మార్చిలో డీఎస్సీ..మంత్రి లోకేష్‌

డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కూటమి ప్రభుత్వం ఈ సారైనా మాట నిలబెట్టుకుంటుందా?;

Update: 2025-01-31 13:54 GMT

డీఎస్సీ మీద ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఇంత వరకు ఓ స్పష్టత ఇవ్వ లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ ఫైలు మీద సంతకం చేసిన ప్రభుత్వం తర్వాత దానిని పట్టించుకోలేదు. కొద్ది రోజుల తర్వాత టెట్‌ నిర్వహించి చేతులు దులుపుకుంది. ఈ నేపథ్యంలో డీఎస్సీ అభ్యర్థుల్లో ఆందోళనలతో నెలకొన్నాయి. ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై అయోమం ఆవరించింది.

ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్‌ డీఎస్సీ మీద స్పందించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియా జరిగిన చిట్‌ చాట్‌లో ఆయన సూచన ప్రాయంగా డీఎస్సీ గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌ వెల్లడిస్తామని లీకులిచ్చారు. మార్చిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో డీఎస్సీ ప్రక్రియను ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేస్తామని చిట్‌ చాట్‌లో మరో సారి లీకులిచ్చారు.
గత ప్రభుత్వం సరిగ్గా ఎన్నికలకు ముందు 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటించింది. అందులో భాగంగా టెట్‌ కూడా నిర్వహించింది. డీఎస్సీ అభ్యర్థులను జగన్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని, తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామని, 25వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామని చంద్రబాబు, లోకేష్‌తో పాటు ఇతర కూటమి ముఖ్య నాయకులు ఎన్నికల్లో ఊదరగొట్టారు. ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఆ మాటను మార్చింది. 25వేల పోస్టులను 16,347 పోస్టులకు కుదించి మెగా డీఎస్సీని ప్రకటించింది.
నాలుగో సారి సీఎంగా పీఠమెక్కిన చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాల్లో డీఎస్సీ కూడా ఒకటి. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. జూలై 2న నోటిఫికేషన్‌ ఇచ్చి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తామని భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నారు. తర్వాత టెట్‌ పరీక్షను తెరపైకి తెచ్చారు. టెట్‌ షెడ్యూల్‌ను తొలుత సెప్టెంబరులో అన్న ప్రభుత్వం తర్వాత తర్వాత అక్టోబరుకు మార్చారు. ఎట్టకేలకు టెట్‌ పరీక్షను నిర్వహించి, ఫలితాలను విడుదల చేశారు. టెట్‌ ఫలితాలు వచ్చి దాదాపు మూడు నెలలు అవుతోంది. కూటమి సర్కార్‌ కొలువుదీరి ఏడు నెలలు అవుతోంది. ఇంత వరకు డీఎస్సీ మీద స్పష్టత ఇవ్వ లేదు. పలు మార్లు లీకులిస్తూ కాలం వెల్ల దీస్తోంది. దీంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు డీఎస్సీ కోసం నిరసనలు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం నోరు విప్ప లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం డీఎస్సీ కోచింగ్‌కు అడ్డా అయిన కృష్ణా జిల్లా అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ నిరసనలు తెలిపారు.
దీంతో మంత్రి లోకేష్‌లో కదలిక వచ్చింది. తనతో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో డీఎస్సీ గురించి లీకులిచ్చారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభిస్తామని మీడియా ద్వారా డీఎస్సీ అభ్యర్థులను కూల్‌ చేసే ప్రయత్నం చేశారు. ఒక వేళ మార్చిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చే ఆలోచనలు ఉంటే మీడియా ముఖంగానే రాష్ట్ర ప్రజలకు నేరుగా చెప్పొచ్చు. అలా కాకుండా లీకులివ్వడం ఏంటని డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. డీఎస్సీ మీద మంత్రి నారా లోకేష్‌ ఈ సారైనా మాట నిలబెట్టుకుంటారా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.
Tags:    

Similar News