ప్రధాని సభలో జాతీయ జెండాల రెపరెపలు
కూటమి పార్టీల నాయకత్వంలో అమరావతి సభ జరిగింది. సభలో పార్టీల జెండా ఒక్కటి కూడా కనిపించలేదు.;
పహల్గాం దాడి నేపథ్యం మానవతను చూపడంతో పాటు ఐక్యతను తెలిపింది. శుక్రవారం అమరావతిలో జరిగిన అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభలో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. పాలకులు పార్టీల జెండాలు పక్కన పెట్టించి జాతీయతకు ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణంగా ఇటువంటి సభల్లో ఏ పార్టీకి చెందిన వారు ఆ పార్టీ జెండాలు పట్టుకుని వస్తారు. కానీ అలా జరగలేదు. కేవలం జాతీయ జెండాలు మాత్రమే పట్టుకున్నారు. వచ్చిన వీఐపీలు అందరూ జాతీయ జెండాను చేత పట్టుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాలు చేతులతో ఊపుతూ కనిపించారు.
జనం ఇండ్ల నుంచి బయలు దేరేటప్పుడు వాహనాలకు మాత్రం పార్టీ జెండాలు కట్టారు. వాహనాల్లో వారు ఎక్కిన తరువాత అధికారులు, ప్రజా ప్రతినిధులు వారికి జాతీయ జెండాలు ఇచ్చారు. దీంతో సభకు వచ్చిన ప్రజలంతా జాతీయ జెండాలు పట్టుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా జాతీయ సమైక్యత అమరావతి సభలో కనిపించింది. మోదీ వేదికపైకి రాగానే ప్రతి ఒక్కరి చేతిలోని జాతీయ పతాకం రెపరెప లాడింది. పతాకాన్ని ఊపుతూ మోదీని సభకు వచ్చిన వారంతా పలకరించారంటే అతిశయోక్తి కాదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు తమ ప్రసంగాల్లో పాకిస్తాన్ తీరును దుయ్యబట్టారు. మోదీ సమర్థవంతంగా ఎదుర్కుంటారని, ప్రపంచ దేశాలు మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నాయని మాట్లాడుతుంటే సభలోని జనం జాతీయ పతాకాలను ఊపుతూ కనిపించారు. ఆంధ్రప్రదేశ్ మీకు అండగా ఉంటుందని, ఉగ్ర వాదం తుదముట్టించే వరకు పోరాడతామనే సందేశం ముగ్గరు నేతలు ప్రధానికి ఇచ్చారు. ముఖ్యమంత్రి మాట్లాడే సమయంలో ప్రధాన మంత్రిని ఢిల్లీలో కలిసినప్పుడు ఆయన ముఖంలో కనిపించిన బాధ నేను ఎప్పుడూ చూడలేదనటం కూడా గమనార్హం.