మళ్లీ ‘సోమవారం పోలవరం’ వచ్చేసింది

గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఈ నినాదం మారుమోగి పోయింది. ప్రతి వారం దీనిపై సమీక్షించి చరిత్ర సృషించారు.;

Update: 2024-12-15 11:44 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014–19 అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలరం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం వస్తే చాలు.. పోలవరం సందర్శన కానీ, పోలవరంపై సమీక్షలు కానీ చేపట్టేవారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంలో భాగంగా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు పెట్టి మరీ జనాలను తరలించే వారు. పోలవరం సందర్శకులకు రవాణా సౌకర్యాలతో పాటు భోజనాలు కూడా ఉచితంగానే సమకూర్చే వారు. పోలవరం సందర్శించిన సందర్భంలోనే పలువురు మహిళలు తీవ్ర ఉత్సాహానికి గురై ‘జయము జయము చంద్రన్న’ అంటూ పోలవరంలో మహిళా బృందం పాడిన ఓ భజన పాట ఇప్పటికీ ట్రెండ్‌ అవుతూనే ఉంది. తాను చేసిన పనికి ప్రజల్లో ప్రచారం చేసుకొని మార్కెటింగ్‌ చేసుకోవడంలో చంద్రబాబు మార్కు రాజకీయాన్ని ఎవరూ అందుకోలేరు. అయితే ప్రతి సోమవారం పోలవరం చేపట్టినా.. ఆ ఐదేళ్లల్లో పోలవరాన్ని మాత్రం పూర్తి చేయలేక పోయారు.

ఇప్పుడు కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ మరో సారి సోమవారం పోలవరం కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సోమవారం పోలవరం సందర్శించి, పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. ఆమేరకు అధికారులు పోలవరంలో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. హెలిపాడ్‌ నుంచి ప్రాజెక్టు వరకు ప్రత్యేక ట్రయల్‌ రన్‌ను కూడా చేపట్టారు. ఈ సారి అయినా పోలవరాన్ని పూర్తి చేస్తారా? లేక గతంలో మాదిరిగా ప్రతి సోమవారం పోలవరం సమీక్షలకే పరిమితం అవుతారా? అనేది చర్చగా మారింది. అయితే ఈ సారి మాత్రం పోలవరంపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్‌గా ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్‌ చేయాలనే పట్టుదలతో ఉన్నారనే టాక్‌ టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
దీంతో కూటమి పాలనలో పోలవరం నిర్మాణం పనులు వేగవంతం అవుతాయని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా పోలవరం నిర్వాసితుల పునరావాసం, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి సాధించేలా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కృషి చేస్తారనే ధీమా కూటమి నేతల్లో వ్యక్తం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మనుగడ సాగించడంలో టీడీపీ మద్ధతు కీలకం కావడంతో, పోలవరంతో పాటు రాజధాని అమరావతి వంటి మేజర్‌ ప్రాజెక్టులకు కేంద్ర నుంచి నిధులు సాధించడం చంద్రబాబుకు నల్లేరు మీద నడకే అవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Tags:    

Similar News