జోగి రమేశ్ కి అగ్రిగోల్డ్ చిక్కులు, రంగంలోకి సీఐడీ
డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లు వేసి విక్రయం – తెర వెనుక జోగి పాత్ర;
By : The Federal
Update: 2025-05-24 02:58 GMT
వైసీపీకి చెందిన మరో మాజీ మంత్రి చిక్కుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అందరిపై ఒంటి కాలి మీద లేచిన జోగి రమేశ్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా విక్రయించిన వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కు పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. సీఐడీ, ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న భూములను కొనుగోలు చేసినట్టుగా డాక్యుమెంట్లు సృష్టించి, వాటినే ప్లాట్లుగా వేసి విక్రయించినట్టు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో జోగి రమేశ్ తన కొడుకు, సోదరుడిని కూడా రంగంలోకి దింపారు. భూ లావాదేవీలన్నీ వారి పేరిటే జరిగాయి. రెవెన్యూ, సీఐడీ, ఏసీబీల సంయుక్త బృందం మే 23వ తేదీ సాయంత్రం క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఈ అక్రమాలను నిగ్గుతేల్చింది. సీఐడీ, ఈడీ అటాచ్‌లో ఉన్న భూములను కొనుగోలు చేయడం లేదా అమ్మకాలు సాగించే అధికారం ఎవరికీ లేదు. జోగి రమేశ్ సాగించిన భూ దందాలో ఆయన కుటుంబం భారీగా లబ్ధి పొందినట్టు రెవెన్యూ అధికారి చెప్పారు. ప్రస్తుతం ఆయన కుమారుడు జోగి రాజీవ్ బెయిల్‌పై బయటకు వచ్చారు.
సీఐడీ రిపోర్ట్ ప్రకారం, సీఐడీ అటాచ్‌లో ఉన్న అగ్రిగోల్డ్ భూములను జోగి రమేశ్ కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్లు సృష్టించారు. విజయవాడ రూరల్‌లోని అంబాపురం సర్వే నం.88లో జరిగిన ఈ లావాదేవీలు 2022–23 మధ్య జరిగాయి. జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్, సోదరుడు జోగి వెంకటేశ్వరరావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
అసలు వీటి మేము సర్వే నం.88లో కొనుగోలు చేశామంటూ సృష్టించిన డాక్యుమెంట్లు అనంతరం సర్వే నం.87కి సవరణ రిజిస్ట్రేషన్ల ద్వారా మార్చినట్టు అధికారులు గుర్తించారు.
వాస్తవానికి ఈ భూములు అగ్రిగోల్డ్ కంపెనీకు చెందినవని, 2024లో విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అనంతరం ఏసీబీ విచారణ ప్రారంభమైంది. దీనిపై అప్పటి తహశీల్దార్ జాహ్నవి కూడా ఈ భూముల అస్తిత్వాన్ని అగ్రిగోల్డ్ పేరిట నిర్ధారించారు.
ఈ భూముల్లోని 2,160 చదరపు గజాల స్థలాన్ని 7 ప్లాట్లుగా విభజించి, వాటిని వైసీపీ నేతలు, వారి బంధువులకు విక్రయించినట్టు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. 2023లో జరిగిన ఈ విక్రయాల్లో పడిగపాటి దుర్గా ప్రసాద్, దుర్గా భవాని, సోముల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పేర్లు లావాదేవీల్లో ఉన్నాయి.
ఈ వ్యవహారం వెనుక జోగి రమేశ్ తెర వెనుక వ్యవహరించారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికైతే జోగి కుమారుడు జోగి రాజీవ్ బెయిల్‌పై విడుదల కాగా, చివరికి ఈ స్కాంలో ‘అంతిమ లబ్ధిదారుడు’గా జోగిని కూడా కేసులో చేర్చే అవకాశాలు CID పరిశీలిస్తోంది.
చట్టాన్ని ఉల్లంఘించిన మాజీ మంత్రి?
CID అభిప్రాయం ప్రకారం, ఆస్తులు అటాచ్ అయిన తర్వాత వాటిని అమ్మడం సరైనది కాదు. అయినప్పటికీ డాక్యుమెంట్లను సృష్టించి, నకిలీ సర్వే వివరాలతో ప్లాట్లుగా చేసి ఆస్తులు విక్రయించడాన్ని ఒక ఉద్దేశపూర్వక కుట్రగా పరిగణిస్తోంది.
ఈ వ్యవహారం వైసీపీకి గణనీయమైన రాజకీయ దెబ్బ కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారం ఉన్న సమయంలో ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకున్న నాయకులకు ప్రజా తీర్పుతో పాటు న్యాయ తీర్పు ఎదురయ్యే రోజులు దగ్గరలోనే ఉంటాయని వారు అంటున్నారు.
అగ్రీగోల్డ్ వ్యవహారం ఇలా..
పేద, మధ్య తరగతి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం.. ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు అక్రమంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ర్యాపిడ్ గ్రోత్ ఏరియాలలో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసింది. భూములే కాకుండా భవనాలు, అనేక వాణిజ్య సముదాయాలను కొనుగోలు చేసింది. కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్న తర్వాత ప్రజలకు అగ్రిగోల్డ్ యాజమాన్యం కుచ్చు టోపీ పెట్టింది. దీంతో అగ్రిగోల్డ్ యాజమాన్యం మీద కేసు నమోదైంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం కొనుగోలు చేసిన భూములను సీఐడీ స్వాధీనం చేసుకుంది. వాటిలో విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో కొనుగోలు చేసిన భూములు కూడా ఉన్నాయి. 2024 మార్చిలో అగ్రిగోల్డ్ యాజమాన్యం తమ భూములను ఇతరులకు విక్రయించారని విజయవాడ టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అప్పటి విజయవాడ రూరల్ తహశీల్దార్ జాహ్నవికి సమగ్ర సమాచారం కోసం లేఖ రాశారు. పోలీసులు, ఆ తర్వాత ఏసీబీ అధికారుల నుంచి వచ్చిన లేఖల మేరకు మార్చి 20వ తేదీన తహశీల్దార్ జాహ్నవి ప్రతి లేఖ రాశారు. ఆ భూములు అగ్రిగోల్డ్ యాజమాన్యానివేనని అప్పట్లో ప్రాథమికంగా తేల్చారు. దీని ఆధారంగా ఏసీబీ రంగంలోకి దిగి కేసు పెట్టింది.