పొగడ్తలతో అమరావతి కడుపు నింపిన మోదీ
ఇదీ ప్రధాని మోదీ 'మన్ కీ బాత్';
By : The Federal
Update: 2025-05-02 15:15 GMT
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (మే 2, 2025) అమరావతిలో చేసిన ప్రసంగంపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మిశ్రమ స్పందన వచ్చింది. అమరావతి ప్రాజెక్టుకు కేంద్రం నైతిక, రాజకీయ మద్దతును సూచిస్తుందే తప్ప ఆర్ధిక ఊతానికి ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. నిధుల ప్రకటన లేకపోవడం, విభజన హామీలపై స్పష్టత లేకపోవడం వల్ల ముఖ్యంగా ఆర్థిక సహాయం ఆశించిన వారికి మోదీ పర్యటన నిరాశ, నిరుత్సాహాన్ని మిగిల్చింది.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటి వరకు రాజధాని ఏర్పడలేదు. పదేళ్లుగా అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందలేదు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ వచ్చింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ఇంతవరకు పూర్తి కాలేదు. ఈనేపథ్యంలో కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రజలు ఎక్కువ ఆశలు పెంచుకున్నారు. ప్రధానమంత్రి మోదీ వస్తున్నారు గనుక నైతిక మద్దతుతో పాటు ఆర్థిక మద్దతు, విభజన హామీల అమలుపై స్పష్టత ఉంటుందని ప్రజలు ఆశించడం సహజం. దానికి బదులు మోదీ ప్రసంగం పరస్పరం పొగడ్తలు, ప్రశంసలతో ముగియడం గమనార్హం.
మోదీ ప్రసంగంలో కీలక అంశాలు...
అమరావతి ఒక శక్తిగా ఎదుగుతుంది. అమరావతిని కేవలం ఒక నగరంగా కాకుండా, ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక, అధునాతన రాష్ట్రంగా మార్చే "శక్తి"గా మోదీ అభివర్ణించారు. ఇది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా, వికసిత భారత్ కు ఓ బలమైన పునాదిగా చిత్రీకరించారు.
ఆయన ఈ మాట అన్నారంటే దానర్థం రాజధాని నిర్మాణానికి నైతిక మద్దతును, దీర్ఘకాలిక దృష్టిని సూచిస్తాయి. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరస్పరం పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. చంద్రబాబు దూరదృష్టిని, అమరావతి ప్రాజెక్టును పునరుద్ధరించడంలో ఆయన నాయకత్వాన్నిమోదీ కొనియాడారు. చంద్రబాబు మరో అడుగు ముందుకేసి మోదీ ప్రపంచానికే మార్గదర్శకుడని కీర్తించారు. బహుశా మోదీ- కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని, రాజకీయంగా బలమైన సందేశాన్ని ఇవ్వడం కోసం ఈ పొగడ్తలు చేసి ఉండవచ్చు. ముఖ్యంగా TDP-BJP-Janasena కూటమి నేపథ్యంలో మోదీ- చంద్రబాబులు ఒకర్నొకరు ప్రశంసించుకుని ఉండవచ్చు.
ఇక అమరావతి ప్రాజెక్టును భారతదేశ అభివృద్ధి లక్ష్యాలతో ముడిపెడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు దేశ ఆకాంక్షలతో జోడించారు. రాష్ట్ర అభివృద్ధిని జాతీయ లక్ష్యాలతో అనుసంధానం చేయడం ద్వారా, మోదీ రాజధాని ప్రాజెక్టుకు మరింత ప్రాధాన్యత ఇచ్చీ ఇవ్వనట్టుగా మాట్లాడి ఉంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక నెగటివ్ కోణంలో చూస్తే నిధుల ప్రకటన లేకపోవడం ప్రజల్లో నిరుత్సాహాన్ని నింపింది. "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2105 అక్టోబర్ 22న ఇదే అమరావతికి తొలిసారి శంకుస్థాపనకు వచ్చినపుడు కనీసం మట్టీ, నీళ్లు అయినా తెచ్చారు. ఈసారి అది కూడా లేదు. కేవలం మాటలతో మెస్మరైజ్ చేయడానికే వచ్చినట్టుంది" అని సీనియర్ జర్నలిస్టు జీపీ వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళీ మాటల్లో చెప్పాలంటే " మాటలు మనకు… మూటలు బీహార్ కు… అమరావతికి ఉత్తి మాటలు… ఆంధ్రప్రదేశ్ కు టాటా… బీహార్ కు వాటా… ప్రధాని పర్యటన నిష్పలం…" అని అన్నారు.
