NAXAL CHALAPATI | ప్రతాప్.. 'మామడితోటలు అడుగుతున్నాయి..ఎప్పుడొస్తావని'
మత్యం గ్రామం గుంభనంగా ఉంది. శ్మశానవైరాగ్యం రాజ్యమేలుతోంది. మాట్లాడేందుకు జంకుతోంది. చలపతి కుటుంబం తల్లడిల్లుతోంది.;
మావోయిస్టు అగ్రనేత ఛత్తీస్ ఘడ్ ఒడిశా అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో రామచంద్రారెడ్డిగారి ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి ప్రాణాలు కోల్పోయారు. ఈయనది చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మత్యం పైపల్లె. ఈయన పెద్దన్న శ్రీరాములు రెడ్డి చనిపోయారు. రెండు అన్న చంద్రశేఖరరెడ్డి మదనపల్లెలో నివాసం ఉంటారు. మూడో వ్యక్తి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి.
ఈయన మరణించారనే విషయం మాధ్యమాల్లో ప్రసారం అయ్యాయి. దీంతో ఒక్కసారిగా పైపల్లె గ్రామం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది.
పచ్చదనంతో ఆహ్లాదంగా ఉన్న పైపల్లెలో సాాధారణ రోజులకు భిన్నంగా జనసంచారం కనిపించలేదు. ఈ విషయాన్ని ఆ ప్రాంత మీడియా ప్రతినిధులు కూాడా చెప్పారు. ఇళ్ల నుంచి బయటికి వచ్చిన వారు తక్కువ. కనిపించిన వారిని ఏమి అడిగినా మీకు తెలియదు అనేదే సమాధానం. అలా సాగుతూనే చలపతి రెడ్డి ఇంటికి వద్దకు వెళ్లే సరికి చలపతిరెడ్డి పెద్దన్న శ్రీరాములురెడ్డి భార్య కుమారికి వయసుమీద పడడంతో నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించారు.
ప్రతాపరెడ్డి మరణం ఎలా తెలిసిందని అడిగితే.. నిన్న టీవీల్లో చూశాం. పేపర్లలో వచ్చిన కథనాలు చూశాం. అనేది కుమారి మాట. 35 ఏళ్ల కిందట వెళ్లిపోయాడు. విజయనగరంలో ఉద్యోగం చేసేటప్పుడు ఒకసారి వచ్చాడు. మళ్లీ రాలేదు. ఫోన్ చేసినప్పుడు ప్రతాపా... మామిడికాయలు కోతుకు వచ్చాయి. రాబ్బా.. అని పిలిచా. కాపు అంతా అయినాక చెబుతాండావు అక్కా ఇంకోసారి వస్తాలే అన్నాడు. అని కుమారి కొన్నేళ్ళ నాటి మాటను గుర్తు చేసుకుంటుండగా, కళ్ల నుంచి నీటి చుక్కలు జలజలా రాలాయి.
"మమ్మలందరినీ కాదనుకునే వెళ్లిపోయాడు. ఇక ఆయన శవం తీసుకుని వచ్చి చేసేది ఏముంది?" అనేది చలపతి వదిన కుమారి, ఈమె కుమారుడు ఉదయకుమార్ రెడ్డి చెబుతున్నారు. లేని అయిష్టాన్ని వ్యక్తం చేస్తున్నట్లే వారి మాటల్లో కనిపించింది.
ప్రతాపరెడ్డి అసియాస్ చలపతి మరణవార్త మీడియా ద్వారా దావానలంలా వ్యాపించడంతో మదనపల్లె డివిజన్ పడమటి ప్రాంతంలో చర్చ జరుగుతోంది. చలపతి స్వగ్రామం మత్యం, పైపల్లె ప్రజలు గుంభనంగా ఉన్నారు. అన్నీ తెలిసినా ఏమి తెలియనట్లే ఎవరి పనుల్లో వారు కనిపించారు. చలపతి మరణ వార్తతో గ్రామంలోకి కొత్తవారిని రాకుండా కట్టడి చేయాలని మొదట నిర్ణయించుకున్నట్లు అక్కడి మీడియా ప్రతినిధులు చెప్పిన మాట. ఆ తరువాత ఏమనుకున్నారో? ఏమో? మౌనంగా మిగిలి పోయిన ఆ పల్లె జనం ఈ విషయాలపై నోరు మెదపడం లేదు. కాగా, ప్రతాప్ (చలపతి) గతంలో మాదిరి మళ్లీ తప్పించుకుని ఉండవచ్చు. అనే భావనలోనే ఆయన కుటుంబీకులు ఉన్నారు.