బీజేపీ కీలక సమావేశానికి సీనియర్ల డుమ్మా..

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నిర్వహించిన కీలక సమావేశానికి కీలక నేతలు గైర్హాజరయ్యారు. టికెట్ దక్కకపోవడంతోనే అలిగి వాళ్లంతా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారా..

Update: 2024-03-26 10:11 GMT
Source: Twitter

ఎన్నికల వ్యూహాలపై చర్చించడానికి ఆంధ్ర బీజేపీ ఈరోజు విజయవాడలో పార్టీ సీనియర్ నేతలు, పదాధికారులతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ నేతలు సిద్ధార్థ్ నాథ్ సింగ్, అరుణ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీ నిర్ణయాలతో ఏకీభవించలేకనే వారు సమావేశానికి హాజరుకాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో రానున్న ఎన్నికల టికెట్ అందుకున్న నేతలు హాజరయ్యారు. కానీ సీనియర్ నేతలు బీజేపీ ఆంధ్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ కూడా దూరంగా ఉన్నారు.

ఈ నలుగురు నేతలు కూడా రానున్న ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగాలని, టికెట్ల తమకు ఇవ్వాలని ఆశించి భంగపడిన వారే కావడం విశేషం. టికెట్ దక్కకపోవడంతోనే వారు పార్టీ కార్యకలాపాలకు దూరంగా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే జ్వరం రావడంతోనే సోము వీర్రాజు ఈ సమావేశానికి హాజరుకాలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ నలుగురు సీనియర్ నేతలు మూకుమ్మడిగా పార్టీ కీలక సమావేశానికి ఎందుకు రాలేదన్న చర్చ పార్టీ శ్రేణుల్లో కూడా తీవ్రంగానే జరుగుతోంది.
టికెట్ దొరకలేదన్న బాధే కారణమా
సమావేశానికి సీనియర్ నేతలు సోము వీర్రాజు, నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ గైర్హాజరు కావడానికి టికెట్ల కేటాయింపే కారణమని వాదనలు వినిపిస్తున్నాయి. తాను రాజంపేట నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు పార్టీకి చెప్పినా వారు తనను అనపర్తి నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని ప్రతిపాదించడంతో సోము వీర్రాజు అలక పాన్పు ఎక్కారని, అందుకే జ్వరం సాకుతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న ఎన్నికల్లో బీజేపీకి పార్టీ సీనియర్ నేతల సహకారం ఎంత మాత్రం ఉంటుందో అంటూ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. మరి వారిని విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుకుంటుందో చూడాలి.
అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు
ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేయడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏయే స్థానాల నుంచి పోటీ చేసేది ఒక క్లారిటీ వచ్చింది. బద్వేల్, విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, వైజాగ్ నార్త్, ధర్మవరం, పాడేరు, కైకలూరు, ఎచ్చర్ల నుంచి బీజేపీ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ఖరారు అయింది. కాగా మరో రెండు స్థానాల్లో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. వాటిలో అనపర్తి సీటుకు బదులుగా రాజమెండ్రి సీటును తమకు ఇవ్వాలని, రాజంపేట సీటును కూడా తమకే కేటాయించాలని బీజేపీ కోరుతోంది. వీటిలో అనపర్తి నుంచి పోటీ చేయాలని సోము వీర్రాజు ముందు ప్రతిపాదన ఉంచినా, అందుకు ఆయన విముఖత కనబరుస్తున్నట్లు సమాచారం.
రాజులదే పైచేయి
ఇదిలా ఉంటే రాజంపేట నియోజకవర్గంలో క్షత్రియుల ప్రాభల్యం ఎక్కువ. అక్కడ దాదాపు క్షత్రీయుల(రాజులు)వే లక్షకుపైగా ఓట్లు ఉంటాయి. అక్కడ గెలవాలంటే ఎన్నికల బరిలో క్షత్రియ అభ్యర్థిని నిలబెట్టాలి. ఈ సీటుకు టీడీపీ నుంచి జగన్మోహన్ రాజు, బీజేపీ తరపున చెంగల్ రాజుకు టికెట్ దక్కవచ్చు. కాగా ఈ సీటును ఈ పార్టీ సొంతం చేసుకుంటుందో అన్న అంశంపై మాత్రం క్లారిటీ లేదు. ఈ ప్రశ్నలన్నింటికీ ఈరోజు జరిగే సమావేశంలో సమాధానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి అనపర్తి, రాజంపేట ఏ పార్టీ బ్యాగ్‌లో వేసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News