-కెంగార మోహన్
కర్నూలుకు చెందిన ప్రముఖ సముద్రపు శాస్త్రవేత్త డాక్టర్ ఎంపీ రెడ్డి (90) మంగళవారం ఉదయం కర్నూలులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో మరణించారు. గత వారం రోజులుగా గొంతు సమస్యతో బాధపడుతున్న ఆయన ఉదయం తుది శ్వాస విడిచారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లండన్ రైబరీలో భారతదేశానికి చెందిన ముగ్గురు వ్యక్తుల పేర్లు ఉండగా అందులో ఈయన పేరు ఉండడం గమనార్హం. అంతటి మహోన్నత శిఖరం కర్నూలు జిల్లా వాసి అని చాలామందికి తెలియదు. సముద్ర శాస్త్రం పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ విశ్వవిద్యాలయాల్లోనైనా ఈయన రాసిన పుస్తకాలు చదవాల్సిందే.
ఆకాశమంత వ్యక్తిత్వం-సముద్రమంత విజ్ఞానం
1977లో భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారిచేత ప్రశంసలందుకుని వారిచేత అభినందనలు పొందిన విశిష్టవ్యక్తి మన రాయలసీమ వాసి అంటే ఒకింత ఆశ్యర్యం వేస్తుంది. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, సన్మాన సత్కారాలు అతడికి కొత్తకాకపోయినా మనకు గర్వకారణం.
దేశంలో ఎన్నో రంగాల్లో ప్రతిభ కనబరచిన వారిని చూస్తుంటాం. వింటుంటాం. కాని సముద్రశాస్త్రంలో ప్రపంచ ఖ్యాతిని గాంచిన వ్యక్తిగా సాహిత్యాభిమానిగా, రచయితగా, శాస్త్రవేత్తగా బహుముఖీయ ప్రజ్ఞకలిగిన వ్యక్తిని మనం ఈ శీర్షిక ద్వారా తెలుసుకోవాల్సిన సందర్భం. అతనిని పరిచయం చేయాలంటే పుటలు సరిపోవు. పుస్తకాలే రాయాలి. ఆయన సముద్రశాస్త్రంపై రాసిన పుస్తకాలు దాదాపు ప్రపంచంలో యాభై దేశాలకు పైగా వివిధ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచంలోని అత్యంత ప్రమాణాలుగల విశ్వవిద్యాలయాలైన టాప్ రేటేడ్ టాప్ టెన్ యూనివర్శీటీలన్నింటిలోనూ ఈయన రాసిన పుస్తకాలే సముద్రశాస్త్రాన్ని చదివే విద్యార్థులకు పాఠాలు. ఆయన ఆకాశమంత వ్యక్తిత్వం కలిగి, సముద్రమంత విజ్ఞానం సంపాదించుకున్న మహోన్నత శాస్త్రవేత్త.
కర్నూలు జిల్లా ఉయ్యాల వాడ మండలం సుద్దమల్ల గ్రామంలో మద్దమ్మ, చిన్న మద్దిలేటి దంపతులకు జన్మించారు. బాల్యంలోనే తల్లి 1942లో కలరా జబ్బు సోకి మరణించడంతో అమ్మ ప్రేమను ఆస్వాదించలేకపోయారు. స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్నారు. 1944 జూన్‌లో ఆరవతరగతి చేరారు. ఆళ్ళగడ్డ ఉన్నతపాఠశాలకు రైతుల ఉన్నత పాఠశాల అనే పేరుండేది. ఆ పాఠశాలలో చదివి యస్ యస్ ఎల్ సి 1951లూ పూర్తి చేశారు. ఇంటర్మీడియేట్ గుంటూరు ఏసి కాలేజిలో యంపిసి గ్రూపు, అలాగే బియస్సీ పూర్తి చేశారు. 1952లో జరిగిన సాదారణ ఎన్నికల్లో నంద్యాలలో జరిగిన ఎన్నికల బహిరంగసభకు నెహ్రూ, నీలం సంజీవరెడ్డి హాజరయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో ఓడిపోగా కమ్యూనిష్టుపార్టీ ఆంధ్రదేశంలో ఎక్కువ స్థానాల్లో గెలిచింది. యంఎస్సీ కి సకాలంలో ధరఖాస్తు చేయనందున తాత్కాలిక ఉపాధ్యాయులుగా ఆదోని డివిజన్ కోసిగి ఉన్నత పాఠశాల తాత్కాలిక ఉపాధ్యాయులుగా నాలుగు నెలలు 99 వేతనంతో పనిచేసి అక్కడ సరైన భోజన వసతి లేకపోవడంతో రాజీనామా చేసి వెనక్క వచ్చేశారు.
