మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు ఏపీలో తొలగిన అడ్డంకులు

ఏపీలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. మంత్రివర్గం ఆమోదం పూర్తైంది. 2029లోపు ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.;

Update: 2025-04-06 07:00 GMT
ఫైల్ ఫొటో

ఆర్సెలర్‌ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (AM/NS India) విశాఖ పట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు సమీపానే పెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నది. రూ. 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు రానుంది. వేలాది మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంటుందని ప్రభుత్వం చెబుతూ ఉంది. దీని ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఉదారంగా వసతులు కల్పిస్తున్నాయి. కేప్టివ్ గనులు, కేప్టివ్ పోర్టు లు అందిచేశారు. కేప్టివ్ పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర వాటర్ ఫ్రంట్ అందించిందది. చిత్రమేమిటంటే, దీనికంటే ముప్పైయేళ్ల ముందు వచ్చిన పబ్లిక్ రంగ సంస్థ విశాఖ స్టీల్(Rashtriya Ispat Nigam Limited : RINL)గొంతుచించుకుని అరుస్తున్నా కేప్టివ్ మైన్ కేటాయించలేదు. కేప్టివ్ పోర్ట్ నిర్మాణానికి అవకాశమీయలేదు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు ఎందుకు ఇంత ప్రాముఖ్యం ఇస్తున్నారనేది ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

ఉత్పత్తి లక్ష్యాన్ని ఎలా నిర్ణయించారు?

ఈ ప్రాజెక్టు ఉత్పత్తి లక్ష్యం ప్రతి సంవత్సరం (MTPA) 17.8 మిలియన్ టన్నులు. ఇది రెండు దశల్లో సాధించబడుతుంది. మొదటి దశలో 7.3 MTPA, రెండవ దశలో 10.5 MTPA. ఈ లక్ష్యం AM/NS ఇండియా దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా నిర్ణయించారు. ఇది 2035 నాటికి భారతదేశంలో 40 MTPA ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈ లక్ష్యం నిర్ణయంలో భారతదేశంలో ఉక్కు డిమాండ్ పెరుగుదల (2030 నాటికి 300 MTPA జాతీయ లక్ష్యం), ఆటోమోటివ్ రంగం కోసం విలువ ఆధారిత ఉక్కు ఉత్పత్తుల అవసరం, ఎగుమతి సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలు పరిగణనలోకి తీసుకున్నారు. AM/NS అధికారి మనోరంజన్ కుమార్ చెప్పిన ప్రకారం తీరప్రాంత స్థానం, పోర్టు సౌలభ్యాలు ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఏపీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అందిన సౌకర్యాలు

3,025 ఎకరాల భూమిని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద. ఈ భూమి ప్రాజెక్టు మొదటి దశ కోసం ఉపయోగిస్తున్నారు. 2.9 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్‌తో కేప్టివ్ పోర్టు నిర్మాణానికి 2025 ఏప్రిల్ 3న రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పోర్టు మొదటి దశలో 20.5 MTPA సామర్థ్యంతో ₹5,816 కోట్లతో నిర్మిస్తారు.

ప్రాజెక్టుకు ఇంకా అందాల్సిన సౌకర్యాలు...

రెండవ దశ కోసం అదనంగా 2,000 ఎకరాల భూమి అవసరం. ఇది ఇంకా పూర్తిగా కేటాయించలేదు. కొన్ని భూములకు సంబంధించిన చట్టపరమైన సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.

ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే ముందు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు పొందాలి. అవి ఇంకా పూర్తిగా లభించలేదు.

ఉక్కు కర్మాగారం భారీ విద్యుత్ అవసరాలను తీర్చడానికి స్థిరమైన విద్యుత్ సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇది ఇంకా ప్రణాళిక దశలో ఉంది.

ఉత్పత్తి ప్రక్రియలకు అవసరమైన నీటి సరఫరా కోసం స్థానిక వనరులపై ఒత్తిడి పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.


ఎన్నేళ్ల క్రితం ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు?

ఈ ప్రాజెక్టు ఆలోచన మొదట 2018లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సమావేశంలో ఆర్సెలర్‌ మిట్టల్ CEO అదిత్య మిట్టల్, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మధ్య చర్చలతో ప్రారంభమైంది. అంటే.. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సుమారు 7 సంవత్సరాల క్రితం (2018) శ్రీకారం చుట్టారు. 2019లో రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి కారణంగా ఈ ప్రాజెక్టు కొంత కాలం స్తంభించింది. 2024లో NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు మళ్లీ వేగవంతమైంది.

