‘పవన్ మగాడైతే’ అంటూ ముద్రగడ సంచలన వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ప్రెస్‌మీట్ పెట్టి ప్రశ్నించాలని ఛాలెంజ్ చేశారు.

Update: 2024-04-10 08:29 GMT
Source: Twitter

జనసేనాని పవన్ కల్యాణ్, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉంది. అది మరింత దారుణంగా తయారైంది. తాజాగా పవన్‌పై ముద్రగడ మండిపడ్డారు. ‘‘పవన్ మగాడే అయితే నన్న డైకెక్ట్‌గా అనాలే తప్ప తెరచాటుగా అనిపించడం కాదు’’అని ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా పవన్ స్థానికత్వంపై కూడా ముద్రగడ కీలకంగా మాట్లాడారు. పవన్ పుట్టింది ఆంధ్రలో కానప్పుడు ఇక్కడి ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు. ‘‘పవన్ కల్యాణ్ పుట్టింది హైదరాబాద్‌లో. అంటే తెలంగాణ. ఇప్పుడు ఆ రాష్ట్రం వేరు.. మన రాష్ట్రం ఆంధ్ర వేరు. ఇప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పిఠాపురంలో ఎమ్మెల్యే అవుతానని అంటే ఎంతవరకు సబబు? పవన్‌కు ఇప్పుడున్న కోపం, పౌరుషం, పట్టుదల.. హైదరాబాద్‌లో అవమానం జరిగినప్పుడు ఏం అయ్యాయి?’’అని ప్రశ్నల వర్షం కురిపించారు. తిరగబడలేదు సరే.. చివరకు అవమానించిన వారికే వెళ్లి టిఫిన్ చేస్తారా అంటూ వ్యాఖ్యానించారు.

‘‘సీఎం స్థాయిలో ఉన్న జగన్‌ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అది సరి కాదు. ఏమైనా చెబితే సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లతో మనల్ని తిట్టిస్తారు. నాపై తెరచాటుగా మాట్లాడటం కాదు. పవన్ మగాడైతే.. ప్రెస్‌మీట్ పెట్టండి.. నన్ను ప్రశ్నించండి. సమాధానాలు ఇస్తా.. అదే విధంగా నేనూ ప్రశ్నిస్తా.. మీరూ బదులు ఇవ్వండి. ఆ దమ్ము మీకుందా. మరోవైపు ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీ వ్యాఖ్యలు ప్రజలు అంతా అమ్ముడుపోతారు అన్నట్లుగా ఉన్నాయి. అది ఏమాత్రం సరైన పద్ధతి కాదు’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు ముద్రగడ.

Tags:    

Similar News