లోకల్‌..నాన్‌ లోకల్‌... ఓటర్ల ఆదరణ ఎవరికి...?

ఆ నియోజకవర్గాల్లో లోకల్.. నాన్ లోకల్... అభ్యర్థుల మధ్యే ఎన్నికల పోరు... ఓటర్ల ఆదరణ ఎవరికో మరి..?

Update: 2024-04-01 12:32 GMT
Source: Twitter


(తంగేటి నానాజీ)


విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో అందునా విశాఖ ఉమ్మడి జిల్లాలో ఎన్నికలెప్పుడొచ్చినా లోకల్‌, నాన్‌ లోకల్‌ టాపిక్ తెరపైకి వస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. విశాఖ ఉమ్మడి జిల్లాలో అనకాపల్లి, విశాఖ పార్లమెంటు స్థానాల్లో లోకల్, నాన్ లోకల్ అభ్యర్థుల మధ్యనే ఎన్నికల పోరు సాగనుంది. ఈ పోరులో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్న వలస నేతలు ఉత్తరాంధ్రపై ఆదిపత్యం చలాయిస్తూ వస్తున్నారు.

అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకూ విశాఖ పార్లమెంట్‌ స్థానానికి సంబంధించి ఎన్నికల సమయంలో లోకల్‌, నాన్‌ లోకల్‌ చర్చ సాగేది. ఇప్పుడు అనకాపల్లి నియోజకవర్గంలోనూ ఈ రచ్చ మొదలైంది. 2014ఎన్నికల సమయంలో వైఎస్‌ విజయమ్మ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగగా, ఉత్తరాంధ్రలో సీమ సంస్కృతి అంశం తెరపైకి వచ్చింది. అదే విధంగా సీఎం రమేష్‌పైనా అనకాపల్లిలో ఇదే తరహా చర్చ జరుగుతోంది. దీంతో అనకాపల్లి ప్రజలు ఎంపీ ఓటును లోకల్‌కు వేస్తారా.. నాన్‌ లోకల్‌కు వేస్తారా అన్నది చూడాల్సి ఉంది. 

విశాఖ, అనకాపల్లి హిస్టరీ...

విశాఖ లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తొలిసారి ఎన్నికల్లో విశాఖ ప్రజలు స్వతంత్ర అభ్యర్థులకు పట్టం కట్టారు. లంక సుందరం, గంటం మల్లు దొర ఈ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు వెళ్లారు. అనంతరం 20 ఏళ్ల పాటు భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికవుతూ వచ్చారు. 1957లో పూసపాటి విజయరామ గజపతి రాజు, 1962లో మహా రాజ్ కుమార్, 1971లో తిరిగి మళ్లీ పూసపాటి విజయ గజపతిరాజు, 1977లో ద్రోణం రాజు సత్యనారాయణలో ఎన్నికయ్యారు. 1980లో కాంగ్రెస్( i)తరపున కొమ్మూరు అప్పలస్వామి ఎన్నిక కాగా... తొలిసారిగా టిడిపి అభ్యర్థి బట్టం శ్రీరామ్మూర్తి 1984లో ఎన్నికయ్యారు.

నాటి నుండి నేటి వరకు ఈ నియోజకవర్గంలో లోకల్ అభ్యర్థి విజయం సాధించిన దాఖలాలు లేవు. 1989లో ఉమా గజపతిరాజు 1991 తిరిగి 1999 లో ఎన్‌వి‌ఎస్ మూర్తి, 1996, 1998లో టీ సుబ్బరామిరెడ్డి, 2004లో ఎన్ జనార్దన్ రెడ్డి, 2009లో దగ్గుబాటి పురందేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, 2019లో ఎంవీవీ సత్యనారాయణ ఎన్నికయ్యారు. అయితే వీరిలో ఒక్కరు మాత్రమే లోకల్ కాకపోవడం విశేషం. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం 1962లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా, 9సార్లు కాంగ్రెస్‌, 5సార్లు తెలుగుదేశం, ఒకసారి వైసీపీ విజయం సాధించాయి.1962, 1967లో కాంగ్రెస్ తరపున విస్సుల సూర్యనారాయణమూర్తి ఎన్నిక కాగా..1971, 1977, 1980లో జరిగిన ఎన్నికల్లో ఎస్‌ఆర్‌ఏ‌ఎస్ అప్పలనాయుడు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.

1984లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున పెతకంశెట్టి అప్పల నరసింహ ఎన్నికయ్యారు. 1989, 1991లో కాంగ్రెస్ నుంచి కొణతాల రామకృష్ణ, 1996లో టిడిపి నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు, 1998 లో కాంగ్రెస్ నుంచి గుడివాడ గురునాథరావు, 1999 లో టిడిపి నుంచి గంటా శ్రీనివాసరావు, 2004 లో టిడిపి నుంచి పప్పల చలపతిరావు, 2009లో కాంగ్రెస్ నుంచి సబ్బం హరి, 2014లో ముత్తంశెట్టి శ్రీనివాస్ గెలుపొందగా.. 2019 లో బిశెట్టి వెంకట సత్యవతి వైసీపీ నుంచి గెలుపొందారు. ఇప్పటివరకు ఇక్కడ పోటీ చేసిన నాయకుల్లో అందరూ స్థానికులు అయితే తొలిసారిగా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో నాన్ లోకల్ అయిన బిజెపి అభ్యర్థి సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు.

మొదలైన ఎన్నికల వేడి

అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అనేక సమీకరణాల మధ్య సీఎం రమేష్‌, బూడి ముత్యాల నాయుడి పేర్లు ఖరారయ్యాయి. దీంతో ఇక్కడ ఎన్నికల వేడి మొదలైంది. గత ఎన్నికల్లో వైసీపీ చేజిక్కించుకున్న ఈ స్థానంలో పాగా వేయాలని టీడీపీ-జనసేన-బిజెపి కూటమి నేతలు ప్రయత్నిస్తుండగా… ఈ పోరులో ఎలాగైనా తమ సీటు పదిలం చేసుకోవాలని వైసీపీ ఎత్తులు వేస్తోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులు నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశమవుతున్నారు. ఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాల్ని రచిస్తున్నారు. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. సీఎం రమేష్ రాయలసీమకు చెందిన వ్యక్తి కావడంతో స్థానికత అంశం వైసీపీకే కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

విశాఖలోనూ... అదే సీను...

ఇక విశాఖ పార్లమెంటు నియోజకవర్గం విషయానికొస్తే ఇక్కడా లోకల్ నాన్ లోకల్ మధ్య పోటీ సాగనుంది. నాన్ లోకల్ అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మోత్కుపల్లి శ్రీ భరత్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కాగా... వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లోకల్.. దీంతో ఈ నియోజకవర్గంలో కూడా లోకల్, నాన్ లోకల్ మధ్య పోటీకి తెరలేచింది. ఓటరు మహాశయులు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News