వైజాగ్ క్రికెట్ మ్యాచ్‌లో ఎన్నో విశేషాలు
మహా రంజుగా సాగిన విశాఖ మ్యాచ్, సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించిన ఢిల్లీ, లక్నో బ్యాటర్లు.;
పరుగుల వరద పారిస్తుందని పేరు తెచ్చుకున్న విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ, వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సోమవారం మరోసారి ఆ పేరు నిలబెట్టుకుంది. క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఫోర్లు, సిక్సర్లతో కూడిన పరుగులనే ఆస్వాదిస్తుంటారు. మరికొందరు తమ అభిమాన జట్లలోని ఆటగాళ్లు ఎక్కువ స్కోరు చేయాలని కోరుకుంటారు. ఐపీఎల్ మ్యాచ్‌లు అందుకు ఒకింత భిన్నం. జట్లు ఏవైనా.. ప్లేయర్లు ఎక్కువ రన్స్ చేస్తే అంతులేని ఆనందాన్ని పొందుతారు.
సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య విశాఖలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లూ అభిమానుల ముచ్చటను తీర్చారు. తమ బ్యాట్లతో ఎడా పెడా బాదేసి మైదానం నలుమూలలా పరుగుల వరదను పారించారు. వారిని ఆనంద సాగరంలో ముంచెత్తారు. ఐపీఎల్ మ్యాచ్‌ను *హ్యాపీ*ఎల్ మ్యాచ్‌గా మార్చేశారు! ఫుల్ పైసా వసూల్ అంటూ రూ. వేలకు వేలు చెల్లించి టిక్కెట్లు కొనుగోలు చేసిన వారంతా ఎగిరి గంతేశారు.
వైజాగ్‌లో జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో కొన్ని రికార్డులు, మరికొన్ని ప్రత్యేకతలు
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 209 భారీ స్కోరును ఢిల్లీ క్యాపిటల్స్‌కి 210 లక్ష్యాన్నిచ్చింది. అయితే తొలుత తడబడి ఏడు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయిన ఢిల్లీ పరిస్థితిని చూసి ఆ జట్టు ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఆ నెమ్మదిగా కుదుటపడి నిలబడింది. ఆ జట్టు బ్యాటర్లు బదేస్తుంటే స్కోరు దూసుకెళ్లింది. ఇలా ఆఖరి వరకూ విజయం ఎవరిని వరిస్తుందో తెలియని స్థితికి వెళ్ల గ్రౌండ్‌లోని ప్రేక్షకులతో పాటు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు ఊపిరాడనంతగా బీపీ పెరిగిపోయింది. చివరకు మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ జట్టు లక్ష్యాన్ని ఛేదించి విజయ బావుటా ఎగురవేసింది. 2012 నుంచి వైజాగ్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
ఇప్పటివరకు ఈ గ్రౌండ్‌లో 16 ఐపీఎల్ టి 20 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మైదానంలో గత ఏడాది ఏడాది ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధికంగా 272 పరుగులు చేసింది. ఇదే ఇప్పటివరకు ఈ గ్రౌండ్‌లో అత్యధిక స్కోరు. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన 166 పరుగులు కలిపితే మొత్తం 438 పరుగులు చేసినట్టు రికార్డయింది. ఆ తర్వాత నిన్నటి మ్యాచ్‌లో లక్నో 209, ఢిల్లీ 211 పరుగులు వెరసి ఇరు జట్లు చేసిన 420 పరుగులుతో రెండో అతి పెద్ద స్కోరుగా రికార్డయింది. అంతేకాదు.. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అత్యధిక స్కోరును ఛేదించిన మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం!
ఫోర్లు, సిక్సర్లతోనే 310 రన్స్..
ఢిల్లీ, లక్నో జట్లు మొత్తం 420 పరుగుల భారీ స్కోరును నమోదు చేయడమే కాదు.. ఇరు జట్ల బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్ల మోత మోగించారు. ఈ రెండు జట్లు కలిసి 34 ఫోర్లు కొట్టగా ఏకంగా 29 సిక్సర్లను బాదేశారు. ఇలా ఫోర్లు, సిక్స్‌లు కలిపి 310 రన్స్ చేశారు. ఇరు జట్లు చేసిన 420 పరుగుల్లో ఫోర్ల ద్వారా 136, సిక్స్‌ల ద్వారా 174 పరుగులు వచ్చాయి. ఫోర్లు, సిక్స్‌లవి పోగా కేవలం 110 పరుగులు మాత్రమే సింగిల్స్, టూ రన్స్, ఎక్సట్రాలతో లభించాయన్న మాట! ఇక లక్నో జట్టులో మార్ష్ ఆరు సిక్స్‌లు, ఆరు ఫోర్లు, నికోలస్ ఏడు సిక్స్‌లు, ఆరు ఫోర్లు, ఢిల్లీ టీమ్‌లో ఆశుతోష్ ఐదు సిక్స్‌లు, ఐదు ఫోర్లు, డూప్లెసిస్ మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లు, స్టబ్స్ ఒక ఫోర్, మూడు సిక్స్‌లు, విప్రజ్ ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌ల చొప్పున కొట్టారు.
రూ.27 కోట్ల పంత్ డకౌట్..
ఐపీఎల్ 2025 వేలంలో లక్నో జట్టు రిషబ్‌పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ ఆటగాళ్లలో అత్యధికంగా అమ్ముడుపోయి అందరి నోళ్లలో నానిన పంత్ .. లక్నో జట్టుకు కెప్టెన్ కూడా. విశాఖలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 6 బంతుల్లో సున్నా పరుగులు చేసి కులదీప్ యాదవ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. పంత్ ఎంతో దూకుడుగా ఆడి పరుగులు వరద పారిస్తాడనుకుని ఎదురు చూసిన వారికి పంత్ ఇలా సున్నా పరుగులకే పెవిలియన్ దారి పట్టడం అటు లక్నో జట్టును, ఇటు అభిమానులను నిరాశకు గురి చేసింది.
వీక్షకులు 25.2 కోట్ల మంది..
విశాఖలో సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ను టీవీలు, ప్రసార మాధ్యమాల్లో సుమారు రూ.25.2 కోట్ల మంది వీక్షించినట్టు జీయో స్టార్ వెల్లడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు రూ.209 పరుగులు, లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ జట్టు అందుకు ధీటుగా 211 పరుగులు చేయడం, ఇరు జట్లు ఆద్యంతం ఫోర్లు, సిక్సర్లతో రక్తి కట్టించడం, మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా కొనసాగడం వంటివి ఇంత పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు దోహదపడిందని క్రికెట్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.