ముద్రగడ మళ్లీ కాడిపడేశారు, జగన్ కి ఇచ్చిన హామీ ఏమిటంటే..

ముద్రగడ పద్మనాభం మరోసారి కాడిపడేశారు. వైఎస్ జగన్ కు ఇచ్చిన హామీ మేరకు ఈ పని చేస్తారట. ఇంతకీ ఆయన ఆ మాట ఎందుకన్నారు

Update: 2024-03-29 11:08 GMT
Mudragada File Photo

వైసీపీలో ఇటీవల చేరిన ముద్రగడ పద్మనాభం మరోసారి కాడిపడేశారు. ఇక ఏ ఉద్యమం చేయనంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హామీ ఇచ్చారు. ఈమేరకు ఆయన ఓ లేఖ రాశారు. దీంతో ఆయన మళ్లీ కాపులకు టార్గెట్ అయ్యారు. ‘లేఖలు రాయడం, అలగడం, ఇంట్లో కూర్చుని దీక్షలు చేయడం, రాజీనామాలు చేయడం, నేతల్ని తన ఇంటికి వచ్చేలా చేసుకుని బుజ్జగించేలా చూసుకోవడం, ఉద్యమానికి పిలుపిచ్చినట్టే ఇచ్చి మధ్యలో వదిలేయడం ఆయన (ముద్రగడ)కు అలవాటేనని’ కాపు యూత్, కాపునాడు నాయకులు తాజాగా ధ్వజమెత్తుతున్నారు. ముద్రగడ ఇప్పుడేమి ఉద్యమం చేయగలరో, ఇప్పుడా ప్రకటన ఎవర్ని మెప్పించడానికి ఇవ్వాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని సోషల్ మీడియాలో రెచ్చిపోయి వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే...

‘రాష్ట్రాన్ని జగన్ రామరాజ్యం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై కూడా జగన్ దృష్టి పెడతారనే నమ్మకం తనకు ఉంది. మరో 30 ఏళ్ల పాటు రాష్ట్రంలో జగనే అధికారంలో ఉంటారు. సీఎం ఆదేశాలతో ఇకపై తన నుంచి ఎలాంటి ఉద్యమాలు ఉండవు’ అని ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఓ లేఖ రాశారు. దాన్ని ప్రకటన రూపంలో మీడియాకు పంపారు. ఇక అంతే.. ఓ వైపు జనసేన కార్యకర్తలు మరోవైపు కాపు రిజర్వేషన్ ఉద్యమ సహచరులు ముద్రగడపై మండిపడ్డారు. “కాపు రిజర్వేషన్లపై పోరాటం తొందరపాటు చర్యని, ఆ ఉద్యమాన్ని చేపట్టవద్దని చెప్పినా వినకుండా ఆయన (ముద్రగడ) ఆ పనికి పూనుకున్నారు. హలో కాపు, చలో తుని అని పిలుపిచ్చారు. ఆ ఉద్యమాన్ని మధ్యలో ఆపేసి ఇంట్లోకి వెళ్లి కూర్చున్నారు. ఇది నిజమే కదా” అన్నారు ముద్రగడ ఒకప్పటి సహచరుడు సలాది వెంకట రమణ.

“ముద్రగడ పద్మనాభం ఆవేశపరుడు. జగన్ ఆదేశాల మేరకు ఉద్యమాన్ని నడపనని హామీ ఇచ్చారంటే దీని వెనుక ఏదో మతలబు ఉండి ఉంటుంది. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేనని, అప్పుడు కోపం వచ్చి బయటకు పోవొద్దని, జిల్లాల పర్యటనలో పవన్ కల్యాణ్ ను విమర్శిస్తే నొచ్చుకోవద్దని, ఆ మేరకు హామీ ఇవ్వాలని జగన్ అడిగి ఉంటారు, ఈయన లేఖ రాసి ఉంటారు అన్నారు కాపునాడు సునీల్.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మార్చి 30 నుంచి వారాహి రథ యాత్ర మొదలుపెడుతున్నారు. సరిగ్గా ఈ తరుణంలో ముద్రగడ ప్రకటన రావడం వెనుక ఏదో కుట్ర ఉందని జనసేన పిఠాపురం నాయకులు ఆరోపించారు. ముద్రగడకు నచ్చినా నచ్చకపోయినా కాపు యువత పవన్ వైపే వెళ్తుంది. దాన్ని అని గుర్తించడమే మనపని అన్నారు సలాది.

కులపోరాటం చేసి మీరు కాపులకు చేసింది అన్యాయమేనన్నారు సలాది వెంకట రమణ. ‘ఈ కులాన్ని మీరు మీకు రాజకీయ గుర్తింపు లేని సమయాల్లో రోడ్డు ఎక్కించడం తదుపరి ఆపివేయడం, మమ్మల్ని అందరినీ పోలీసులు కేసులు,

జైళ్ళు, బెయిళ్ళు, మీరు పరామర్శించడం, ఇతర కులాలు ఈ కులాన్ని విరోధులుగా చూసే స్థాయికి తీసుకెళ్ళారు’ తప్ప చేసిందేమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు సలాది.

మీరెప్పుడైనా కాపుల్ని ఆదరించారా?

