పదేళ్ల తర్వాత మెరుస్తున్న ఓ కిరణం..

జనంలోకి రావడానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదేళ్ల అజ్ఞాతం వీడుతున్నారు. బీజేపీ ఎంపీగా పోటీ చేయనున్న ఆయనను ప్రజలు ఎలా ఆదరిస్తారో..

Update: 2024-03-25 10:54 GMT
Source: Twitter


( ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: నరనరానా కాంగ్రెస్ రక్తాన్ని నింపుకున్న ఓ కిరణం నగరిపల్లెలో ఉదయించింది. తండ్రి వారసత్వంగా రాజకీయ క్రీడా మైదానంలో 25 ఏళ్ల పాటు పదవుల బంతితో ఆటలాడి, మబ్బుల చాటుకు వెళ్ళింది. పదేళ్ల తర్వాత మళ్లీ కమలంలో వికసించాలని కోటి ఆశలతో ఆ కిరణం జనంలోకి వస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఒదిగి ఎదిగిన ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పది సంవత్సరాల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఇప్పుడు కాషాయ జెండా పట్టుకొని ప్రజల ముందుకు వస్తున్నారు. కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయన పేరు ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీతో మమేకమైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శైలి విభిన్నంగా ఉంటుంది.

ఇస్త్రీ మడత నలగకుండా సాధ్యమా.. విభిన్న శైలి..

కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన నల్లారి కుటుంబంలో కిరణ్ కుమార్ రెడ్డి శైలి విభిన్నమైనది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ప్రదర్శించే ఆయనకు ఆత్మీయులు చాలా తక్కువ. ఆయన మాటల్లో నేను మోనార్క్ అనే విధానం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి విషయం పైన లోతైన పరిజ్ఞానం ఆయన విశ్లేషణలో కనిపిస్తుంది అందుకు కారణం పుస్తకాలు ఎక్కువ చదవడమే. మిగతా నాయకులు మాదిరి అడ్డగోలు ఆరోపణలు విమర్శలు ఉండవు. నిర్మాణాత్మక విమర్శలకే ఆయన ప్రాధాన్యం ఇస్తారు.

వీడని నగరవాసన..

వాస్తవానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలికిరి మండలం నగిరిపల్లి చెందిన వ్యక్తి అయినప్పటికీ, హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. నిజాం కాలేజీలో చదువుకున్నారు. రంజి క్రికెట్ మ్యాచ్‌లకు సారథ్యం వహించారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ నగరంలో జీవించిన వాసనలకు ఆయన దూరం కాలేకపోయారు. కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే..

కుటుంబాల మధ్య పోరాటం

చిత్తూరు జిల్లా పీలేరు ( అప్పట్లో వాల్మీకిపురం) నియోజకవర్గం కలికిరి మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న నగిరి పల్లెకు చెందినదే నల్లారి కుటుంబం. ఈ నియోజకవర్గంలో పార్టీలతో పాటు కుటుంబాల మధ్య రాజకీయ ఆధిపత్యం కోసం పోరాటం సాగుతూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో పురుడు పోసుకున్న నల్లారి అమర్నాథ్ రెడ్డి 1972 -78 వరకు రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఆయన ఓటమి చెందారు.

1985 సంవత్సరంలో అమర్నాథ్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏపీసీసీ పదవి అందినట్లే అంది చేజారింది. ఆ తర్వాత ఆయన మరణించడంతో 1988లో వాల్మీకిపురం నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి భార్య సరోజమ్మ పోటీ చేసి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓటమి చెందారు. తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉంటే ఆయన కుమారులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో పరిస్థితులను చక్కదిద్దేవారు. కుటుంబ వారసత్వ రాజకీయ ప్రతినిధిగా..

కిరణ్ కుమార్ రెడ్డి అరంగేట్రం

తండ్రి నల్లారి అమర్నాథరెడ్డి వారసత్వంతో కిరణ్ కుమార్ రెడ్డి 1989లో పోటీ చేసి గెలిచారు మళ్ళీ 1994లో ఓటమి చెందిన, 1999 నుంచి 2004 ఎన్నికల వరకు వరుసగా విజయం సాధించారు. ఈ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నియోజకవర్గ బాధ్యతలు చూసుకునేవారు. మొదటిసారి గెలిచినప్పుడు మినహా, ఆ తర్వాత 15 ఏళ్లు ఆయన ప్రజలతో సత్సంబంధాలు సాగించిన సందర్భాలు చాలా తక్కువ. అని పీలేరు ప్రాంత ప్రజలు చెబుతారు. చివరి రెండుసార్లు కూడా టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు చేసిన ప్రయోగం వల్ల కిరణ్ కుమార్ రెడ్డికి కలిసి వచ్చింది.