2018లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని TDP ప్రభుత్వం హయాంలో జరిగింది. ఈ చర్చలు WEFలో ప్రారంభమై, రాష్ట్ర పెట్టుబడి టాస్క్ ఫోర్స్ ద్వారా ముందుకు సాగాయి. 2024లో మళ్లీ అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రాజెక్టుకు అధికారిక ఆమోదం, భూమి కేటాయింపు వంటి కీలక అడుగులు పడ్డాయి.

ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే ప్రాధాన్యం విశాఖ ఉక్కుకు ఎందుకు ఇవ్వటం లేదు?

విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతో మందికి ఉపాధినిస్తోంది. పైగా ప్రభుత్వ రంగంలో ఉన్న ప్లాంట్. ఈ ప్లాంట్ ను పట్టించుకోకుండా ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అవకాశం కల్పించడం అంటే ప్రైవేట్ రంగానికి వంతపాడటమేనని ప్రభుత్వంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి EAS శర్మ మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి లేఖ ద్వారా వివరించినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో కడప జిల్లాలో JSW కంపెనీ ద్వారా అప్పటి సీఎం వైఎస్ జగన్ పనులు మొదలు పెట్టించారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పని చేస్తున్నారన్నారు. ప్రైవేట్ కంపెనీలకు ప్రోత్సాహం ఇస్తూ ప్రభుత్వ కంపెనీని వదిలేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత వరకు ఉంది?

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (MoEFCC) నుంచి పర్యావరణ అనుమతులు అవసరం. ఇవి ఇంకా పూర్తిగా లభించలేదు. భారతదేశం 2030 నాటికి 300 MTPA ఉక్కు సామర్థ్యం సాధించాలనే లక్ష్యంలో భాగంగా, కేంద్రం ఉక్కు పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందులో స్పెషాలిటీ స్టీల్ కోసం PLI (Production-Linked Incentive) స్కీమ్ కూడా ఉంది. కేప్టివ్ పోర్టు నిర్మాణానికి సంబంధించి భారతీయ పోర్ట్స్ చట్టం 1908 కింద కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం. ఇది రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో జరుగుతుంది. ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం గురించి స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, రవాణా, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కేంద్రం పరోక్షంగా సహకరిస్తుంది.

ప్రాజెక్టును ఏపీలో ఎక్కడ నిర్మిస్తున్నారు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిష్పాన్ ఉక్కు కర్మాగం కోసం 3,025 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ ప్రాజెక్టు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాంతం సముద్ర తీరానికి సమీపంలో ఉండటం వల్ల రవాణా సౌలభ్యం, కేప్టివ్ పోర్టు డిఎల్ పురం వద్ద నిర్మిస్తున్నారు.

కేప్టివ్ పోర్టు అంటే ఏమిటి?

కేప్టివ్ పోర్టు అనేది ఒక ప్రైవేటు లేదా నిర్దిష్ట పరిశ్రమ కోసం ప్రత్యేకంగా నిర్మించే ఓడరేవు. నిప్పన్ ఉక్కు కర్మాగారం కోసం ముడి సరుకులు (ఇనుప ఖనిజం, బొగ్గు మొదలైనవి) దిగుమతి చేసుకోవడానికి, తయారైన ఉక్కు ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఈ పోర్టు ఉపయోగ పడుతుంది. ఇది రవాణా ఖర్చులను తగ్గించడమే కాకుండా, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ పోర్టు ప్రభుత్వ లేదా బహిరంగ వినియోగం కోసం కాకుండా, కేవలం నిష్పాన్ సంస్థ అవసరాల కోసమే నిర్మించనున్నారు.

వాటర్ ఫ్రంట్ కేప్టివ్ పోర్టు ఏర్పాటుకు అనుమతి

2.9 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ అనేది సముద్ర తీరంలో ఈ కేప్టివ్ పోర్టు నిర్మాణానికి కేటాయించిన ప్రాంతం. ఈ పొడవైన తీరప్రాంతం పోర్టు కార్యకలాపాలకు అవసరమైన ఓడల రాకపోకలు, లోడింగ్, అన్‌లోడింగ్ వంటి పనులకు స్థలాన్ని అందిస్తుంది. రాష్ట్ర మంత్రి మండలి ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. అంటే పర్యావరణ అనుమతులు, భూమి కేటాయింపు, ఇతర చట్టబద్ధమైన అనుమతులు సహా అన్ని అవసరమైన ఆమోదాలు లభించాయి. పోర్టు సామర్ధ్యాన్ని ఆధారం చేసుకొన వాటర్ ఫ్రంట్ నిర్మాణం చేస్తారు.

