రాయలసీమపై కూటమి ఎందుకు దృష్టి పెట్టింది?

కర్నూలుకు అక్టోబర్ 16న రానున్న ప్రధాని నరేంద్రమోదీ?

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-27 10:25 GMT

రాయలసీమపై ఫోకస్ పెట్టిన ఎన్డీఓ కూటమి కర్నూలులో ఈసారి సత్తా చాటడానికి సమాయత్తం అవుతోంది. రాయలసీమలో ప్రధాని నరేంద్రమోదీతో కలిసి కూటమి నేతలు ఐక్యతారాగం ఆలపించనున్నారు. ఈ ఏడాది అక్బోబర్ 16వ తేదీ కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్రమోదీతో కలిసి సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రోడ్ షో, బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం ఉంది.


వ్యూహానికి పదును
కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చే ప్రధాని నరేంద్ర మోదీ అనేక పథకాలకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు కూడా చేసే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్రమోదీతో కలిసి సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కల్యాణ్ రోడ్ చేయడం తోపాటు భారీ బహిరంగ సభ నిర్వహణకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ విభజిత కర్నూలు తోపాటు నంద్యాల జిల్లాలో కూడా పర్యటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం శాసనమండలి లాబీలో సహచర మంత్రులు, ఎమ్మెల్సీలకు వివరించినిట్లు వార్తలు వెలువడ్డాయి. కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చే ప్రధాని నరేంద్రమోదీ శ్రీశైలంలో భ్రమరాంబికా సమేత మల్లికార్జునస్వామిని కూడా దర్శించుకునే విధంగా కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ లో చెప్పారని సమాచారం.
సీమపై ఫోకస్
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాయలసీమపై ప్రత్యేకంగా దృష్టి సారించిందనే విషయం చాలా సందర్భాల్లో స్పష్టమైంది. టీడీపీ మొదటిసారి తిరుపతికి వెలుపల కడప జిల్లాలో ఈ ఏడాది మే నెల 27వ తేదీ నుంచి 29 వరకు టీడీపీ మహానాడు నిర్వహించడం ఓ ఛాలెంజ్ గా భావించింది. కడప అంటేనే గుర్తుకు వచ్చేది దివంగత సీఎం వైఎస్ఆర్, ఆయన కుటుంబమే. ఈ పరిస్థితుల్లో ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా మారిన మాజీ సీఎం వైఎస్. జగన్ అడ్డాలో మహానాడు నిర్వహణ ద్వారా టీడీపీ ఓ ఛాలెంజ్ విసిరినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. ఆ తరువాత కూడా రాయలసీమ జిల్లాల్లో పారిశ్రామిక ప్రగతికి పెట్టుబడులు సాధించడంలో కీలకంగా వ్యవహరించిన ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్,అంతకుముందు సీఎం చంద్రబాబు సాగించిన పర్యటలనతో పారిశ్రామికపార్కులకు మరింత ఊతం ఇచ్చే విధంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అందులో ప్రధానంగా
2007లో కడపకు సమీపంలోని చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి వద్ద ప్రారంభించిన ఇండస్ట్రియల్ పార్కుపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మౌలిక వసతుల కల్పనలో జరిగిన జాప్యం కారణంగా గతంలో వెళ్లిపోయిన సంస్థలను కూడా తిరిగి రప్పించడానికి ఆయన దృష్టి నిలిపారు. ఇదిలావుంటే

వైసీపీని ఇరుకున పెట్టాలనే లక్ష్యంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల హామీలు వంద శాతం నెరవేర్చామని చెబుతూ అనంతపురంలో ఈ ఏడాది సెప్టెంబర్ 10న సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో విజయోత్సవ సభ నిర్వహించడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీలో దివంగత సీఎం వైఎస్ఆర్ తరువాత ఆయన కొడుకు, మాజీ సీఎం వైఎస్. జగన్ ప్రధాన టార్టెట్ గా టీడీపీ ఫోకస్ పెట్టింది.
కారణం ఇదీ..
2024 ఎన్నికల్లో కూడా టీడీపీ కూటమి పైచేయి సాధించింది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 52 అసెంబ్లీ స్థానాల్లో 45 కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ దక్కించకున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉండి ఎన్నికలకు వెళ్లిన వైఎస్. జగన్ సారధ్యంలోని వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. అందులో ఏడు సీట్లు రాయలసీమ నుంచే సాధించింది. దీంతో, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికల నాటికి బలీయమైన శక్తిగా మారాలనేది టీడీపీ కూటమి వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో రాయలసీమలో కూటమి శ్రేణుల్లో జోష్ నింపడం ద్వారా, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న విధానంపై ఈపాటికే జనంలోకి వెళ్లాలని సీఎం నారా చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేకు గతంలోనే క్లాస్ తీసుకోవడం తోపాటు ప్రత్యేక టాస్క్ కూడా ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో..
కర్నూలు సభకు ప్రధాని
కర్నూలులో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన వెనుక కూడా టీడీపీ కూటమి వ్యూహం సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. టీడీపీ కూటమిలో అంతర్గత కలహాలు సాగుతున్నాయనే విషయం అనేక వార్తలు వస్తున్నాయి. దీనిపై సీఎం నారా చంద్రబాబు తోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వారి పార్టీ వేదికలపై ఎవరి పరిధిలో వారు చక్కదిద్దడంలో చురుగ్గానే వ్యవహరిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాయలసీమకు ప్రధానంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద పారిశ్రామిక కేంద్రం వద్ద కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక సంస్థలను సాధించడంలో సీఎం చంద్రబాబుతో పాటు, కూటమిలోని భాగస్వామ్య పక్షాల నుంచి కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీని లక్ష్యంగా చేసుకుని, కర్నూలు ప్రధాని నరేంద్రమోదీతో రోడ్ షో తోపాటు బహిరంగ సభ నిర్వహించడం ద్వారా మరిన్ని నిధులు సాధించడం ద్వారా ఓటు బ్యాంకు పటిష్టం చేసుకునే దిశగా కూటమి నేతలు సమాయత్తం అవుతున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే అక్టోబర్ 16వ తేదీ ప్రధానితో భారీ సభలకు సన్నాహాల కోసం యత్నాలు ప్రారంభమైనట్లు మంత్రి నారా లోకేష్ మాటలు వెల్లడిస్తున్నాయి. ఈ సభ తరువాత ఎన్టీఏ పట్టు ఏమేరకు పెరుగుతుందనేది ప్రధాని రాయలసీమకు ఇచ్చే వరాలు, వాటిని కూటమి నేతలు జనంలోకి తీసుకుని వెళ్లే తీరుపై ఆధారపడి ఉంటుంది. ఆ సభ తరువాత పరిస్థితి ఎలా మారుతుందనేది కాలమే సమాధానం చెప్పాలి.
Tags:    

Similar News