వరద నీటిలోనే లంక గ్రామాలు

గోదావరి నది వరద ప్రవాహ ఉధృతికి తూర్పు గోదావరి, అంబేద్కర్‌ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, వెస్ట్‌ గోదావరి, ఏలూరు జిల్లాల్లో లంక గ్రామాలు అతలాకుతలం అయ్యాయి.

Update: 2024-07-30 08:00 GMT

ఏపీలో వరదల వల్ల వందల సంఖ్యలో గ్రామాలు ఇంకా నీటి మునకలోనే ఉన్నాయి. రాకపోకలు స్తంభించాయి. పడవలు, పంటిల్లో కూడా వెళ్లలేని పరిస్థితులు వచ్చాయి. వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం ప్రకటించే దానికంటే అక్కడ ఉన్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి. గోదావరి ఒక రోజు తగ్గుతూ మరో రోజు వరద ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికి పది రోజుల నుంచి వరదల ఎఫెక్ట్‌ ఈ నాలుగు జిల్లాల్లో ఉంది. అధికారికంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం పెదవాగు ప్రాజెక్టు తెగిపోవడం వల్ల 112 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. గోదావరి వరద నీరు ఒకరోజు తగ్గుతూ మరో రోజు పెరుగుతోంది.

గోదావరి నదిపై నిర్మించిన దవళేశ్వరం ప్రాజెక్టు కింద నది మూడు పాయలుగా విడిపోయి సముద్రంలో కలుస్తుంది. గౌతమి, వశిష్ట, వైనతేయ పాయలు ఉన్నాయి. ఇందులో విశిష్ట, వైనతేయ పాయల నుంచి గోదావరి నీరు ప్రవహించి గ్రామాలను ముంచెత్తింది. ప్రధానంగా కొత్తపేట, పి గన్నవరం, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రాపురం, రాజానగరం, కోవూరు వంటి నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. నేటికీ ఈ నియోజకవర్గాల్లోని కుటుంబాలు వరద ముంపు నుంచి తేరుకోలేదు.
కమ్మరిగూడెంలో 150 ఇండ్లకు, అల్లూరి నగర్‌లో 94 ఇండ్లకు, కోయమాదరంలో 39 ఇండ్లకు, రాళ్లపుడిలో 4, ఇప్పులగుంపులో 13 ఇండ్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనాలు తయారు చేశారు. జంగారెడ్డి గూడెం ఆర్డీవో కె అద్దయ్య ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. గ్రామాలలో పడిపోయిన ఒక్కో ఇంటికి టార్పాలిన్‌ పట్టలు పంపిణీ చేశారు. పెదవాగు ఆనకట్ట తెగటం వల్ల జూలై 19 నుంచి జూలై 24 వరకు ముంపునకు గురైన వేలేరుపాడు మండలంలోని ౧౨ గ్రామాలలో గల ప్రభుత్వ భవనాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికారులు ఇక్కడి వారికి నిత్యావసర వస్తువులు ఇచ్చారు. మంచినీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఇంకా వరద నీరు ఇండ్ల నుంచి బయటకు పోలేదు.
పశ్చిమ గోదావరి నీటమునిగిన 43 గ్రామాలు
వరదల వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలోనూ తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి వివరించారు. ఏడు మండలాల్లోని 43 గ్రామాలు వరదల తాకిడికి నీట మునిగాయి. 8 గ్రామాలలోనికి వరద నీరు చొచ్చుకు వచ్చింది. మూడు పట్టణ ప్రాంతాలు కూడా వరద తాకిడి గురికాగా, భీమవరం పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో వరద నీరు చొచ్చుకు వచ్చింది. 20 మండలాల్లోని 37,182 హెక్టార్లలో వరి నాడుమళ్ళు, వరి నాట్లు దెబ్బ దెబ్బతిన్నాయి. సుమారు రూ. 4,.52 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పంట నష్టానికి ఇన్పుట్‌ సబ్సిడీ కింద రూ.4,151.74 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశారు. అలాగే 614 మంది రైతులు సాగు చేస్తున్న ఉద్యానవన పంటలు 154.46 హెక్టార్లు నీట మునిగాయి. సుమారు రూ.406 లక్షలు మేర నష్టం వాటిల్లిందని అంచనా. ఉద్యానవన పంటలకు రూ. 405.87 లక్షలు ఇన్పుట్‌ సబ్సిడీ అవసరం అవుతుంది. 14 గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
దాదాపు 161 కుటుంబాల్లోని 424 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన ఏర్పాట్లు, అవసరమైన మౌలిక వసతులు అధికారులు కల్పించారు. 66 ఆర్‌ అండ్ బి రహదారులు 179.820 కిలోమీటర్ల పొడవున దెబ్బతిన్నాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ.1,288.60 లక్షలు, శాశ్వత మరమ్మత్తులకు రూ.14,460 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశారు. అలాగే 274.27 కిలోమీటర్ల పరిధిలోని 105 పంచాయతీరాజ్‌ రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక మరమత్తులకు రూ.130 లక్షలు, శాశ్వత రోడ్లు ఏర్పాటుకు రూ.8,570 లక్షలు కావాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గ్రామాల్లోకి మంచినీటి సరఫరా జరుగుతోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ సి నాగరాణి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. జిల్లాలో ఇంకా కొన్ని లంక గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. ఈ అంచనాలు ప్రాథమికంగా తయారు చేసినవే. పూర్తి స్థాయి నష్టం అంచనాలు తయారు చేయాల్సి ఉంది.
