శ్రీవారి క్షేత్రానికి పోటెత్తిన యాత్రికులు

తిరుమలలో రేపు వెంకన్న గరుడోత్సవానికి వస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకుంటే సులువైన దర్శనం.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-27 10:08 GMT
తిరుమలలో శ్రీవారి వాహనసేవ చూసేందుకు వచ్చిన యాత్రికులు

తిరుమల శ్రీవారి క్షేత్రం కిటకిటలాడుతోంది. శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన వాహనసేవ 28వ తేదీ (ఆదివారం రాత్రి) గరుడోత్సవం జరగనున్నది. అసాధరణ భద్రతో పాటు, యాత్రికులకు నిరంతరాయంగా అన్నప్రసాదాల పంపిణీకి టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

తిరుమల, తిరుమతిలో కూడా ఆరు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. గరుడోత్సవానికి అదనంగా మరో 1,500 పోలీసులు, అధికారులు చేరుకున్నారు. టీటీడీ విజిలెన్స్, పోలీస్ శాఖలు సమన్వయంతో అసాధారణ భద్రతను ఏర్పాటు చేశారు. తొక్కిసలాటలకు ఆస్కారం లేని విధంగా పటిష్ట చర్యలు తీసుకున్నారు.


టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఏమంటారంటే..

"తిరుపతిలో అలిపిరి లింక్ బస్‌స్టాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజ్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ గ్రౌండ్, దేవలోక్, AP టూరిజం ఓపెన్ ఏరియాల్లో 5250 ద్విచక్ర వాహనాలకు, 2700 కార్లకు పార్కింగ్ స్థలం కేటాయించాం" అని సింఘాల్ వివరించారు.

