అమలు చేసిన తీరు విభిన్నంగా ఉండేదని గుర్తు చేస్తున్నారు. " ఇప్పుడు కూడా వారం నుంచి భూమన అభినయ ప్రచారంలో కనిపించడం లేదు" అని అంటున్నారు.


అందులో ప్రధానంగా " రోడ్లలో "షో పుటప్ ప్రచార ఆర్భాటం కంటే, ఆయా ప్రాంతాల్లో కులాల వారీగా, అపార్ట్మెంటులో వ్యక్తిగతంగా అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుని, వారి అభిమానం సంపాదించడానికి" తనదైన ప్రత్యేక శైలిలో వ్యూహాత్మకంగా వ్యూహాలు రచించి వాటిని అమలు చేస్తున్నట్లు వారి సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాకుండా చాలా వరకు ఫోన్ కాల్స్ కూడా టచ్‌లో లేరని కూడా చెబుతున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో.. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు" అనే అపవాదును అబద్ధం చేసే దిశగా, కూటమి అభ్యర్థిని ఎలా గట్టెక్కిస్తారనేది తిరుపతిలో ఓ సవాల్‌గా మారింది. ఐక్యంగా సాగుతున్న కూటమినేతలు పట్టు సాధిస్తారో..!? అభివృద్ధి చేశాను అనే నినాదంతో కదులుతున్న అధికార వైఎస్ఆర్సిపి మళ్లీ తిరుపతిలో బాగా వేస్తుందో లేదో అనేది కొన్ని రోజుల్లో జరగనున్న పోలింగ్ వెల్లడించనుంది.

Tags:    

Similar News