అక్కడ కాపులే కీలకం.. ఆ తర్వాత గౌడ్స్

కాపు, గౌడ్ సామాజిక వర్గాలను కాదని అక్కడ గెలవడం కష్టం. వారు ఎటువైపు మొగ్గితే వారిది విజయం.

Update: 2024-03-22 08:50 GMT
పెడన నియోజకవర్గం

జి. విజయ కుమార్ 

కృష్ణా జిల్లా పెడన నియోజక వర్గంలో కాపు, గౌడ్ సామాజిక వర్గాలు చాలా కీలకమైన కమ్యునిటీలు. ఈ సామాజిక వర్గాలే కేంద్రంగా పెడన రాజకీయాలు సాగుతుంటాయి. వీరు ఎటువైపు మొగ్గితే వారిదే విజయం అన్నట్టుగా తిరుగుతుంటాయి. ఏ పార్టీ అయినా వీరిని కాదని పెడనలో రాజకీయాలు చేయడం అసాధ్యం. ప్రత్యేకించి ఎన్నికలు వచ్చాయంటే ఈ రెండు సామాజిక వర్గాలే డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌గా మారుతుంటారు. గత ఎన్నికల్లోను వీరి ఓటింగే కీలకంగా మారింది. గౌడ్ కమ్యునిటీకి చెందిన ఓటర్లు అధిక శాతం వైసీపీ వైపు మొగ్గు చూపడం, కాపు ఓటింగ్‌ చీలి పోయి జనసేన వైపు అధికంగా మద్దతు పలకడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన జోగి రమేష్‌ గెలుపొందారు. ప్రధాన పార్టీలు ఈ రెండు వర్గాలకు చెందిన నేతలనే అభ్యర్థులుగా రంగంలోకి దింపుతారు. ఈ సారి కూడా గౌడ్ వర్గానికి చెందిన వారినే అభ్యర్థులుగా ఖరారు చేశారు. కాపు వర్గానికి చెందిన నేతకు ఈ సారి అవకాశం కల్పిస్తారని ఆశించారు. అయితే గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వారినే ఇరు పార్టీలు ఖరారు చేశారు. కాపులకు కేటాయించ లేదని ఆ సామాజిక వర్గం నేతలు, కార్యకర్తలు ఆందోళనలు కూడాచేపట్టారు. తర్వాత అవి సర్థుమణిగాయని స్థానిక నేతలు చెబుతున్నారు.

Delete Edit

పెడనలో సామాజిక వర్గాలు

పెడన నియోజక వర్గంలో కాపు బలమైన సామాజిక వర్గం. సుమారు 32 శాతం నుంచి 34 శాతం వరకు ఈ వర్గానికి చందిన ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కలిపి 12 శాతం ఓటర్లు మొగ్గు చూపగా, తక్కిన వారు జనసేన వైపు మొగ్గు చూపారు. సుమారు 15 శాతం నుంచి 17 శాతం వరకు జనసేన పార్టీ అభ్యర్థికి జై కొట్టారు. గతంలో 2014 ఎన్నికల్లో ఇదే కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా టీడీపీకి మద్దతు పలకడంతో ఆ పార్టీ అభ్యర్థి కాగిత వెంకటరావు గెలుపొందారు. అయితే 2019 ఎన్నికలు వచ్చేసరికి సీన్‌ రివర్స్‌ అయింది. ఇక్కడ జనసేన కూడా రంగంలోకి దిగింది. అంకెం లక్ష్మీశ్రీనివాస్‌ను జనసేన అభ్యర్థిగా పోటీలోకి దిగారు. ఆయనకు దాదాపు 17.64 శాతం ఓట్లు పోలయ్యాయి. వీటిల్లో 90 శాతం ఓట్లు కాపు సామాజిక వర్గం నుంచే పోలయ్యాయి. వీటికి తోడు గౌడ్, ఎస్సీ, మత్స్యకార్ల ఓట్లు తోడవడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి జోగి రమేష్‌ గెలుపు 5 శాతం ఓట్లతో బయట పడ్డారు. ఇదే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరీలోకి దిగిన కాగిత వెంకటరావు కుమారుడు కాగిత కృష్ణప్రసాద్‌కు సుమారు 60వేల ఓట్ల వరకు లభించాయి.
గౌడ సామాజిక వర్గం
పెడనలో రాజకీయాలు శాసించే వాటిల్లో గౌడ్ సామాజిక వర్గం కూడా కీలకమైంది. ఈ నియోజక వర్గంలో సుమారు 28 శాతం నుంచి 30 శాతం వరకు ఈ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉంటారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంప్రదాయ ఓటింగ్‌గా గతంలో ఉండేది. ఆ తర్వాత వరుస మారింది. టీడీపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెరి సగం అన్నట్టుగా మారారు. అయితే గత ఎన్నికల్లో ఒక 10 శాతం అదనంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ అభ్యర్థి గెలుపునకు మద్దతు పలికినటై్టంది. ఇక వీరి తర్వాత ఎస్సీ, మత్స్యకార్లు కూడా ఇక్కడ గెలుపు ఓటముల్లో కీలక భూమిక పోషిస్తుంటారు. ఈ నియోజక వర్గంలో సుమారు 15 శాతం వరకు ఎస్సీలు, మరో 10 శాతం వరకు మత్స్యకారులు ఉంటారు. వీరిలో ఎస్సీలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు అధికంగా, టీడీపీకి తక్కువుగాను మద్ధతుదారులుగా ఉంటారు. ఇక మత్స్యకారులైతే జననేసనకు జై కొడుతుంటారని స్థానిక నేతలు చెబుతున్నారు.
2024 ఎన్నికల్లో ఎలా ఉండబోతోంది
టీడీపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు అటు కాపు, ఇటు గౌడ్ సామాజిక వర్గాల మద్దతు కోసం పోటీ పడుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో కాపు ఓటింగ్‌ అధికంగా టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. జనసేన, టీడీపీ పొత్తులు కుదుర్చుకోవడం వల్ల గంపగుత్తిగా టీడీపీని బలపరచేందుకే మొగ్గు చూపే అవకాశం ఉందని స్థానిక నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో జనసేనకు పడిన ఓట్లల్లో అధిక శాతం టీడీపీ వైపు పడే అవకాశం ఉంది. ఇక గౌడ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువుగా టీడీపీవైపే మొగ్గు చూపే చాన్స్‌ ఉంది. అయితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటింగ్‌ అయిన ఎస్సీ, ఎస్టీ ఓటింగ్‌ ఉన్నా గౌడ్, కాపుతో పాటు మత్స్యకార ఓటర్ల మద్దతు కూడగట్టగలిగితే బయట పడొచ్చని స్థానిక నేతలు చెబుతున్నారు.
పెడన ఏర్పడింది ఇలా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన డీలిమిటేషన్‌లో భాగంగా పెడన అసెంబ్లీ నియోజక వర్గం 2008లో ఏర్పడింది. గూడూరు, పెడన, బంటుమిల్లి, కృతివెన్ను మండలాలతో దీనిని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మూడు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. రెండు సార్లు జోగి రమేష్‌ గెలుపొందారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి, 2019లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన కాగిత వెంకటరావు విజయం సాధించారు. వీరిద్దరూ గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వారు. 2024 ఎన్నికల అభ్యర్థులు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకటరావు కుమారుడు కాగిత కృష్ణప్రసాద్‌ టీడీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఉప్పాల రామును ఖరారు చేశారు. రాము భార్య ఉప్పాల హారిక ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాకు జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.
Tags:    

Similar News