ఆంధ్రా ముఖ్యమంత్రుల కుటుంబాల రాజకీయ కథలో కొత్త మలుపు

తండ్రులు ఉప్పు- నిప్పు.. కుమారులు పాలు నీళ్లు. కలిసి పాడుదాం అంటూ... మాజీ సీఎంల తనయులు ఎన్నికల బరిలో నిలిచారు..

Update: 2024-03-16 12:41 GMT
Source: Twitter


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)


తిరుపతి: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. అలాగని శాశ్వత మిత్రులు ఉండరు. అవసరం, అవకాశాలు, పరిస్థితులకు అనుగుణంగా అభిప్రాయాలు మారిపోతుంటాయి. రాజకీయ బద్ధ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతుంటారు. గ్రేటర్ రాయలసీమ, నెల్లూరు జిల్లాతో కలిసి ఆరు జిల్లాలు ఉన్నాయి. ఒక్కో జిల్లా నుంచి సీఎంగా ప్రాతినిధ్యం వహించిన ఆనాటి రాజకీయ దిగ్గజాల కుమారులు ఒక్కో పార్టీ నుంచి బరిలో నిలుస్తున్నారు.


1984 అంటే తెలుగుదేశం ఏర్పడక ముందు.. ఆ తర్వాత రాజకీయ చతురత, ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆనాటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రుల కుమారులు ఒక్కో జిల్లా నుంచి ఒక్కొక్కరు ఎన్నికల బరిలో ఉండడం ప్రత్యేకత. వారిలో మాజీ సీఎంలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఎన్టీ రామారావు, డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్ చంద్రబాబు నాయుడు, నాదెండ్ల భాస్కర్ రావు వారసులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారి కోవలో మాజీ సీఎం తమ్ముడు కూడా ఉన్నారు.


ఇందులో చమక్కు లేకపోలేదు..


2024 ఎన్నికల కోసం అధికార వైఎస్ఆర్సిపి, టీడీపీ కూటమి నుంచి అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ, జనసేన పార్టీల నుంచి మాజీ సీఎంల కుమారులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.




 

ఆ కోవలో.. తిరగబడి... పార్టీ స్థాపించి..


నిత్య అసమ్మతి నాయకుడిగా.. రాజకీయ వర్గాల్లో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పేరు. మహా ప్రస్థానం పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు సాగించిన పాదయాత్ర ద్వారా డాక్టర్ వైఎస్ఆర్.. ప్రజలతో మరింతగా మమేకమయ్యారు. చరిత్రను తిరగరాస్తు ముఖ్యమంత్రి కాగానే ఆయన వినూత్న పథకాలతో ప్రజల మనసులు చూరగొన్నారు. ఆయన మరణం తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ఆర్‌సీపీ పార్టీని స్థాపించారు. 2014లో ప్రభుత్వ ఏర్పాటుకు సీట్లు రాలేదు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఆయన సుదీర్ఘ పాదయాత్ర సాగించారు. నవరత్న పథకాల పేరుతో ప్రజలను ఆకట్టుకున్న ఆయన సీఎం అయ్యారు. మళ్లీ ఈసారి ఎన్నికల్లో కూడా ఆయన పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.


తండ్రులు ఉప్పు.. నిప్పు, కుమారులు పాలు.. నీళ్లు


కడప జిల్లాకు చెందిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే. నెల్లూరు జిల్లాకు చెందిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారిద్దరూ ఉప్పు-నిప్పులా సాగారు. సీఎం పదవి నుంచి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని విమర్శకులు చలోక్తి విసురుతుంటారు. వారి కుమారులు మాత్రం రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర విభజనకు ముందే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ఆర్‌సీపీ ప్రారంభించడమే కాదు. గత ఎన్నికల్లో సీఎం పీఠాన్ని ఆశించారు. అయితే, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకున్నారు. పాలు నీళ్లులా కలిసిపోయిన వారిద్దరూ... నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.




 

టీడీపీలో కోట్ల తనయుడు..


టీడీపీపై కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి రాజకీయ పోరాటం సాగించారు. ఆయన కుమారుడు కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయనపై వైఎస్ఆర్సిపి నుంచి రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తలపడుతున్నారు. అదే పరిస్థితిని చిత్తూరులో ఎదుర్కొన్న మరో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (ప్రస్తుతం బీజేపీ జాతీయ నాయకుడు) తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.


మళ్లీ బరిలో బాలయ్య


అనంతపురం జిల్లాలో టీడీపీకి బాగా అచ్చి రావడమే కాదు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావును హిందూపురం నియోజకవర్గ ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ.. హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే. మళ్లీ ఆయన ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. గతంలో మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ హిందూపురం నుంచి గెలిచారు.




 

నెల రోజుల సీఎం నాదెండ్ల


టీడీపీపై తిరుగుబాటు చేసి, అప్పట్లో నాదెండ్ల భాస్కరరావు సీఎం అయ్యారు. నాదెండ్ల భాస్కరరావు 1984లో ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వ తేదీ వరకు నెలపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత దివంగత సీఎం డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో నాదెండ్ల మనోహర్.. జనసేన పార్టీలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.


అదృష్టం ఎలా ఉందో..


చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్ చంద్రబాబు నాయుడు.. చంద్రగిరి ఆ తర్వాత కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 14 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి, ఆ తర్వాత విభజన రాష్ట్రానికి మొదటి సీఎం కూడా.. ఆయన కుమారుడు ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి మంగళగిరి నుంచి పోటీ చేయడం ద్వారా అదృష్ట పరీక్షకు సంసిద్ధం అయ్యారు. రాజకీయ రణక్షేత్రంలోకి దిగిన మాజీ సీఎంల తనయులను ఓటర్లు ఎలా ఆదరిస్తారు అనేది వేచి చూడాలి.




 




Tags:    

Similar News