2004, 2009 ఎన్నికల్లో జిల్లా జడ్జిగా ఉన్న గుర్రంకొండ మండలానికి చెందిన ఇంతియాజ్ అహమ్మద్‌ను ఉద్యోగానికి రాజీనామా చేయించిన చంద్రబాబు నాయుడు వాల్మీకిపురం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయించారు. ఈయన రాక కిరణ్ కుమార్ రెడ్డి విజయానికి బాటలు వేసింది అని చెప్పడంలో సందేహం లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో చీఫ్ విప్ గాను ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్ కావడానికి ఆయనకు మార్గం సుగమమైంది. జెంటిల్మెన్ రాజకీయాలు సాగించడానికి ఆయన ఎక్కువ అలవాటు పడ్డారు. వాల్మీకిపురం ఆ తర్వాత పీలేరు గా మారిన నియోజకవర్గాల్లో నాయకులతో కాస్త ఆలస్యంగా సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు.

కిరణ్ సీఎం.. ఎదిగిన తమ్ముడు

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి మొదట్లో వ్యతిరేకిగా ఉన్నప్పటికీ తర్వాత ఆయన అంతరంగీకుల్లో ఒకరిగా చేరిపోయారు. డాక్టర్ వైయస్సార్ మరణంతో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన వర్గానికి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పెద్దలు వ్యూహాత్మకంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో ఆయన కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు ఇతరత్రా కలాపాలకు పరిమితమయ్యారు. ఇదే వ్యవహారం ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి మరింత కలిసి వచ్చింది. జనంతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరుచుకున్న కిషోర్ కుమార్ రెడ్డి నియోజకవర్గం మొత్తం కార్యకలాపాలను చక్క దిద్దుతూ, అందరికీ చేరువయ్యారు.

మరువలేని అభివృద్ధి..

పులివెందల నియోజకవర్గం స్ఫూర్తితో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక పీలేరు నియోజకవర్గాన్ని దేశ చిత్రపటంలో నిలిపానడటంలో సందేహం లేదు. తన సొంత మండలం కలిగిరి సమీపంలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయించడం, ఐటీబీపీ, సీఆర్‌పీఎఫ్ బెటాలియన్లను ఏర్పాటు చేయించారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్, మహిళల డిగ్రీ కాలేజ్, కృషి విజ్ఞాన కేంద్రం, హార్టికల్చర్, టెక్నికల్ పాలిటెక్నిక్ వంటి విద్యా సంవత్సరం ఏర్పాటు చేయించడం ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా చివరి రోజుల్లో మరువలేని అభివృద్ధిని నియోజకవర్గ ప్రజలకు అందించారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కాంగ్రెస్ వదిలి.. కాషాయ జెండా పట్టి..

దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో మసిలిన నల్లారి కుటుంబం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దూరంగా జరిగారు. ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత ఆపద్ధర్మ సీఎంగా ఉండడానికి కూడా ఇష్టపడలేదు. అప్పటి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రెండు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి బయటకు వచ్చి గత ఏడాది ఏప్రిల్ ఏడవ తేదీ బిజెపిలో చేరారు. ఆ పార్టీ నిర్వహించే బహిరంగ సభలో కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారు.

ఆదరణ ఎలా ఉంటుందో..

తాజా ఎన్నికల కోసం ఆయన రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని ఊహగానాలు వినిపిస్తూ వచ్చాయి. బిజెపి మొదట ప్రకటించిన ఆరు ఎంపీ స్థానాల్లో రాజంపేట పేరు ప్రస్తావన లేదు. ఆ తర్వాత విజయనగరం బదులుగా రాజంపేట స్థానాన్ని బిజెపి కోరుకోవడంతో ఇక్కడి నుంచి నల్లారి కిరణ్ కుమార్‌ని పోటీ చేయించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ ఆదివారం రాత్రి పేరు ప్రకటించింది.

దీంతో ఆయన పది సంవత్సరాల అజ్ఞాతం వీడి బ్యాలెట్ పోరులోకి వస్తున్నారు. పీలేరు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా పోటీలో ఉన్న తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తోనే సత్సంబంధాలు లేని కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికలను ఎలా నెట్టుకొస్తారు అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. ప్రత్యక్ష కార్యాచరణలకు దిగే కిరణ్ కుమార్ రెడ్డిని కూటమి శ్రేణులు నాయకులు ప్రధానంగా పీలేరు ప్రాంతం ప్రజలు ఎలా ఆదరిస్తారు అనేది వేచి చూద్దాం.

Tags:    

Similar News