మోదీ తన పర్యటనలో సుమారు 60 వేల కోట్ల రూపాయల అమరావతి నిర్మాణపనులకు శంకుస్థాపనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన ప్రకారం నూతన రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలి. ఇప్పుడా ప్రస్తావన లేకుండానే మోదీ ప్రసంగం ముగిసింది.
రాజకీయ లాభం vs ఆచరణాత్మక ఫలితాలు
మోదీ ప్రసంగం రాజకీయంగా NDA కూటమిని బలపరచడంలో, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించడంలో విజయవంతమైంది. అయితే, ఆచరణాత్మక ఫలితాలు అంటే నిధుల కేటాయింపు లేదా విభజన హామీల అమలు వంటి అంశాలు లేకపోవడం వల్ల దాని ప్రభావం పరిమితమైంది. ఇది రాష్ట్ర ప్రజలలో "మాటలు ఎక్కువ, చేతలు తక్కువ" అనే భావనను కలిగించి ఉండవచ్చు.
"కేంద్ర ప్రభుత్వం గత పదేండ్లలో రాష్ట్రాలకు ఇచ్చిన నిధులను పెట్టుబడులుగా భావించింది. అమరావతికి నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వానికి తన నిధుల వల్ల పెట్టుబడికి తగ్గ ప్రయోజనాలు లేదా లాభాలు రావాలి. అమరావతిని ఒక బిజినెస్ మోడల్ చూసినంత కాలం, కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టుబడి పెట్టటానికి సిద్ధంగా లేదు. అందరినీ సంతోషపెట్టలేని పరిస్థితే ఏపీ రాజధాని విషయంలోనూ స్పష్టం అవుతున్నది. ఏమి జరగకుంటే నష్టపోయేది ఎవరు? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానాన్ని బట్టి రాజధాని అభివృద్ధిలో వ్యూహం వస్తుంది. ఇప్పటి కైనా, ఉన్న చిక్కుముడులు దాటలన్నా మొదట రాజధాని నగరం అంటే ఏమిటి అనేది నిర్ధారణ కావాలి" అన్నారు సామాజిక విశ్లేషకులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి అస్తుబిస్తుగా ఉంది. రుణ భారంతో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు రాష్ట్రానికి కీలకం. మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడిని పెంచవచ్చు. రాజధాని నిర్మాణం వేగాన్ని ప్రభావితం చేయవచ్చు.
కానీ చంద్రబాబు మరోపక్క మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తానని ప్రకటించారు. మోదీ కూడా చంద్రబాబు చెప్పిన విషయాన్ని మెచ్చుకుంటూ అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ జీడీపీ ఎక్కడికో పోతుందని సీరియస్ గానే చెప్పినా అది సాధ్యమా అనే ప్రశ్న ఉత్పన్నం కాకామనదు. మూడేళ్లలో నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే ప్రశ్న ఉండనే ఉంది. ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకులు ఇన్ని వేల కోట్ల రూపాయలను రుణాలు ఇస్తాయా అనే సందేహం రాష్ట్ర ప్రజలను వెంటాడుతోంది. "ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా రాజధానిని నిర్మిస్తామని రాష్ట్ర మంత్రి పి.నారాయణ చెబుతున్నారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని" సీనియర్ జర్నలిస్టు టీవీ నరసింహారావు అన్నారు.
నిధుల ప్రస్తావన లేకపోవడంపై సెటైర్లు...
మోదీ ప్రసంగంలో ఎక్కడా నిధుల ప్రస్తావన లేకపోవడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. "ఆయన (మోదీ) వచ్చారు, బటన్ నొక్కారు, విమానం ఎక్కారు" అని ఒకరంటే "పవన్ కల్యాణ్ కి చాక్లెట్ ఇచ్చి వెళ్లారని" ఇంకొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కొన్ని పోస్ట్‌లు నిధుల ప్రకటన లేకపోవడంపై నిరాశను వ్యక్తం చేశాయి. అయితే ఇవి సాధారణ జనాభిప్రాయాన్ని పూర్తిగా ప్రతిబింబించకపోవచ్చు. అయినప్పటికీ, రాజధాని నిర్మాణం రాష్ట్రంలో ఒక భావోద్వేగ అంశం, నిధులపై స్పష్టత లేకపోవడం ప్రజలలో అనిశ్చితిని సృష్టించింది.
