Ex PM MANMOHAN SINGH - ANANTAPURAM | 'అనంత' పల్లెపై చెరగని మన్మోహన్ సింగ్ సంతకం
ఉపాధి హామీ పథకం పనులకు అనంతలో మాజీ ప్రధాని శ్రీకారం చుట్టారు. వలసల నివారణకు అడ్డుకట్ట వేశారు. బండ్లపల్లె సంగటి కూడా రుచి చూసిన ఆయన ఎమన్నారు...
Byline : SSV Bhaskar Rao
Update: 2024-12-27 06:46 GMT
రాయలసీమ వెనుకబడిన ప్రాంతమే కాదు. అనంతపురం జిల్లా కరువుకు నిలయం. పేదల జీవనప్రమాణాలు దారుణంగా ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డితో కలిసి ఆ జిల్లాలోని పల్లె గుండెను తడిమారు. పేదల బతుకులకు భరోసా ఇచ్చారు.
2005 ఆగష్టు 25వ తేదీ పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యమే కాదు. వంద రోజులు పనులు కల్పించాలనే చట్టం చేశారు. పల్లెల్లో అడిగిన వారందరికీ పనులు కల్పించడం ద్వారా జీవనానికి భద్రత కల్పించాలని సంకల్పించిన ఈ పథకం పేదలకు ఓ వరం.
దేశంలో ఆదర్శవంతమైన పథకంగా అమలు అవుతున్న ఉపాధి హామీ పథకం అమలుకు 2006 ఫిబ్రవరి రెండున అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లె నుంచే శ్రీకారం చుట్టారు. ప్రయోగాత్మకంగా దేశంలోని 200 జిల్లాల్లో అమలు చేయడానికి ప్రేరణగా నిలిచింది. ఆ తరువాత దేశ వ్యాపితంగా అమలు చేస్తున్నారు.
ఇంతటి చారిత్రక పథకానికి పునాది వేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. పేదల జీవితాలకు భరోసా, ఇవ్వడానికి మార్గం సుగుమం చేసిన దివంగత సీఎం వైఎస్ఆర్ ను ఈగడ్డ మరువదు. పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలు అందించి, రాయలసీమలోనే కాదు. రెండు తెలుగు రాష్ట్రాలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెరగని సంతకం చేశారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MNREGA) వల్ల కేవలం పేదలకు మాత్రమే కాదు. నిరుద్యోగ యువతకు కూడా క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ హోదాల్లో ఉద్యోగ అవకాశాలకు కూడా మార్గం ఏర్పడింది.
నార్పల మండలంలో నీరు లేక. పనులు లేని స్థితిలో ఎక్కువగా బెంగళూరు వలస వెళుతున్నట్లు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ పరిస్థితిని అధ్యయనం చేయడానికి మాజీ మంత్రి రఘువీరారెడ్డితో దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి వివరాలు తెలుసుకున్నారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి సందేశం పంపించిన వైఎస్ఆర్. దేశంలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో ఉపాధి హామీ పనులకు అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లెను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో..
సంగటి బాగుంది
సోనియాగాంధీతో కలిసి వచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనంతపురం జిల్లాలో నాటుకోడి, రాగి సంగటి ముద్ద రుచి చూశారు. "రాజశేఖర్ జీ ఏ క్యాహై బహుత్ అచ్ఛాహై (రాజశేఖర్ గారు. దీనిని ఏమంటారు. సంగటి ఓహ్.. చాలా బాగుంది)" అని సంగటి రుచి చూసిన మాజీ ప్రధాని మన్మోహన్ చెప్పిన మాట ఇది.
దీనికి సమాధానంగా.. వైఎస్. రాజశేఖరరెడ్డి సంగటి గొప్పదనం ఇలా వివరించారు.
"ఔను సర్.. మా రాయలసీమ రాగి సంగటి, సద్దలు (సజ్జలు), జొన్నల సంగటికి ప్రసిద్ధి. ఇది బలవర్ధక ఆహారం. పనులు లేని స్థితిలో పేదలకు సంగటే ఆహారంగా మారింది" రాయలసీమ అంటే గొడ్డు కారం, నాటుకోడి, సంగటికి ప్రసిద్ధి" అని వైఎస్ఆర్ సంగటి ప్రాధాన్యత రాయలసీమ వాసులకు మాత్రమే దక్కిందని వివరించారు.
బండ్లపల్లెలో ఉపాధి హామీ పనులు ప్రారంభించిన తరువాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గ్రామస్తులతో మాట్లాడారు. వారు చెబుతున్న మాటలను హిందీ, ఇంగ్లీషులోకి అనువదిస్తూ, మజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు వివరించారు. ఈ సంఘటనను ఆ గ్రామస్తులు ఇంకా మననం చేసుకుంటున్నారు.
వలసలు ఆపిన 'ఉపాధి'
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి పునాది వేసిన బండ్లపల్లె గ్రామంలో పేద ప్రజల వలసలను ఆపింది. 2006లో ఫిబ్రవరిలో బండ్లపల్లెలో కోరిన వారందరికీ ఉపాధి పనులు కల్పించారు. పదేళ్ల తరువాత పరిస్థితి మారింది.
బండ్లపల్లెలో 2001 లెక్కల ప్రకారం దాదాపు 550 కుటుంబాల్లో 2,500 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నాటి కరువు పరిస్థితుల నేపథ్యంలో వందల మంది బెంగళూరు, కేరళ, హైదరాబాద్ వంటి నగరాలకు వలసలు వెళ్లారు.
ఉపాధి పనుల ప్రారంభం తరువాత కొంచెం కొంచెం మార్పు రావడం గమనించారు.
బెంగళూరులో ఆరేళ్ల పాటు వనవాసం చేసిన వ్యక్తం 2010-11 సంవత్సరాలకు బండ్లపల్లెకు తిరిగి చేరుకున్నారు. వారి చెప్పే మాట ఒకటే.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆ నాటి సీఎం వైఎస్ఆర్ వల్ల ప్రారంభించిన ఉపాధి పనుల వల్ల గ్రామంలో చెరువులు, కాలువలు, కుంటల్లో నీరు నిలిచే పరిస్థితి వచ్చింది. వ్యవసాయం కొంత చేసుకోవడానికి మార్గం ఏర్పడింది. ఉపాధి పనుల వల్ల చేతినిండా పని ఉందనే మాట చెబుతున్నారు.
ఆ నాటి యూపీఏ ప్రభుత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వల్ల "ప్రతి ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి జాబ్ కార్డులు ఉన్నాయి. కనీసంగా ఒక్కొక్కరికి రూ. పది వేల నుంచి 15 వేల కూలి వేతనంగా వస్తోంది. దీని వల్ల ఊర్లోనే ఉంటూ, వలసలకు వీడ్కోలు పలికాం" అంటున్నారు.