సంచలనం సృష్టిస్తున్న మరియమ్మ మర్డర్ కేసు..34 మంది అరెస్టు

దాదాపు నాలుగేళ్ల క్రితం రాజధాని అమరావతి ప్రాంతంలో మరియమ్మ హత్యకు గురైంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దీనిని తెరపైకి తెచ్చింది.

Update: 2024-12-27 10:02 GMT

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో హత్యకు గురైన మరియమ్మ కేసు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ హత్య కేసుకు సంబంధించిన నిందితులను అరెస్టు చేయడంలో గుంటూరు జిల్లా పోలీసులు నిమగ్నమయ్యారు. పదుల సంఖ్యలో నిందితులను అరెస్టు చేశారు. దాదాపు 34 మంది నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. మరియమ్మ హత్య కేసులో బాపట్ల మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు నందిగామ సురేష్‌ను ఇది వరకే పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్‌ ఖైదీగా గుంటూరు జైలులో ఉన్నారు. తాజాగా మరో 34 మంది నిందితులను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేయడంతో మరో సారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. అరెస్టుల అనంతరం వీరిని మంగళగిరి కోర్టులో హజరు పరిచారు.

జగన్‌ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతమైన అమరావతిలో మరియమ్మ హత్య జరిగింది. 2020 డిసెంబరు 27న వెలగపూడి గ్రామంలో మరియమ్మ హత్యకు గురైంది. ఈ సంఘటన జరిగి శుక్రవారంతో సరిగ్గా నాలుగేళ్లు పూర్తి అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరియమ్మ హత్య కేసు తెరపైకి వచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఈ కేసులో నిందితుడుగా ఉన్నారని బాపట్ల మాజీ ఎంపీని అరెస్టు చేసింది. అయితే సురేష్‌ ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించగా, బెయిల్‌ మంజూరు చేసేందుకు నిరాకరించింది. ఈ ఆదేశాలను సురేష్‌ సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఇటీవలె సుప్రీం కోర్టు కూడా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పును సమర్థించింది. నందిగం సురేష్‌కు బెయిల్‌ మంజూరు చేసేందుకు నిరాకరించింది.

Tags:    

Similar News