విభజన హామీలపైమౌనం
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, కడప ఉక్కు పరిశ్రమ వంటి హామీలపై మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ మౌనం విపక్షాలకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశం ఇచ్చింది.
మోదీ ప్రసంగం ఆశాజనకంగా, ఉత్సాహవంతంగా ఉన్నప్పటికీ రాజధాని నిర్మాణానికి రోడ్‌మ్యాప్, టైమ్‌లైన్, లేదా ఆర్థిక వనరులపై స్పష్టమైన వివరణలు లేవు. ఇది ప్రసంగాన్ని కేవలం రాజకీయ సందేశంగా మాత్రమే కనిపించేలా చేసింది, ఆచరణాత్మక పురోగతిని ఆశించిన వారికి నిరాశను కలిగించింది.
అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించినప్పటికీ, గతంలో ఇచ్చిన హామీలు, ప్రస్తుత చర్యల మధ్య ఉన్న వ్యత్యాసం ప్రజల్లో మిశ్రమ స్పందన కలిగిస్తోంది.
పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. దానికి సహకారం అందిస్తామని మోదీ చెప్పడాన్ని కూడా రాజకీయ పార్టీలు ఆక్షేపించాయి. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, YSRCP వంటి విపక్ష పార్టీలు మోదీ ప్రసంగంలో నిధుల ప్రకటన లేకపోవడాన్ని, విభజన హామీల అమలులో జాప్యాన్ని విమర్శించాయి. ప్రత్యేక హోదా డిమాండ్ ఒక భావోద్వేగ అంశంగా మారిన నేపథ్యంలో మోదీ మాటలతో గారడీ చేశారని ఆరోపించాయి.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మోదీ ప్రసంగంపై ఘాటుగా వ్యాఖ్యానించారు. "ప్రధాని మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మాటలతో మోసం చేశారు. ప్రధాని చేసిన ప్రసంగం రాష్ట్రాభివృద్ధిపై ఏమాత్రం విశ్వాసం కలిగించేదిగా లేదు. గత 10 ఏళ్లలో అమరావతి నిర్మాణానికి సహకరించానని చెప్పడం ఎంతటి దగానో ప్రజలందరికీ తెలుసు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ఒక్కదాన్ని నిర్మించలేదు ఈ పదేళ్ళలో.. అమరావతి నిర్మాణం రానున్న మూడేళ్లలో పూర్తి చేయాలంటే కేంద్రం ఎంత నిధులు ఇస్తుందో చెప్పలేదు. రాష్ట్రంలో రూ. 60 వేల కోట్ల ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేశానని చెప్పిన ప్రధాని రాజధాని నిర్మాణానికి ఎంత ఇస్తున్నారో చెప్పలేదు. అప్పులు తెచ్చి రాజధాని నిర్మిస్తే ఆ భారం తిరిగి ప్రజలపైనే పడుతుంది. కేంద్రం నుంచి మనకు హక్కుగా రావాల్సిన నిధుల్ని రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం వేయాలి" అని అన్నారు.
లక్ష కోట్ల అప్పు తెచ్చి రాజధాని నిర్మాణం చేపట్టం విడ్డూరంగా ఉందని వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. "సినిమా డైలాగ్ మాదిరిగా చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్లుగా చంద్రబాబు రాజధాని నిర్మాణానికి శంకుస్థాపనలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు భూదోపిడికి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోదీ రాష్ట్ర అభివృద్ధికి అప్పులు తప్ప ఏమీ ఇవ్వడం లేదు. లక్ష కోట్ల అప్పు తెచ్చి రాజధాని నిర్మాణం చేపట్టం అవసరమా? ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో రాష్ట్రానికి ఏం తీసుకువచ్చారో చెప్పాలి" ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం రాష్ట్ర ప్రజలు ఆశించిన రీతిలో లేదు. చంద్రబాబును ప్రశంసించడానికీ, ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుందని చెప్పడానికి పనికి వచ్చిందే తప్ప రాజధాని నిర్మాణానికి ప్రత్యేకంగా చెప్పిందేమీ లేదనే టాక్ వినిపిస్తోంది.