కాకినాడ గేట్‌వే ప్రైవేట్ లిమిటెడ్ పోర్టులో సవరించిన నిబంధనలు ఏమిటి?

కాకినాడ గేట్‌వే ప్రైవేట్ లిమిటెడ్ (KGPL) అనేది కాకినాడ సమీపంలో ఇప్పటికే ఉన్న ఓడరేవు నిర్వహణ సంస్థ. నిప్పన్ కేప్టివ్ పోర్టు నిర్మాణం కోసం KGPLతో ఒప్పందం కుదిరింది. సవరించిన నిబంధనల్లో భాగంగా, KGPL పోర్టు సామర్థ్యాన్ని నిష్పాన్ అవసరాలకు అనుగుణంగా విస్తరిస్తుంది. కేప్టివ్ పోర్టు కోసం ప్రత్యేక స్థలం కేటాయించడం, రవాణా కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి ఈ సవరణల్లో ఉన్నాయి. ఈ సవరణలు ప్రభుత్వం, నిప్పన్ మధ్య చర్చల ఫలితంగా ఏర్పడ్డాయి. అయితే ఖచ్చితమైన సవరణల వివరాలు బహిరంగంగా పూర్తిగా వెల్లడి కాలేదు.

పకడ్బందీగా పర్యావరణ పునరుద్ధరణ ప్రణాళికలు అవసరం...

ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీర్ఘకాలంలో స్థానిక జీవవైవిధ్యం, మత్స్య సంపదపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. పర్యావరణ వేత్తల వ్యతిరేకత ఈ సమస్యలను మరింత ఉద్దీపనం చేస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో సమతుల్య విధానాన్ని అవలంబించి, సుస్థిర అభివృద్ధిని నిర్ధారించే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు కఠినమైన కాలుష్య నియంత్రణ చర్యలు, పర్యావరణ పునరుద్ధరణ ప్రణాళికలు చేపట్టాలి.

ప్రాజెక్టు వల్ల పర్యావరణంపై ప్రభావాలు

పోర్టు నిర్మాణం, ఉక్కు కర్మాగం కార్యకలాపాల వల్ల సముద్ర జలాల్లో రసాయన కాలుష్యం, భారీ లోహాలు చేరే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో నిర్మాణం వల్ల స్థానిక పక్షులు, చేపలు, ఇతర జీవుల ఆవాసాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఉక్కు ఉత్పత్తి ప్రక్రియలో బొగ్గు ఉపయోగం వల్ల కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు విడుదలవుతాయి. విస్తృతమైన భూమి సేకరణ, నిర్మాణం వల్ల స్థానిక వ్యవసాయ భూములు, నేల సారం ప్రభావితం కావచ్చు.

పర్యావరణ వేత్తలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

సముద్ర తీరం జీవవైవిధ్య హాట్‌స్పాట్‌గా పరిగణిస్తున్నారు. పర్యావరణ ప్రభావ మదింపు (EIA) Environmental Impact Assessment నివేదికలు సమగ్రంగా లేవని, దీర్ఘకాలిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. చేపల వేటపై ఆధారపడే స్థానిక మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

ముడి సరుకు ఎక్కడి నుంచి తెస్తారు?

నిప్పన్ ఉక్కు కర్మాగారం కోసం ముడి సరుకులు (ప్రధానంగా ఇనుప ఖనిజం, కోకింగ్ కోల్, ఇతర సంబంధిత పదార్థాలు) ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేయబడతాయి. AM/NS ఇండియా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రతిపాదిత కేప్టివ్ పోర్టు ద్వారా ఈ ముడి సరుకులను గ్లోబల్ మార్కెట్ నుంచి పోటీ ధరలకు సేకరిస్తారు. ఇనుప ఖనిజం భారతదేశంలోని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కొంత మేరకు సేకరించవచ్చు. అయితే కోకింగ్ కోల్ వంటి కీలక ముడి సరుకులు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఈ పోర్టు రవాణా ఖర్చులను తగ్గించడంతో పాటు, సరఫరా గొలుసును సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 25,000 నుంచి 30,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ వారు అంచనా వేశారు. కర్మాగారంలో పనిచేసే కార్మికులు, లాజిస్టిక్స్, సరఫరా గొలుసు, సంబంధిత సేవల్లో పనిచేసే వారు ఉంటారు. ఈ సంఖ్య ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చిన తర్వాత స్పష్టమవుతుంది.

Tags:    

Similar News