శోభాయమానంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర

తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర సోమ‌వారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం నుంచి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది.

Update: 2024-03-04 13:39 GMT
Source: Twitter

ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్



తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకువచ్చిన శ్రీ లక్ష్మీ కాసులహారం చూసిన భక్తులు పులకించిపోయారు. టీటీడీ పరిపాలన భవనం నుంచి అతి పెద్ద లక్ష్మీకాసులహారాన్ని శోభాయాత్రగా తీసుకువెళ్లి శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటరమణస్వామి వారి ఆలయంలో సమర్పించారు. మహాశివరాత్రి నేపథ్యంలో కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి టీటీడీ పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించడం మనవాయితీ. ఈ ఏడాది కూడా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి పట్టు వస్త్రాలు తీసుకువెళ్లి శాస్త్రోక్తంగా శ్రీశైలం మల్లన్న దేవస్థానం అధికారులకు అందించారు.

తిరుపతి ఆధ్యాత్మిక సిగలో ఏడాది పొడవునా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీ కోదండరామస్వామి ఆలయాల బ్రహ్మోత్సవాలకు విశేష ప్రాధాన్యత ఉంది. కోవలో... శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి.

ఆచారం ప్రకారం ఈ ఏడాది కూడా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకువచ్చిన శ్రీ లక్ష్మీ కాసుల హారాన్ని ఏనుగు అంబారీపై భక్తుల కోలాటాలు గోవింద నామస్మరణ మధ్య తిరుపతి నగరంలో ఊరేగించారు . ఆలయం వద్ద ఈ కాసుల హారాన్ని టీటీడీ జేఈవో వీర‌బ్ర‌హ్మం దంప‌తులు అక్కడి పండితులకు అందించారు. ఈ కాసుల హారం అలంకరణలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి సోమవారం రాత్రి గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.

కాసుల హారాన్ని ఊరేగిస్తున్న టిటిడి అధికారులు


తిరుమల నుంచి కాసులహారం..

ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారం తిరుమల ఆలయ పేష్కర్ శ్రీహరి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనానికి తీసుకొచ్చారు. ఈ లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండరామాలయం, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది. భజనలు, కోలాటాలతో కోలాహలంగా యాత్రసాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు.

" టీటీడీ స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించే సమయంలో గరుడసేవకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీకాసుల హారాన్నితిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా వెళ్లి సమర్పించడం ఆనవాయితీ" అన్నారు కార్యక్రమంలో ఆలయప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, విజివో బాలిరెడ్డి, సూపరింటెండెంట్‌ చెంగల్ రాయలు, అధికారులు, భ‌క్తులు పాల్గొన్నారు.
 

శ్రీశైలంలో పట్టు వస్త్రాలు తీసుకువెళ్తున్న టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి



శ్రీశైలం మల్లన్న సేవలో టీటీడీ
జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి మహా శివరాత్రి పురస్కరించుకొని కర్నూలు జిల్లా శ్రీశైలంలో మల్లన్న బ్రహ్మోత్సవాలు కనువిందుగా జరుగుతున్నాయి. నాల్గవ రోజైన సోమవారం శ్రీశైలం మల్లన్న, అమ్మ వార్లకు విశేషపూజలు వహిస్తారు. సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం, సంప్రదాయ జానపద కళారూపాలతో కళార్చన అందించనున్నారు. టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పించడం ఆనవాయితీ. ఆ ఆచార వ్యవహారాలను పాటిస్తూ టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తిరుమల ఆలయం నుంచి పట్టు వస్త్రాలు తీసుకువెళ్లారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం నుంచి 5వ తేదీ శ్రీశైలం మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.


Tags:    

Similar News