వరదల్లో చిక్కుకున్న 10 గ్రామాలు
ఏలూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో తీవ్రమైన నష్టం జరిగింది. జిల్లాలో వరద ప్రభావం పూర్తిగా తగ్గేవరకూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్‌ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. వరదల వల్ల 10 గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వివిధ శాఖలకు సంబంధించి రూ. 187 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కలెక్టర్‌ తెలిపారు. వరద ముంపుకు గురైన కుక్కునూరు, వేలేరుపాడు గ్రామాలలోని 5 వేల మంది ప్రజలను 15 పునరావాస కేంద్రాలకు తరలించారు. కొయిదా, కట్కూరు, నార్లవరం, రుద్రంకోట, తోటకూరగొమ్ము, రేపాకగొమ్ము, నెమలిపేట, మేడేపల్లి, రామవరం, గొమ్ముగూడెం, మాధవరం, లచ్చిగూడెం, కౌడిన్యముక్తి, తదితర గ్రామాల ప్రజలను వరద సహాయక కేంద్రాలకు తరలించారు.
231 ఇళ్ళు నేల కూలాయి. 30 గొర్రెలు, పాడిపశువుల చనిపోయాయి. 5,305 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 64 హెక్టార్లలో ఉద్యానవనాలు నీట మునిగాయి. 333 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బి రోడ్లు దెబ్బతిన్నాయి. దీనివల్ల రూ. 167 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పంచాయతీ రాజ్‌ శాఖకు సంబంధించి 13 రోడ్లు దెబ్బతిన్నాయి. దీనివల్ల రూ. 75 లక్షల నష్టం వాటిల్లింది. మైనర్‌ ఇరిగేషన్‌కు సంబంధించి 17 నీటివనరులు దెబ్బతిన్నాయి. రూ. 3 కోట్ల నష్టం వాటిల్లింది. ఆర్‌డబ్ల్యూఎస్‌ పైప్‌ లైన్లు, విద్యుత్‌ లైన్లు దెబ్బతిన్నాయి. అధికారులు మరమ్మతులు చేపట్టేందుకు కలెక్టర్‌ ఆదేశించారు. ఇళ్ళు దెబ్బతిన్న కుటుంబాలకు 800 టార్పాలిన్లు అధికారులు అందించారు. వరద ప్రమాదం పూర్తిగా తగ్గేవరకూ కేంద్ర, రాష్ట్ర విపత్తు నివారణ దళాలు, బోట్లను సిద్ధంగా ఉంచారు. వరద ప్రభావిత గ్రామాలలో విద్యుత్, సమాచార వ్యవస్థలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో వరదల వల్ల జరిగిన నష్టంపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేసినట్లు కలెక్టర్‌ కె వెట్రిసెల్వి తెలిపారు.
కోనసీమలో నీట మునిగిన 47 గ్రామాలు
వరదలు మూలంగా డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ (అమలాపురం) జిల్లాలో 12 మండలాలలో 47 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. వరదల్లో 21,492 కుటుంబాలు చిక్కుకున్నాయి. 75 బోట్లను ఉపయోగించి ఈ కుటుంబాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లాలో ముంపు బాధితుల సంరక్షణ కొరకు ఒక జాతీయ విపత్తు బృందం సహాయక చర్యలు చేపట్టింది. అల్లవరం మండలం బోడసకుర్రు, ముమ్మిడివరం మండలం తానే లంక గ్రామాలలో పునరావస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 293 కుటుంబాలకు చెందిన 809 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అధికారులు సఫలమయ్యారు. ముంపు బాధిత లంక గ్రామాలలో 60 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25 కేజీల బియ్యం లీటర్‌ పామ్‌ ఆయిల్, కిలో కందిపప్పు, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళ దుంపలను గుర్తించిన 16,182 కుటుంబాలలో 15,592 కుటుంబాలకు అందించారు. వరద నీరు ఇంటిలో చేరిన కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక సహాయంగా ప్రక టించిన రూ. 3,000 రూపాయలు అందించేందుకు 327 కుటుం బాలను గుర్తించారు. వీరు పునరావాస కేంద్రాల నుండి ఇంటికి వెళ్లే సమయంలో ఈ మూడు వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ మేరకు వరదలపై పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించినట్లు జిల్లా కలెక్టర్‌ ఆర్‌ మహేష్‌ కుమార్‌ తెలిపారు.
Tags:    

Similar News