‘మీరు మన కులంలో ఏ ఒక్క వ్యక్తి తమ తమ రంగాల్లో అభివృద్ధి చెందిన వారు మీ వద్దకు వస్తే మీరు వారిని ఎప్పుడు ఆదరించరు కదా. అంతెందుకు మీరు వైసీపీలో చేరడానికి ముందు .. ఓనాటి మీ మిత్రుడు, చెన్నారెడ్డి మంత్రి వర్గంలో మీ సహచర మంత్రి మాగంటి రవీంధ్రనాధ్‌ చౌదరిని కలిసి వచ్చారే గాని మరెవ్వర్నైనా కలిశారా అని ప్రశ్నించారు కాపు నాయకుడు తోట నరసింహారావు. తనకు నచ్చని పనులు ఎవరైనా చేసినపుడు ముద్రగడ పద్మనాభం గతంలో అనేక సార్లు రాజీనామాలు చేశారు. మంత్రివర్గం నుంచి తప్పుకున్న ఘటనలు ఉన్నాయి. 1986లో విజయవాడ సిటిబస్‌లు వ్యవహారంలో ఆయన కోపం ప్రదర్శించి మంత్రి పదవికి రాజీనామా చేసి కిర్లంపూడికి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చేశారు. కొంతమంది పెద్దలు దేవరపల్లి సూర్యారావు, బొడ్డు భాస్కర రామారావు పెద్దలు వచ్చి ఆయన్ను శాంతింపజేసి మళ్ళీ ఎన్‌.టి.ఆర్‌ వద్దకు తీసుకెళ్లారు. అప్పుడు ఆయనకు ఎక్సైజ్‌ శాఖకు మార్చారు. 1987లో కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఎలక్షన్‌లో తనకు నచ్చిన బొడ్డు భాస్కర రామారావుని ముద్రగడ అలిగి కొంతకాలం కోనసీమ నేతలతో మాట్లాడడమే మానేశారు. 1988 ప్రారంభంలో ఉత్తర కంచిలో జరిగిన చిన్న వివాదంపై పత్తిపాడు పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా నిరాహార దీక్ష చేశారు. అప్పుడు ఆయన మంత్రి కూడా.. షరా మామూలుగానే అప్పుడూ రాజీనామా చేశారు. 1988లో కాపునాడు ఉద్యమం కాకినాడ ఆనంద భారతిలో ఆకుల శివయ్యనాయుడు, మిరియాల వెంకట్రావు, పోతుల సీతారామయ్య ఆధ్వర్యంలో ముద్రగడ విజయవాడలో కాపునాడుకి పిలుపు ఇచ్చారు. ఆ తర్వాత దాన్నీ వదిలేశారు.

నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, కె.జానారెడ్డి, కె.ఈ. కృష్ణమూర్తితో కలిసి తెలుగునాడు పార్టీ ఏర్పాటు చేసి దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి మద్దతు పలికినందుకు ఎన్‌.జనార్ధన రెడ్డి క్యాబినేట్‌లో ముద్రగడకు చోటు దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన కె.విజయ భాస్కరరెడ్డి క్యాబినేట్‌లో కూడా మంత్రి పదవి దక్కలేదు. దాంతో కోపం పెరిగిపోయింది. ఆ కోపంలో నుంచి పుట్టిందే కాపు బిసి రిజర్వేషన్ల ఉద్యమం. ఆ తర్వాత దాన్నీ మధ్యలో వదిలేశారు... ఒక కులానికి ప్రయోజనం కోసం ఏ రాజకీయ నాయకుడు ప్రయత్నించ కూడదు అందరికి ఉపయోగపడే ప్రయోజం కోసం ఉద్యం చేయండని అనేక మంది సలహా ఇచ్చినా పోలవరం ప్రాజెక్టుపై ఉద్యమించమని చెప్పినా ఆయన వినలేదు. 1994 ఎన్నికలలో ప్రత్తిపాడులో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తే ముద్రగడను ప్రజలు ఓడించారు. ఇక ఆ నియోజకవర్గంలో పోటీ చేయబోనని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. 1999లో టి.డి.పిలో చేరి కాకినాడ ఎం.పి స్థానం నుంచి పోటీ చేసి గెలవడం,

2004లో యధావిథిగా టిడిపికి రాజీనామా చేసి ప్రతిపాడులో ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆటో గుర్తుపై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కలేదు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి తూర్పుగోదావరి జిల్లాకు నాయకత్వం వహించమని కోరారు. దాన్ని తిరస్కరించి కాంగ్రెస్ లో చేరి పిఠాపురం నుంచి పోటీ చేసి ప్రజారాజ్యం అభ్యర్ధి వంగా గీత చేతిలో మూడో అభ్యర్ధిగా ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో అసలు పోటీయే చేయలేదు. 2016లో చంద్రబాబు కాపు కులానికి రిజర్వేషన్‌ కల్పిస్తానని హామి ఇచ్చాడు. రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా చేయడేమిడంటూ లేఖలు రాశారు. తునిలో సభ పెడితే ఏ నాయకుణ్ణీ ప్రసంగించనీయకుండా సభకు వచ్చిన అశేష జనవాహినిని రోడ్డు రోకోకు, రైలు రోకోకు తరలించి కాపుల్ని రోడ్డు మీదకు తెచ్చారు. ఆ సంఘటన ద్వారా అన్ని జిల్లాలోని పోలీసులు సభకు వెళ్ళిన వారి వివరాలు తీసుకుని ఆయా పోలీస్‌స్టేషన్లలో ఎందరో యువకుల్ని ఎంతో ఇబ్బందులకు గురి చేశారు.

“ప్రస్తుతం జనసేన వారాహి యాత్ర ద్వారా మీలో అంతర్లీనంగా ఉన్నటు వంటి ఎన్నో విషయాలు ప్రపంచానికి మీరే స్వయంగా చాటి చెప్పి అన్ని వర్గాల ప్రజల్లోని మీ నీతి, నిజాయితీల్లోను అనుమానించి మీలో ఇటువంటి చౌకబారు సహాయాల్లో కూడా అందరి వద్ద చేతులు చాచుతారని మేము ఎప్పుడు ఊహించలేదు“ అన్నారు కాపునాడు నాయకులు.

Tags:    

Similar News