నాడు స్నేహితులు... నేడు కూటమి ప్రభుత్వంలో కీలకులు
ఒకప్పుడు వీరు మంచి స్నేహితులు. ఇప్పటి వరకు వేరువేరు పార్టీల్లో ఉన్నారు. 35 ఏళ్ల తరువాత వారంతా కూటమి ప్రభుత్వ పార్టీల్లో కనిపించారు. ఎవరు వారు? ఏమిటా కథ.
చరిత్రలో ఎన్నో జీవిత పాఠాలు గుర్తుకొస్తాయి. 35 ఏళ్ల క్రితం మంచి స్నేహితులు. అప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఉన్న వారే. తరువాత రాజకీయంగా దారులు వేరయ్యాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ నలుగురు కనిపించారు. యాదృచ్చికమే అయినా చూసే వారికి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. వీరిది ఒంగోలు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీకల పాత్ర పోషించారు. ఒకరు జనసేన, ఇద్దరు టీడీపీ, ఒకరు బీజేపీలో ఉన్నారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవలే జనసేన పార్టీలో చేరారు. ఈయన స్వర్గీయ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడు. ఆ తరువాత జగన్ తో పాటు నడిచారు. జగన్ రాజకీయాలు నచ్చక పవన్ కళ్యాణ్ పంచన చేరారు. రెండో వారు అయినాబత్తిన ఘనశ్యాం. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి అనుచరునిగా ఉంటూ వస్తున్నారు. మాగుంట పార్టీ మారినప్పుడల్లా ఆయన పార్టీ మారుతున్నారు. కాంగ్రెపార్టీలో జిల్లా నాయకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో మాగుంట అనుచరునిగా ఉన్నారు. మూడో వ్యక్తి మంత్రి శ్రీనివాసరావు. ఈయన ఒంగోలు మునిసిపల్ చైర్మన్ గా పనిచేసి పలువురి మెప్పును పొందారు. కాంగ్రెస్ రాజకీయాల్లో మంచి నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పాలన సాగించిన వారిలో మంత్రి శ్రీనివాస్ ఒకరని ఈ నాటికీ ఒంగోలు పట్టణ ప్రజలు గొప్పగా చెబుతారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ తో కలిసి ముందుకు సాగుతున్నారు. రాజకీయంగా జనార్థన్ కంటే అనుభవం ఉన్న వ్యక్తి. ముక్కు సూటిగా వెళ్లే వారు ఎక్కడా రాణించలేరు. ఎందుకంటే ఎదిటి వారికి వారి వ్యవహారం నచ్చదు. ఇప్పుడు కావాల్సింది లౌకికం. నాలుగో వ్యక్తి ఈదర మోహన్. మొదట బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరునిగా ఉన్నారు. ఆ తరువాత ప్రకాశం జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా పనిచేసి పలువురి అభినందనలు అందుకున్నారు. ఈయన ప్రస్తుతం బిజెపిలో ఉన్నారు. బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పుంరదేశ్వరి అనుచరునిగా ఉంటూ వస్తున్నారు.
ఈ నలుగురు ఒంగోలు నగరంలో ఒకప్పుడు మంచి స్నేహితులు. ఒకే పార్టీలో ఉండటమే కాకుండా ఎవరికి ఎటువంటి సాయం అందించాలన్నా వెంటనే స్పందించే వారు. నేటికీ వారిలో మానవత్వం ఉందని చెప్పొచ్చు. అందరూ 50 సంవత్సరాలు పైబడిన వారే. వ్యాపారాల్లో సెటిల్ అయ్యారు. రాజకీయాలు ప్రవృత్తిగా మార్చుకున్నారు. అయినా అప్పుడప్పుడు కలిస్తే సరదాగా మాట్లాడుకోవడం, గతాన్ని గుర్తకు తెచ్చుకోవడం చేస్తుంటారు. బతుకు చిత్రం విచిత్రంగా ఉంటుంది. ఎవరు ఎక్కడ ఎలా మారుతారో చెప్పలేము. జీవన ప్రయాణంలో వారి జీవితాన్ని మార్చే ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. అప్పుడు వారిలో అనుకోకుండా ఆ మార్పును స్వాగతిస్తారు. జీవితమంటే ఇలాగే ఉంటుందని పలువురు వ్యాఖ్యానించడం విశేషం.