'హలో కాపు, చలో తుని' నేత ముద్రగడ వైసీపీలోకి!
జగన్ ను కాపు రిజర్వేషన్ల గురించి అడుగుతారో లేదో తెలియదు గాని ముద్రగడ పద్మనాభం మాత్రం వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. సీఎం పిలుపే తరువాయి..
కాపు రిజర్వేషన్ పోరాట సమితీ పేరిట తెలుగుదేశం ప్రభుత్వాన్ని హడలెత్తించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. జగన్ బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఆ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత తూర్పు గోదావరి జిల్లా పార్టీ నేతలతో సమావేశం అవుతారు. ఆ తర్వాత ముద్రగడను తాడేపల్లిలోని సీఎం నివాసానికి ఆహ్వానిస్తారని సమాచారం.
తొలి విడత చర్చలు పూర్తి...
జనసేనలో చేరతారని ఊహించిన ముద్రగడ కుటుంబం ఇప్పుడు రూటు మార్చింది. వైసీపీ బాట పట్టింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరును విమర్శిస్తూ కాపు రిజర్వేషన్ పోరాట సమితీ నాయకుడైన ముద్రగడ పద్మనాభం ఇటీవల ఘాటుగానే లేఖ రాశారు. ‘ఆయన (పవన్) తన ఇంటికి వస్తే ఒక నమస్కారం, రాకుంటే రెండు నమస్కారాలు, పవన్ నా ఇంటికి రాకుండా ఉండాలనే కోరుకుంటున్నానండీ’ అంటూ ముద్రగడ ఒకింత వెటకారం మరింత ఆగ్రహం, ఆవేదనతో లేఖను సంధించారు. ఈ లేఖ రాసినప్పుడే ఆయన జనసేనను విడిచిపెట్టి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైందని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే తూర్పుగోదావరి జిల్లా పార్టీ ముఖ్యులు వంగా గీత, కన్నబాబు వంటి వారు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి జగన్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభాన్ని కూడా పిలిపించి మాట్లాడారని వార్తలు బయటకు పొక్కాయి. తనపై వచ్చే ప్రతి ఆరోపణలకు బదులిచ్చే ముద్రగడ ఈసారి అటువంటి ఖండన, మండనలు లేకపోవడం కూడా ఆయన వైసీపీలో చేరతారనడానికి బలం చేకూరింది.
ఆపరేషన్ వైసీపీ ఆకర్ష్ సక్సెస్...
చాలాకాలంగా ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించాలన్నది తూర్పుగోదావరి జిల్లా ముఖ్యనేతల వ్యూహం. దానికోసం గతంలో రకరకాల ప్రయత్నాలు జరిగాయి. అయినా ముద్రగడ ససేమిరా అంటూ వచ్చారు. ఓదశలో వైసీపీ నేతలు ఎవ్వరూ “నా ఇంటి వైపు రావొద్దండి” అని బోర్డు కూడా పెట్టారు. ఆ దశలో జనసేన నేతలు కొందరు ముద్రగడ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. జనసేనలో చేర్చేందుకు అంగీకరింపజేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన జనసేనకు దూరం అయ్యారు. దీన్ని అవకాశంగా మార్చుకున్న వైసీపీ వల విసిరింది. ముద్రగడను అక్కున చేర్చుకోనుంది.
కండిషన్స్ ఏమిటంటే...
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేరిక లాంఛనమే. ఎటువంటి షరతులు లేవు. ఆయన ఎటువంటి ఫలాపేక్ష లేకుండానే వైసీపీలో చేరతారు. కాపు రిజర్వేషన్ల సంగతి ఏమైనా అడుగుతారా లేక వదిలేస్తారా అనేది ఇంకా తేలలేదు. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన ‘హలో కాపు, చలో తుని’ కార్యక్రమం చేపట్టి రైలు బోగీల దగ్ధం కేసులో అష్టకష్టాలు పడ్డారు ముద్రగడ పద్మనాభం. కాపు రిజర్వేషన్ల వ్యవహారం తన చేతిలో లేదని, కాపు రిజర్వేషన్లు ఇవ్వలేనని వైఎస్ జగన్ తన పాదయాత్రలో చాలా విస్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆయన్ను ముద్రగడ రిజర్వేషన్ల విషయం అడుగుతారా లేదా అనేది చర్చనీయాంశంగా ఉంది.
కుమారుడికి పిఠాపురం సీటు...
ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీ వైసీపీలో చేరితే ఆయన కుమారుడు గిరిబాబుకి పిఠాపురం సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో ముద్రగడ ఈసీటు నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఓడిపోయారు. ఇప్పుడా సీటును వంగా గీతకు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించిన తరుణంలో ముద్రగడ కుమారుడు రంగ ప్రవేశం చేస్తున్నారు. కుమారుని సీటు కోసం ముద్రగడ పట్టుబట్టక పోయినా ఆయన వస్తే కాపుల్లో చీలిక వస్తుందనే భావనలో పిఠాపురం సీటును ముద్రగడ కుమారునికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి ముద్రగడ పద్మనాభం మధ్య సుహృద్భావ వాతావరణే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ చేరిక లాంఛనమే.