ఆంధ్రప్రదేశ్‌ – కర్ణాటకల మధ్య ఎంఓయు

కుంకీ ఏనుగులు, సమాచార మార్పిడి, గిరిజనుల శిక్షణ, స్మగ్లర్లపై నిఘా, ఎకో టూరిజం, ప్రత్యేక టాస్క్‌ ఫోర్సుల ఏర్పాటుపై మధ్య కీలక ఒప్పందం.

Update: 2024-09-27 14:55 GMT

సమగ్ర అధ్యయనం, విజ్ఞానం, సహకారంతో ముందుకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు నిర్ణయించాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య అడవుల పరిరక్షణ, వన్య ప్రాణులన సంరక్షణ, గిరిజనులకు శిక్షణ, సమాచార మార్పిడి, ఏనుగుల సమస్య,ఎకో టూరిజం వంటి కీలకమైన అంశాల పట్ల మెమోరాండం ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌ (ఎంయూఓ) కుదిరింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్‌ కళ్యాణ్, కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ బి.ఖండ్రే సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. శుక్రవారం విజయవాడలో అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని, ఇది కేవలం చిత్తూరు జిల్లాలోనే కాకుండా, రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా సమస్య ఉందన్నారు.

ఈ ఏనుగుల సమస్యను ఎలా అధిగమించాలని అధికారుల సమీక్ష సమావేశంలో అడిగాను. దీనికి వారు ఏనుగుల గుంపులను కంట్రోల్‌ చేయాలంటే కర్ణాటక వద్ద శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల వల్లనే సాధ్యమని చెప్పారు. వెంటనే కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ బి.ఖండ్రేతో మాట్లాడితే సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చిస్తే సానుకూలంగా స్పందించారన్నారు. కేవలం ఏనుగుల కోసమే కాకుండా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పలు కీలకమైన అంశాలపై పరస్పర సహకారంతో ముందుకెళ్తామన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల సమస్యపైన పరస్పర సహకారం తీసుకుంటామన్నారు. ప్రత్యేక టాస్క్‌ ఫోర్సుల ఏర్పాటు, వన్య ప్రాణుల సంరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధి, గిరిజనులకు ప్రత్యేక శిక్షణ వంటి కీలకమైన అంశాలపై రెండు రాష్ట్రాలు కలిసి పని చేస్తాయన్నారు. కుంకీ ఏనుగులను ఇవ్వడమే కాకుండా శిక్షణ కోసం ప్రత్యేకంగా ఓ శిబిరం ఏర్పాటు చేయనుందన్నారు. అడిగిన వెంటనే ఏనుగులను ఇవ్వడానికి ఒప్పుకోవడమే కాకుండా, అన్ని విధాలా సహకారం అందించడానికి ముందుకు వచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి, ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

Tags:    

Similar News