జేడీ చూపు విశాఖ ఉత్తరం వైపు ఎందుకు మళ్లింది?

విశాఖ ఉత్తరంలో వైసీపీ బోణీ కొడుతుందా.. బీజేపీ రిపీట్ అవుతుందా.. జై భారత్ పార్టీ గెలుపు కోసం 'కాపు' కాయనుందా... త్రిముఖ పోటీలో గెలుపెవరిది...?;

Update: 2024-03-21 15:02 GMT
Source: Twitter


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: విశాఖ ఉత్తర నియోజకవర్గ రాజకీయం విలక్షణం. ఇక్కడ మెజారిటీ ఓటర్లు కాపు, గవర, వెలమ సామాజిక వర్గాలకు చెందిన వారు అయినప్పటికీ రాజుల ఆధిపత్యం కొనసాగుతోంది. దాదాపు 2 లక్షల 87 వేల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. అధికార వైసీపీ మాత్రం ఇంతవరకు బోణీ కొట్టలేదు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో ఏర్పడిన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి తైనాల విజయ్ కుమార్ గెలుపొందారు. 2014లో బీజేపీ అభ్యర్థి పెనుమత్స విష్ణుకుమార్ రాజు విజయం సాధించగా... 2019లో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ గెలిచారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ పరాజయాన్ని చవిచూసింది.

ఇదీ ఉత్తర నియోజకవర్గ చరిత్ర..

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అత్యధికులు తెలగ, బలిజ, కాపులు అత్యధికులు. సుమారు 18 శాతం మంది ఈ సామాజిక వర్గాల వారు ఉంటే ద్వితీయ స్థానంలో రెడ్లు సుమారు 9.4 శాతం. మూడో స్థానంలో మాలలు, నాలుగో స్థానంలో గవరలు, ఐదో స్థానంలో రాజులు (క్షత్రీయులు) ఉన్నారు. కొప్పుల వెలమలు, యాదవులు దాదాపు 6.5 శాతంగా ఉన్నారు. ఆ తర్వాత స్థానాలలో బ్రాహ్మణులు, వైశ్యులు ఉంటే కమ్మ సామాజిక వర్గం వారు 4 శాతం. ఈ నియోజకవర్గంలో విశాఖపట్నం అర్బన్‌లో కొంత భాగంతో పాటు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లోని 41,44, 45, 49, 50, 51 వార్డులు ఉన్నాయి. 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం ఒక్కోసారి గెలిచాయి. కులాల వారీ చూసినపుడు కొప్పుల వెలమ (తైనాల విజయ్ కుమార్), క్షత్రీయులు (పెనుమత్స విష్ణు కుమార్ రాజు), కాపు (గంటా శ్రీనివాసరావు) గెలిచారు. 2024లో ఈ నియోజకవర్గంలో ఉత్కంఠ పోరు నెలకొనే అవకాశం ఉంది.

జేడీ లక్ష్మీనారాయణ ఇక్కడికెందుకు వచ్చారు..

విశాఖ ఉత్తర నియోజకవర్గం లో అధికార వైసీపీ నుంచి కేకే రాజు ఎన్నికల బరిలో దిగగా... టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి నుంచి బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు. వీరి మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని భావించినప్పటికీ అనూహ్య రీతిలో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన జై భారత్ పార్టీ అధ్యక్షులు, సీబీఐ మాజీ జెడి వీవీ లక్ష్మీనారాయణ పోటీలో దిగారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైన అధికార పక్షానికి చెందిన కేకే రాజు ఈసారి బోణీ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్న ఆయన ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి విష్ణు కుమార్ రాజు గతంలో ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో చేసిన పనులు, తనకున్న పరిచయాలు పరిచయాలు, కూటమి పార్టీల ప్రోత్సాహం తనను గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. నియోజకవర్గంలో సభ్యులు సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇక జై భారత్ పార్టీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ సామాజిక వర్గ సమీకరణలో ఉన్నారు. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లైన కాపు సామాజిక వర్గాన్ని సమీకరించుకునే పనిలో పడ్డారు. దీంతోపాటు మేధావి వర్గం తనకు మద్దతు తెలుపుతోందని, గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఉత్తర నియోజకవర్గం నుంచే ఓట్లు ఎక్కువ ఓట్లు పడ్డాయని ఆ ఓటు బ్యాంకు అలాగే ఉందని భావిస్తున్నారు. ఉత్తరంలో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.



Tags:    

Similar News