‘ఎవరికీ నష్టం లేదు’.. వేదాంత ధోరణిలోకి జగన్..

వైసీపీ పార్టీని వీడుతున్న వారిని ఆపొద్దని వైఎస్ జగన్ అన్నారు. అమ్మతో కలిసి పార్టీని స్థాపించాను. అక్కడి నుంచే మళ్ళీ ప్రయాణం ప్రారంభిస్తానని అన్నారు. మరి ఈసారి విజయమ్మ వస్తారా?

Update: 2024-07-04 06:50 GMT

అధికారం పోయినప్పటి నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ తీరులో మార్పు వచ్చింది. తీరులోనే కాదు.. నడవడిక, మాటలో కూడా చాలా మార్పు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న అధికారం పోయినా పోరాటం వీడకూడదని, అసెంబ్లీలో కాకుండా శాసనమండలిలో టీడీపీకి నిలదీద్దామని, ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం చేద్దామని వైఎస్ జగన్ తమ పార్టీ ఎమ్మెల్సీలను ఉత్తేజపరిచారు. ఇలాంటి సమయాల్లోనే అంతా కలిసికట్టుగా ఉండాలని నేతలు, శ్రేణులకు కూడా పిలుపునిచ్చారు. కానీ కొంత కాలంగా వైసీపీలో వలసలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ వలసలపై జగన్ స్పందించారు. వేదాంత ధోరణిలో ఆయన ఈ సమస్యపై మాట్లాడారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

షరా మామూలే

ప్రభుత్వాలు మారిన సమయాల్లో ఓడిపోయిన పార్టీ నుంచి నేతలు బయటకు వచ్చేయడం కొత్తేమీ కాదు. ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఓటమి ఏ స్థాయిలో ఉందనేదానిపైనే ఈ వలసల తీవ్రత ఆధారపడి ఉంటుంది. బలమైన ప్రతిపక్షంగా ఉన్నా చాలా తక్కువగా వలసలు ఉంటాయి. అలా కాకుండా ఈ ఏడాది ఎన్నికల్లో వైసీపీ తరహాలో ఘోర పరాజయం మూటగట్టుకుంటే మాత్రం వలసలు ఏ స్థాయిలో ఉంటాయనేదానికి ప్రస్తుతం వైసీపీ పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి నిలబడిన వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే నెగ్గింది. దీంతో వైఎస్ఆర్‌సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఆఖరికి తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ జగన్.. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు లేఖ రాసిన పరిస్థితి నెలకొంది. అయినా లాభం లేకుండా పోయింది. దీంతో వైసీపీలో వలసలు మరింత వేగం పుంజుకున్నాయి. ఈ విషయాన్ని పార్టీ నేతలు కొందరు జగన్‌కు చేరవేశారు. అందుకు జగన్ ఎవరూ ఊహించని విధంగా స్పందించారు.

వాళ్లు వెళితే నష్టం లేదు

పార్టీలో జరుగుతున్న వలసలపై మాజీ సీఎం వైఎస్ జగన్ వేదాంత ధోరణిలో స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దానికి తోడు ఇటీవల తాను హిమాలయాలకు వెళ్లిపోవాలని అనుకున్నాన్న జగన్ మాటలు గుర్తొచ్చి దాని ఎఫెక్టేమో అని కూడా కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘పార్టీని వీడే వాళ్లను ఎంతకాలం ఆపగలం. చేతులు అడ్డుపెట్టి ఎవరిమీ ఆపలేం. వెళ్లాలా ఉండాలా అనేది వారి ఇష్టం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. వేళ్లేవారు వెళ్తారు.. కష్టాల్లో అయినా నిలబడేవారు నాతో ఉంటారు’’ అని పార్టీ ముఖ్యనేతలకు జగన్ హితబోధ చేశారని పార్టీ వర్గాలు చెప్పాయి. ‘‘పార్టీని స్థాపించినప్పుడు నేను, మా అమ్మ విజయమ్మ మాత్రమే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభిస్తా. పార్టీని వదిలి వెళ్లే వారితో ఎలాంటి నష్టం లేదు’’ అని జగన్ వివరించారట.

