అభిమానులకు ముద్రగడ లేఖ.. ‘ఒక్కడినే వెళతా’
తాడెపల్లికి నిర్వహించాలనుకున్న ర్యాలీని రద్దు చేస్తున్నట్లు ముద్రగడ పద్మనాభం అభిమానులకు ఈరోజు రాసిన లేఖలో తెలిపారు. ఒక్కడినే వెళ్లి వైసీపీలో చేరతానని చెప్పారు.
Update: 2024-03-13 08:56 GMT
కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమయ్యారు. ఈనెల 14 (గురువారం) రోజున సీఎం జగన్ సమక్షంలో పార్టీలోకి చేరాలని నిర్ణయించుకున్న ముద్రగడ ఆఖరి నిమిషంలో సంచలన ప్రకటన చేశారు. రేపు తాడెపల్లికి వెళ్లడం లేదని ప్రకటించారు. ఈ మేరకు తన అభిమానులకు ఓ లేఖ రాశారు. ఇందులో తాడెపల్లికి అందరం కలిసి వెళ్లాలన్న నిర్ణయాన్ని మార్చుకోవడానికి గల కారణాలను వివరించారు.
భారీ స్పందన రావడమే కారణం
వైసీపీలో చేరాలని నిశ్చయించుకున్న ముద్రగడ పద్మనాభం.. గురువారం నాడు తన స్వగ్రామం కిర్లంపూడి నుంచి తాడెపల్లికి అభిమానులతో కలిసి వెళ్లాలని భావించారు. దానికి సంబంధించి రూట్ మ్యాప్‌ను కూడా రెడీ చేశారు. ఈ ర్యాలీకి భారీగా స్పందన లభించింది. ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఊహించని సంఖ్యలో అభిమానులు ముందుకొస్తున్నారు. కాగా ఈ ర్యాలీకి ఊహించిన దానికన్నా అత్యధికంగా స్పందన రావడంతో సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తొచ్చని అధికారులు చెప్పారని తెలిపారు.
‘‘ర్యాలీకి ఊహించిన దాని కంటే భారీ స్థాయిలో స్పందన రావడంతో మీకు సెక్యూరిటీ ఇబ్బంది ఉంటుంది. చాలా మందికి కూర్చోడానికి, నిలబడానికి కూడా స్థలం ఉండదు. దానికి తోడు ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయడం కూడా చాలా కష్టం అవుతుందని అధికారులు తెలిపారు. అందుకే తాడెపల్లికి మనమందరం కలిసి వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాం. మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు క్షమాపణ కోరుకుంటున్నాను. అందుకే ఈ నెల 15-16 తేదీల్లో నేను ఒక్కడినే తాడెపల్లి వెళ్ళి సీఎం సమక్షంలో పార్టీలో చేరతాను. నాకు మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను’’అని లేఖలో పేర్కొన్నా ముద్రగడ పద్మనాభం. కానీ ముద్రగడకు ఇంకా సీఎం అపాయిట్‌మెంట్ అందలేదని సమాచారం.