ముద్రగడ.. ఎట్టకేలకు తాడేపల్లి చేరిపోయారండి!

సీనియర్‌ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌సీపీలో చేరారు. జగన్‌ మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారాయన.;

Update: 2024-03-15 09:00 GMT
ముద్రగడ, ఆయన కుమారుడు గిరి వైసీపీలో చేరిక

సీనియర్‌ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌సీపీలో చేరారు. విజయవాడకు సమీపంలోని తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారాయన. ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో కొంతకాలంగా సాగిన చర్చకు తెర పడింది. వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందని, ఎన్నికల్లో జగన్‌ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు ముద్రగడ. కొంతకాలంగా ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ ఏపీలో తీవ్రంగా నడిచింది.

జనసేనలో చేరతారని అనుకున్నా ఆయన మాత్రం వైసీపీ వైపే మొగ్గు చూపారు. ముద్రగడ పద్మానాభం, ఆయన కుమారుడు గిరిని ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వెంటపెట్టుకుని జగన్ వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే జగన్ ఇంటి వద్ద ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి స్వాగతం పలికి జగన్ వద్దకు తీసుకువెళ్లారు. వాళ్లిద్దరూ చేరిన తర్వాత క్యాంప్ కార్యాలయం నుంచి ఫోటోలు విడుదల చేశారు.

1978లో జనతా పార్టీతో ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించాక అందులో ముద్రగడ చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ముద్రగడ గెలుపొందారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకినాడ లోక్‌సభ స్థానంలో గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో మంత్రిగానూ ఆయన పని చేశారు. కాపు ఉద్యమ నేతగా ఆయన పోరాటం చేశారు. హలో కాపు, చలో తుని పేరిట నిర్వహించిన కార్యక్రమంలో తుని వద్ద రైలు దగ్ధమైంది. ఆ కేసులో నిందితులను ఇటీవల వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ సమయంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఆయన తీవ్ర మానసిక, శారీరక క్షోభకు గురయ్యారు. తిరిగి ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వైఎస్ జగన్ తో చేతులు కలిపారు.

Tags:    

Similar News