ప్రజలు మనతోనే ఉన్నారు

‘‘పార్టీని వీడే నేతల గురించి ఆలోచన, ఆందోళన వద్దు. ఈ విషయంలో రాజీకి స్థానం లేదు. ఇవ్వొద్దు. ధైర్యంగా ముందడుగు వేద్దాం. ఏ కష్టమొచ్చినా ఎదుర్కొందాం’’ అని పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు జగన్. ‘‘నేతలు ఉన్నా లేకున్నా ఉండాల్సిన ప్రజల పార్టీతోనే ఉన్నారు. ప్రజల్లో వైసీపీకి సానుకూలత ఉంది. గత ఎన్నికల్లో కూడా 40శాతం ఓట్లు సాధించాం. నేతలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీ కుధేలు కాదు. కార్యకర్తలు, నేతలు పార్టీతోనే ఉన్నారు. ఉన్న వారితోనే పోరాటాన్ని కొనసాగిద్దాం’’ అని జగన్ వ్యాఖ్యానించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మరి విజయమ్మ వస్తారా!

ఈ నేపథ్యంలోనే పార్టీని స్థాపించినప్పుడు తాను, అమ్మ విజయమ్మ మాత్రమే ఉన్నామని, ఇప్పుడు తన ప్రయాణాన్ని మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభిస్తానంటూ జగన్ వ్యాఖ్యానించారని తెలుస్తోంది. అయితే మళ్ళీ జగన్‌కు మద్దతుగా విజయమ్మ నిలుస్తారా? అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయమ్మ.. ప్రచారాలకు చాలా దూరం పాటించారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ తరపును కడప ఎంపీ బరిలో ఉన్న వైఎస్ షర్మిలను ప్రజలు గెలిపించాలని విజయమ్మ కోరారు. దాంతో జగన్‌కు మద్దతు ఇవ్వడానికి ఆమె నిరాకరించారని అర్థమవుతోంది. మరి ఇప్పుడు మరోసారి జగన్‌కు మద్దతుగా ఉంటూ.. పార్టీని విజయం దిశగా తీసుకెళ్లడానిక విజయమ్మ సహకరిస్తారా? అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

ఏమైందో ఏమో

అయితే 2019 ఎన్నికల వరకు కూడా జగన్ వెన్నంటే ఉన్న ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ.. జగన్ సీఎం‌గా బాధ్యతలు తీసుకున్న నెలల వ్యవధిలోనే జగన్‌కు దూరం జరిగారు. తెలంగాణ షిఫ్ట్ అయిపోయారు. కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ఎక్కడా కనిపించలేదు వీరు. అలాంటిది ఒక్కసారిగా 2021 జూలై నెలలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు షర్మిల. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి కూడా సిద్ధమయ్యారు. 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఓట్లు చీలనివ్వమని, అందుకోసం తాము పోటీలో కూడా నిలవడం లేదని కూడా వెల్లడించారు షర్మిల. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలి పదవిని పొందారు. ఆంధ్ర ఎన్నికల్లో జగన్‌ను ఓడించాలని కోరుతూ ఆమె ప్రచారం జోరుగా సాగించారు. అప్పటి నుంచి కూడా విజయమ్మ జగన్‌కు మద్దతు అంటూ ప్రకటించలేదు. కొన్ని సందర్భాల్లో వెళ్లి కలిసి ఆశీర్వదించడమే తప్ప రాజకీయ వ్యవహారాల్లో మాత్రం విజయమ్మ జోక్యం చేసుకోలేదు. అటువంటి మరి ఇప్పుడు మరోసారి జగన్‌ను ప్రజల చెంతకు తీసుకెళ్లడానికి విజయమ్మ వస్తారా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News