యంఎస్సీ సీటు కొరకు మద్రాసు వెళ్ళి ప్రయత్నించగా రాకపోయే సరికి తిరిగి తాత్కాలిక ఉపాధ్యాయులుగా ఎమ్మిగనూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చేరారు. అక్కడ పని చేస్తున్నప్పుడే ఆంధ్రా విశ్వవిద్యాలయంలో యంఎస్సీ మెటిరియాలజీ అండ్ ఓషనాగ్రఫి సీటు రావడంతో ఉపాధ్యాయులుగా రాజీనామా చేసి విశాఖ వెళ్ళి చదివి ఫస్ట్ క్లాస్‌లో 1959లో పూర్తి చేశారు.
అదే విశ్వవిద్వాలయంలో పిహెచ్‌డి చేరి అద్భుత ప్రతిభ కనబరచి విశేష పరిశోధన చేసి 1963లో పూర్తి చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఆదే సంవత్సరం నేషనల్ రిసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడా పోస్టు డాక్టరేట్ ఫెలోషిప్ రావడంతో కెనడా పయనమయ్యారు. అంతకు ముందే వివాహం చేసుకొని వెళ్ళాలని కుటుంబసభ్యులు కోరడంతో ఇటిక్యాల పాడు గ్రమం జల్లాపురం నివాసి లక్ష్మీకాంత రెడ్డి కుమార్తె కమలను 12-10-1964న కర్నూల్లో వివాహమాడారు.
కెనడాలో పరిశోధన..
పోస్టు డాక్టరేట్ రీసెర్చి ఇన్ కెనడాలో మొదటి ప్రాజెక్టుగా వేవ్ కండీషన్స్, లాంగ్ షోర్ కరెంట్స్, లిట్టోరల్ డ్రిఫ్ట్ సమర్ధవంతగంగా పూర్తి చేశారు. ప్రాజెక్టులో భాగంగా ప్రపంచ దేశాలను చట్టిముట్టారు. విస్తృతంగా అధ్యయనం, పరిశోధన చేశారు. రెండవ ప్రాజెక్టుగా సముద్రమట్టాలు, టైడల్ స్ట్రీమ్స్ అండ్ కరెంట్ అబ్సర్వేషన్స్, డ్రిప్టు పోల్సు, సౌండిగ్సు, వెదర్ అబ్సర్వేషన్స్, ఇఎంఫ్ రికార్డింగ్స్ పరిశోధన ప్రాజెక్టును పూర్తిచేశారు. హాలిఫాక్స్‌లో ఉండగా మద్దిలేటి దంపతులకు మనోహర్ జన్మించారు. నాల్గు సంసవత్సరాల విదేశీ పరిశోధన పూర్తి చేసుకొని 1968 ఏప్రెల్ 7న ఇండియాలు బయలుదేరి వచ్చారు.
కర్నూలు జిల్లా కోసిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కుల సంపాదించిన విద్యార్థులకు నగదు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నప్పటి ఫోటో
ఇండియాలో వివిధ హోదాల్లో..
ఇండియాలో ప్రతిష్టాత్మక సియస్‌ఐఆర్ భారత ప్రభుత్వ సంస్థలో సైంటిఫిక్ పూల్ ఆఫీసర్‌గా 1969 జూలై 20న గోవాలో విధుల్లో చేరారు. ఉద్యోగమే కాదు తన జిజ్ఞాసంతా పరిశోధన మీదే సాగించారు. గోవాలో మొదటి పరిశోధనలో భాగంగా ఏ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ వేవ్ కండీషన్స్ అండ్ సెడిమెంట్ ట్రాన్స్‌పోర్టు నియర్ మార్మొగోవా హార్భర్ అనే అంశంపై సాగించారు. అది పూర్తయిన వెంటనే రెండవ ప్రాజెక్టుగా సెడిమెంటు మూవ్‌మెంట్ ఇన్ రిలేషన్ టు వేవ్ రిప్రాక్షన్ అలాంగ్ ద వెస్ట్ కోస్ట్ ఇండియా అనే అంశంపై పరిశోధించారు. అక్కడ విధులు నిర్వర్తిస్తుండగా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్‌లో అసోషియేట్ ప్రొఫెసర్ మరియు హెచ్‌ఓడిగా ఎంపికై మంగళూరులో చేరి సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారు. ప్రిన్సిపల్‌గా ఇన్వెస్టిగేటర్‌గా అనేక రిసెర్చు ప్రాజెక్టులు నిర్వహించారు. 1990 అక్టోబర్ నుండి 1991 జనవరి వరకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ నార్త్ వేల్స్ స్కూల్ ఆఫ్ ఓషియన్ సైన్సెస్ మీనై బ్రిడ్జ్, యూనైటెడ్ కింగ్ డమ్‌కు విజిటింగ్ స్కాలర్‌గా వెళ్ళారు. తిరిగి వచ్చి1998 వరకు మంగళూరులో వివిధహోదాల్లో పని చేశారు.