క్యూఆర్ కోడ్...
ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి 29న ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు చేశారు. అలిపిరి పాత చెక్పోస్ట్ వద్ద ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించారు. పార్కింగ్ ప్రదేశాలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయనే సమచారం తెలియజేసేందుకు టీటీడీ ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు అందులో QR కోడ్ ఉంచింది. ఈ కోడ్ సెల్ పోన్ లో స్కానింగ్ చేస్తే, పార్కింట్ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి? ఎలా వెళ్లాలనే మార్గం కూడా స్పష్టంగా వివరించే విధంగా దీనిని తయారు చేశారు.
శ్రీవారి ఆలయం ఉన్న 2.5 ఎకరాలు మినహా మిగతా 15 ఎకరాల విస్తీర్ణంలో తిరుమల ఆలయ మాడవీధులతో పాటు బేడి ఆంజనేయ స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో క్రౌడ్ మేనేజిమెంట్ లో భాగంగా తొక్కిసలాటకు ఆస్కారం లేని విధంగా పటిష్ట ఇనుప బారికేడ్లతో కంపార్టుమెంట్లు ఏర్పాటు చేశారు. గరుడోత్సవం సందర్భంగా దాదాపు ఐదు లక్షల మందికి పైగానే యాత్రికులు హాజరవుతారనేది అంచనాతో అన్నప్రసాదాలు, వాటర్ బాటిళ్లు, పాలు, మజ్జిగ పంపిణీకి టీటీడీ అధికారులు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం ద్వారా ఏర్పాట్లు చేశారు.
గరుడ వాహనసేవ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలకఘట్టం గరుడ వాహనంపై శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ మాడవీధుల్లో విహరిస్తారు. దీంతో సగం బ్రహ్మోత్సవం పూర్తయినట్లు లెక్క. శ్రీవారి వాహనం గరుడపక్షి. ఈ వాహనంపై విహరిస్తూ, శ్రీవారు ఆనందనిలయం నుంచి సన్నిధిలోకి వచ్చి, కొలువయ్యారనేది చారిత్రక నేపథ్యంతో కూడిన కథనం. దీంతో గరుడోత్సవం చూసేందుకు జిల్లా నుంచే కాకుండా, దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు తామరతంపరగా రావడం సర్వసాధారణం, ఈ సంవత్సరం రోజూ ఉదయం, రాత్రి వేళ జరిగే వాహన సేవల సమయంలోనే మాడవీధుల్లోని గ్యాలరీలు కిటకిటలాడుతున్నాయి.
తిరుపతిలో ట్రాఫిక్ మళ్ళింపు
గరుడ వాహన సేవ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటం వల్ల తిరుపతి నగరంలో ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లోకి వస్తాయని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు వెల్లడించారు.
"తిరుమల, తిరుపతిలో వేర్వేరుగా పోలీసు అధికారులకు బాధ్యతలు వికేంద్రీకరించాం. సిబ్బందిని కూడా ఏర్పాటు చేశాం" ఎస్పీ చెప్పారు. శనివారం (ఈరోజు) రాత్రి నుంచే ద్విచక్ర వాహనాలు తిరుమలకు అనుమతించడం లేదని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు.
తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ నడుపుతున్న బస్సుల్లోనే యాత్రికులను అనుమతిస్తున్నామని ఆయన తెలిపారు.
ఆయన ఏమి చెప్పారంటే..
1. RTC రవాణా సౌకర్యం – తిరుపతి నుంచి తిరుమల వరకు APSRTC, తిరుపతి, తిరుమలలో TTD ప్రత్యేక బస్సులు నిరంతరాయంగా నడుపుతుంది.
2. అలిపిరి – కపిలతీర్థం మార్గం – భక్తుల రాకపోకల కోసం ప్రత్యేకంగా ఉంచబడింది. ప్రైవేట్ వాహనాలకు పరిమితులు ఉంటాయి.
3. RTC బస్ స్టాండ్ – అలిపిరి రోడ్ – వాహన రాకపోకలకు కేటాయించిన మార్గాలు మాత్రమే ఉపయోగించాలి. భక్తులు RTC బస్సులు,TTD వాహనాలను వినియోగించాలి.
4. ప్రైవేట్ వాహనాలు – కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలోనే నిలిపి ఉంచాలి. రోడ్ల పక్కన, అనధికారిక ప్రదేశాలలో వాహనాలు నిలపరాదు.
5. వీధి వ్యాపారులు – ప్రధాన రహదారులపై వ్యాపారానికి అనుమతి లేదు. ట్రాఫిక్ ప్రవాహం సజావుగా ఉండేందుకు సహకరించాలి.
6. అత్యవసర వాహనాలు – అంబులెన్స్, ఫైర్ సర్వీస్, పోలీస్ వాహనాలకు మాత్రమే ప్రాధాన్యత మార్గాలు ఖాళీగా ఉంచబడతాయి.
7. ప్రత్యేక బోర్డులు, మైక్ ప్రకటనలు – ట్రాఫిక్ మార్పులు, డైవర్షన్లకు సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా పాటించాలి. అని ఎస్పీ సుబ్బారాయుడు ప్రత్యేకంగా సూచించారు.
తిరుపతిలో పార్కింగ్
తిరుమలలో గరుడవాహన రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు తిరుపతి పట్టణంలో పార్కింగ్ ఏర్పా చేశారు. (పార్కింగ్ ప్రదేశాల కోసం QR కోడ్ ఉపయోగించుకోవాలి)
ద్విచక్ర వాహనాలు: శనివారం (27.09.2025) రాత్రి తొమ్మిది గంటల నుంచి ఆదివారం (29.09.2025) ఉదయం 6 గంటల వరకు అలిపిరి ఘాట్ రోడ్లలో అనుమతి లేదు.
1. కడప, శ్రీకాళహస్తి వైపు నుండి వచ్చే వాహనాలకు ఇస్కాన్ గ్రౌండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ గ్రౌండ్ లలో టూ వీలర్, ఫోర్ వీలర్ పార్కింగ్ సదుపాయం ఉంది.
2. చిత్తూరు, పీలేరు, ఇతర జిల్లాల నుంచి వచ్చే టూరిస్టు వాహనాలు, టెంపో ట్రావెల్స్ వాహనాలకు దేవలోక్ (అలిపిరి నుంచి జూపార్కు బైపాస్ మార్గం) ప్రాంగణంలో పార్కింగ్ చేయాలి.
3. మదనపల్లి, చిత్తూరు నుంచి వచ్చే వాహనాలకు భారతీయ విద్యాభవన్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఇస్కాన్ టెంపుల్ గ్రౌండ్ లో ఫోర్ వీలర్ పార్కింగ్ సదుపాయం.
4.గరుడసేవకు టూ వీలర్లలో వచ్చే యాత్రికులకు అలిపిరి బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద టూ వీలర్ పార్కింగ్ సదుపాయం.
5.కరకంబాడి వైపు నుంచి వచ్చే వాహనాలకు ఎస్.వి. ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద కట్-ఆఫ్ పార్కింగ్ ఏర్పాటు చేశారు.
6.మదనపల్లి, చిత్తూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు వకుళమాత ఆలయం, చెర్లోపల్లి వద్ద పార్కింగ్ సదుపాయం.
7 చెన్నై మార్గంలోని పుత్తూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు మ్యాంగో మార్కెట్ లో పార్కింగ్ సదుపాయం.
వాహనాల మళ్లింపు
చిత్తూరు, మదనపల్లి వైపు నుంచి తిరుపతి లోకి ప్రవేవించే RTC బస్సులు ఇకపై కాళూరు క్రాస్ నుంచి రామచంద్రాపురం మీదుగా, తనపల్లి – గరుడ ఫ్లై ఓవర్ నుంచి తిరుపతి ఆర్టీసీ బస్టాండుకు మళ్లించారు.
తిరుమలకు RTC బస్సుల్లో ప్రయాణించే యాత్రికులు, నంది సర్కిల్ (కపిలతీర్థం) గరుడ సర్కిల్ మార్గంలో యథాప్రకారం తిరుమల వెళ్తారు.
ప్రత్యేక వసతులు
జిల్లా నుంచే కాకుండా పొరుగు ప్రాంతాల నుంచి సొంతవాహనాల్లో వచ్చే యాత్రికుల వాహనాలు నిలిపే ప్రదేశంలోనే టీటీడీ వసతులు కల్పించింది.
"తిరుపతిలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాల్లో తాగునీరు, భోజనం, టాయిలెట్స్ సదుపాయాలు" కల్పించాం అని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆ వాహనాల్లో వచ్చే యాత్రికులు తిరుపతి నుంచి తిరుమలకు చేసుకోవడానికి తిరుమలకు నిరంతరాయంగం ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి అని ఆయన వివరించారు.
తిరుమలలో పార్కింగ్ ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీటీడీ విజిలెన్స్ విభాగంతో పాటు సివిల్, ట్రాఫిక్ విభాగం పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. తిరుమలలో రింగ్ రోడ్డు మీదుగా వాహనాలు మళ్లించేందుకు 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
1.రాంభగీచ పార్కింగ్:- వివిఐపి పెద్ద బ్యాడ్జెస్ వాహనాలు.
2.సప్తగిరి గెస్ట్ హౌస్ పార్కింగ్: విఐపి చిన్న బ్యాడ్జెస్ వాహనాలు.
3.సాధారణ వాహనాలు:- ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు పార్కింగ్ చేసుకోవాలి. ఇవి అనుసరిస్తే, యాత్రికులు ప్రశాంతంగా తిరుమల యాత్ర పూర్తి చేసుకోవచ్చనేది టీటీడీ అధికారులు చేస్తున్న సూచన.
Tags:    

Similar News