పోలవరం ఫైళ్లకు నిప్పు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో ఒకదాని తర్వాత ఒకటిపై ఫైళ్లను తగలబెడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయం ఘటన సంచలనంగా మారిన కొన్ని రోజుల్లోనే తాజాగా పోలవరం ప్రాజెక్ట్‌కు చెందిన ఫైళ్లను కూడా కొందరు తగలబెట్టారు.

Update: 2024-08-18 10:24 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఒకదాని తర్వాత ఒకటిపై ఫైళ్లను తగలబెడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయం ఘటన సంచలనంగా మారిన కొన్ని రోజుల్లోనే తాజాగా పోలవరం ప్రాజెక్ట్‌కు చెందిన ఫైళ్లను కూడా కొందరు తగలబెట్టారు. దీనిపై ప్రశ్నించగా అవన్నీ పాత పేపర్లుగా అధికారులు చెప్తున్నా.. వాటిపై అధికారుల సంతకాలు కూడా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. తమ భూ దందాలు బయటకు వస్తాయన్న భయంతో వైసీపీ వాళ్లే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నిప్పంటించారని ఒకవైపు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా పోలవరం ప్రధాన ఎడమ కాలవ పనుల కోసం చేపట్టిన భూసేకరణలో కూడా భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఆ కాలువ పనులకు సంబంధించిన ఫైళ్లు ఉన్న కార్యాలయంలోని ఫైళ్లే ఇప్పుడు తగలబడటం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.

తగలబడిన వాటిలో అవే ఉన్నాయ్!

పోలవరం కార్యాలయం బయట తగలబెట్టిన ఫైళ్లలో ప్రధాన ఎడమ కాలవ పనులకు చేపట్టిన భూసేకరణ పత్రాలతో పాటు రైతులు, లబ్దిదారుల ఆధార్ కార్డులు, కాకినాడ కలెక్టరేట్ నుంచి వచ్చిన లెటర్లు, పోలవరం కాలువకు చెందిన అవార్డు పత్రాలు, ఫొటోలు ఉన్నాయి. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ విషయం తెలుసుకుని అనేక మంది అక్కడకు చేరుకోవడంతో అధికారులు వెంటనే ఆ సగం కాలిపోయిన ఫైళ్లను లోపలకు తీసుకెళ్లి దాచేశారు. అవి చిత్తు కాగితాలని, అందుకే తగలబెట్టాం అంటూ చెప్పారు. వారు చెప్తున్న ఈ వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. వాటిలో కాగితాలను బయటపడేసిన శ్రావణి అనే స్వీపరు ఆకస్మికంగా విశాపట్నం వెల్లడం అతి ప్రధానంగా ఉంది.

ప్రభుత్వం అప్రమత్తం

ఈ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రామండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రంగంలోకి దిగారు. జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్‌కు ఈ అంశంపై సమాచారం ఇచ్చి, వెంటనే దర్యాప్తు చేపట్టాలని, దీనిపై ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక అందించాలని చెప్పారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్, ఎస్పీ.. అక్కడి అధికారులను ఘటనపై నిలదీశారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ ఆదేశాలతో ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి, డీఎస్పీ భవ్యకిశోర్ విచారణ చేపట్టి.. దస్త్రాలు ఏమీ తగలబెట్టలేదని, జిరాక్స్‌లు, చెత్త కాగితాలు ఉన్నాయని వారు వివరించారు.

చర్యలు తప్పకుండా ఉంటాయి..

తగలబెట్టినవి చెత్త కాగితాలే అయినా అధికారుల అనుమతి తప్పకుండా ఉండాలని, అలా అనుమతి లేకుండా వీటిని తగలబెట్టిన కారణంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్పారు. దీనిపై స్పందించిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి.. ఈ ఘటనపై అనేక అనుమానాలు ఇంకా అంతే ఉన్నాయని అన్నారు. ‘‘వైసీపీ హయాంలో భారీ సంఖ్యలో భూ కుంభకోణాలు జరిగాయి. వాటిని బయటకు తెలపాలన్నా, ఈ దహనాలు యాదృచ్చికమే అని నిర్దారించుకోవాలన్నా అసలు ఎన్ని భూములు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అన్న విషయంపై సర్వే చేయాలి. దీని కోసం ఇటీవలే ఆదేశాలు జారీ చేశాం. ఇంతలోనే ఈ ఘటనలు అధికం అయ్యాయి. వీటిని సీరియస్‌గా తీసుకుని సమగ్ర విచారణ చేపట్టాలి’’ అని డిమాండ్ చేశారు. తాజాగా ఈ ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవినీతి ఆనవాళ్లకు మాయం చేయడమే ఉద్దేశం: మంత్రి

‘‘గత ప్రభుత్వం పాల్పడిన అవినీతి ఆనవాళ్లను మాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దహనమైన దస్త్రాలను చిత్తు కాగితాలుగా ఆర్డీఓ శివజ్యోతి చెప్తున్నారు. కానీ వాటిలో అసలైన దస్త్రాలు కూడా ఉన్నాయని ప్రజలు అనుమానిస్తున్నారు. కాబట్టి వారి అనుమానాలను అధికారులే నివృత్తి చేయాలి. అదే విధంగా ఈ ఘటనకు బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలి’’ అని ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. అనంతరం అవినీతిని మాయం చేయాలని ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడి ఉంటే.. అది ఎవరైనా ఉపేక్షించేది లేదని, దీని వెనక ఉన్న ప్రతి ఒక్కరికీ కఠిన శిక్ష పడేలా చేస్తామంటూ ఆయన మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

Tags:    

Similar News