భారీ ఎన్‌కౌంటర్–మృతి చెందిన 31 మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్ లో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం జరిగిన పోలీసుల కాల్పుల్లో మావోయిస్టులు చనిపోయారు.;
By : The Federal
Update: 2025-02-09 08:49 GMT
ఛత్తీస్‌గఢ్ లో ఇటీవల కొంత కాలంగా భారీ స్థాయిలో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులకు, మావోయిస్టులకు తీవ్ర స్థాయిలో ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనల్లో భారీ స్థాయిలో ప్రాణ నష్టం వాటిల్లుతోంది. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నేలకొరుగుతున్నారు. భద్రతా దళాలు కూడా మృత్యువాత పడుతున్నారు. ఇరు వర్గాలు పెద్ద ఎత్తున గాయాల పాలవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన మరో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల భద్రతా బలగాలు, మావోయిస్టు దళాల మధ్య భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు పోలీసుల తూటాలకు మృతి చెందారు. పలువురు మావోయిస్టులు గాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు గాలింపులు చేపట్టారు. డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బృందాలు చేపట్టిన అన్నల కోసం గాలింపులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య మరింగా పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసు బలగాలు కూడా మృతి చెందినట్లు సమాచారం. ఇద్దరు పోలీసు జవాన్లు మృత్యువాత పడగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.
మావోయిస్టులను అణచి వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం తుడిపెడుతుందని గత నెల 6న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడించిన నేపథ్యంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. అందులో భాగంగా పోయిన వారంలో బీజాపూర్ జిల్లాలో జరిగిన మరొక ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పశ్చిమ బెస్తర్ ప్రాంతంపై భదత్ర బలగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. బస్తర్ అడవుల్లో మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల కదలికలపై శుక్రవారం పోలీసులకు కీలక సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. ఇంద్రావతీ నేషనల్ పార్కు ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌లు చేపట్టాయి. ఈ నేపథ్యంలో అటు భద్రతా బలగాలు, ఇటు మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిసింది.