చిత్తూరు మేయర్ దంపతుల హత్య: ఐదుగురికి ఉరిశిక్ష
పదేళ్ల న్యాయ పోరాటానికి తెర — చిత్తూరు జిల్లా కోర్టు సంచలన తీర్పు
By :  The Federal
Update: 2025-10-31 06:56 GMT
దశాబ్దం కిందట జరిగిన చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది. చిత్తూరు జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎన్. శ్రీనివాసరావు ఐదుగురి నిందితులను దోషులుగా తేల్చి వారికి ఉరిశిక్ష విధించారు. 2015 నవంబర్ 17న చిత్తూరు నగర పాలక సంస్థ  మేయర్ కార్యాలయంలోనే ఈ జంట హత్యలు జరిగాయి. 
అప్పటి మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ (టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు)పై తుపాకులు, కత్తులతో దాడి చేశారు. దాడిలో అనురాధ ఘటనా స్థలంలోనే మృతిచెందగా, తీవ్రంగా గాయపడ్డ మోహన్ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మరణించారు. మేయర్ భర్త కఠారి మోహన్ మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ (A1) ఈ హత్యకు మాస్టర్‌మైండ్‌గా పోలీసులు పేర్కొన్నారు. ఆర్ధిక, రాజకీయ, వ్యక్తిగత విభేదాల కారణంగా చింటూ మేనమామను అడ్డుగా భావించి తొలగించాలని నిర్ణయించుకున్నాడు. ఆరోజు బురఖాలు ధరించి, తొపాకులు, కత్తులతో నలుగురు సహచరులతో కలిసి కార్యాలయంలోకి చొరబడ్డాడు. వారిపై హత్యాయత్నం చేశాడు.
దోషులుగా తేలిన ఐదుగురు
న్యాయస్థానం తుది తీర్పులో ఈ ఐదుగురిని దోషులుగా తేల్చింది:
శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ (A1)
గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్ (A2)
జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జయారెడ్డి (A3)
మంజునాథ్ అలియాస్ మంజు (A4)
మునిరత్నం వెంకటేష్ (A5)
కేసు పరిణామాలు
మొదట ఈ కేసులో 23 మందిని నిందితులుగా నమోదు చేశారు. తరువాత ఏ22 కాసారం రమేష్ పిటిషన్ దాఖలు చేయడంతో పేరు తొలగించారు. ఏ21 శ్రీనివాసాచారి విచారణ జరుగుతున్న సమయంలో మరణించారు. దాంతో 21 మందిపై విచారణ కొనసాగింది.
హంతకులకు ఆయుధాలు సమకూర్చడం, ఆశ్రయం ఇవ్వడం, ధన సాయం చేయడం వంటి ఆరోపణలపై మిగతా 16 మందిపై అభియోగాలు రుజువు కాలేదు. వారు నిర్దోషులుగా విడుదలయ్యారు. 
ఈ కేసులో విచారణ దశలో 352 వాయిదాలు, 130 మంది సాక్షుల విచారణ, దాదాపు 10 సంవత్సరాల న్యాయప్రక్రియ సాగింది.
ఏ3 జయప్రకాష్‌రెడ్డి, ఏ4 మంజునాథ్ — అరెస్టు అయినప్పటి నుంచి జైలులోనే ఉన్నారు.
తీర్పు అనంతరం ఉరిశిక్ష విధించిన దోషులను వైద్య పరీక్షల అనంతరం కడప సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
దంపతులపై దాడి సమయంలో అక్కడే ఉన్న వేలూరి సతీష్‌కుమార్ నాయుడుపై కూడా హత్యాయత్నం జరిగింది. ఆ ఘటనపై వేరే కేసు నమోదు చేయగా, ఆ నేరం కూడా రుజువైంది.
పది సంవత్సరాల తరువాత వచ్చిన ఈ తీర్పు చిత్తూరు జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు- చట్టం చివరికి గెలిచింది- అంటూ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు.
అయితే, శిక్ష పడిన ఈ ఐదుగురు హైకోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటును కోర్టు కల్పించింది.