తెలుగు భాషా సేవలో...
చిన్ననాటి నుండే తెలుగు భాషా సాహిత్యాల పట్ల మమకారం కలిగి వుండటం వల్ల 1972లో మంగళూరులోని తెలుగుసమితిలో సభ్యులుగా ఉన్నారు. అక్కడి తెలుగువారి కోసం కార్యకర్తగా పనిచేశారు. 1983లో అధ్యక్షులయ్యాక అనేక భాషా సాహిత్య కార్యక్రమాలు చేశారు. 200 మందిని సభ్యులుగా చేర్పించి అనేక భాష, సాహిత్య, సంగీత, నృత్య కార్యక్రమాలను నిర్వహించారు. 1984లో సమితిని రిజిష్టర్ చేయించి పారదర్శకంగా కార్యక్రమాలు చేసేలా చర్యలు చేపట్టారు. అక్కడ తెలుగు విద్యార్థులకు విద్యలో ప్రతిభ కనబరచిన వారికి అవార్డులు, నగదు ప్రోత్సాహక బహుమతులు, గోల్డ్ మెడల్స్ అందించేలా సాంఘిక కార్యక్రమాలు చేశారు.
1998లో రిటైర్ అయి కర్నూల్లో స్థిరపడినా ఇటీవల తన స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డకు చేరి అక్కడే గడుపుతున్నారు. విద్యార్థులకోసం అనేక పుస్తకాలు రాశారు. అవి జాతీయ అంతర్జాతీయ ప్రచురణ సంస్థలు ముద్రించాయి. ఆయన రాసిన పుస్తకాలన్నీ సముద్రశాస్త్రం మీదే.
2009లో తెలుగు కళాస్రవంతి అనే సాహిత్య సంస్థను ప్రారంభించి సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నారు. 2019లో రాయలసీమ ప్రచురణలు ముద్రించిన "నీళ్ళింకని నేల" రాయలసీమ కథల సంకలనాన్ని తన కళాస్రవంతి ద్వారానే ఆవిష్కరణ సభ జరిపారు.
‘నీళ్లింకని నేల’ పుస్తకావిష్కరణ సభలో
వయోభారమైనప్పటికీ సాహిత్య సేవ చేస్తూ కవులను కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. వందలాది పరిశోధనా వ్యాసాలు, పుస్తకాలు రాసిన గొప్ప శాస్త్రవేత్త డా.మద్దులేటి రెడ్డి. ఆయనను తెలుగు సాహిత్యలోకం సాహితీరత్న బిరుదుతో సత్కరించింది. ప్రదాన సభా సూత్రధారి అని పిలుస్తుంది. సముద్రశాస్త్రం బాలలకు అందించాలన్న లక్ష్యంతో బాలల సముద్రశాస్త్రం అనే పేరుతో పుస్తకాలు రాశారు. తన జీవిత చరిత్రను సముద్ర శాస్త్రవేత్త జీవన ప్రస్థానం పేరుతో ఆత్మకథనం రాసుకున్నారు. తెలుగు భాషా సాహిత్యాభిమానిగా, రచయితగా, శాస్త్రవేత్తగా ఖ్యాతి గడిరచిన డా.యంపి మద్దులేటి రెడ్డి భారతజాతి గర్వించదగ్గ శాస్త్రవేత్త. ఆయన మన రాయలసీమ వాసి కావడం మనందరికీ గర్వకారణం.
ఆయన మరణం తీరని లోటు: సాహితీ స్రవంతి
ప్రముఖ సముద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఎంపీ ఏం రెడ్డి మరణం సాహిత్య రంగానికి, శాస్త్రీయ రంగానికి తీరని లోటని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్, కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల బసప్ప, ఆవుల చక్రపాణి యాదవ్ లు పేర్కొన్నారు.
మానవతా వాదిని కోల్పోయాం: రాయలసీమ ప్రచురణలు
ఎంపీ ఏం రెడ్డి గొప్ప మానవతావాదని సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని అతని మరణం తమకు దుఃఖాన్ని మిగిల్చిందని రాయలసీమసంపాదకులు గౌరవ సంపాదకులు మారుతీ పౌరోహితం, సంపాదకులు ఇనాయతుల్లా సంతాపం వ్యక్తం చేశారు.