NDA V/S CPM | పి-4 పెట్టుబడుదారులపై భ్రమలు కల్పించేందుకే..

ఈ పథకం వల్ల ప్రయోజనం ఉంటుందా? ఉన్నోళ్ల దయతో పేదరికం పోతుందా? సీపీఎంప్రశ్నలు సంధించింది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-03-31 06:13 GMT

రాష్ట్రంలో సంపన్నుల దయతో 30 లక్షల కుటుంబాలకు పేదరికం నుంచి విముక్తి కల్పిస్తామని సీఎం ఎన్. చంద్రబాబు ఉగాది రోజున ఘనంగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్ నర్ షిప్ (పి4)ను ప్రకటించి ఈ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. ప్రపంచంలో ఈ పథకం ఎక్కడా లేదని తాను శోధించి, పలుమార్లు నిద్రలేని రాత్రులు గడిపి ఆలోచించి ఈ పథకానికి రూపకల్పన చేశానని ప్రకటించారు.

ఈ పథకంతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలు, కార్యక్రమం వెనుక అంతర్లీనంగా మతలబు ఉందని సీపీఎం సందేహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర నేత కందారపు మురళీ అనేక ధర్మసందేహాలను వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులపై భ్రమలు కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా ఉందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. సీపీఎం నుంచి సుదీర్ఘ ప్రకటన కందారపు మురళీ విడుదల చేశారు.
ఆయన ఏమంటున్నారంటే..
"పదివేల మంది బంగారు కుటుంబాల(పేదలు)వారు, 600 మంది మార్గదర్శకులు (సంపన్నులు)తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఎం ప్రకటించారు. మచ్చుకు ఓ రెండు కుటుంబాలను ఎంపిక చేసుకుని, వారి సమస్యలను ప్రస్తావిస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపడానికి 600 మంది మార్గదర్శకులలో ముగ్గురు పారిశ్రామికవేత్తలతో ఆ వేదికపై సీఎం మాట్లాడించారు" అని సీపీఎం నేత కందారపు మురళీ గుర్తు చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటల్లో చెప్పాలంటే రాష్ట్రానికి చంద్రబాబు లాంటి విజనరీ లేకుంటే రాష్ట్రం ఏమైపోయేదో, పి4 లాంటి కార్యక్రమాలు వచ్చుంటాయా? అని ప్రజలకు ప్రశ్నలు వేశారు. ఇంతవరకు బాగానే ఉంది. వినటానికి చూడటానికి కార్యక్రమం చాలా గొప్పగా రూపొందించారు.
పేదల దయనీయ పరిస్థితి
వేదిక మీద పిలిపించుకొని మాట్లాడిన గొర్రెల కాపరి నరసింహ స్వామి, బిల్డింగ్ కార్మికుడు ఇస్మాయిల్ పలు ప్రశ్నలను లేవనెత్తారు.
"తమ కుటుంబమంతా కష్టపడినా కడుపునిండా కూడు తినలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితికి కారణమేంటని నరసింహస్వామి ప్రశ్నిస్తే కుటుంబం గడవడానికి ఆడబిడ్డను చదివించడానికి ఇస్మాయిల్ ఆయన కుమారుడు ప్రకాష్ భార్య మొత్తం కుటుంబం కష్టపడుతున్నా చాలీచాలని పరిస్థితులు, బిడ్డకు ఫీజులు కట్టలేని దయనీయమైన పరిస్థితికి కారణం ఏమిటో తెలియడం లేదు" అని వాపోయారు.
సమాధానం లేని ప్రశ్నలు
గొర్రెల కాపరి నరసింహ స్వామి, బిల్డింగ్ కార్మికుడు ఇస్మాయిల్ పేదరికానికి ప్రభుత్వ బాధ్యత లేదా? అని సీపీఎం నేత మురళి ప్రశ్న.
జగన్మోహన్ రెడ్డి హయాంలో బిల్డింగ్ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉండేదని ఇప్పుడు తమతో సమానంగా బిల్డింగ్ కార్మికున్ని కూర్చో పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ గొప్పగా ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి హయాంకి ఇప్పటికీ బిల్డింగ్ కార్మికుల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? అన్నదానికి సమాధానం లేదు.
ఇస్మాయిల్ భార్య, నరసింహస్వామి భార్య ఇరువురు ఇంటి పనులతో పాటు, పూలు కడుతున్నారు. సీఎం చంద్రబాబు వేదిక మీదకి పిలిచి మాట్లాడించుకున్న పేద కుటుంబాల్లోని సభ్యులు అందరూ కష్టపడుతున్నారు. అయినా జీవించటానికి తంటాలు పడుతున్నారన్న విషయం వారి మాటల్లోనే వ్యక్తమైంది. రాష్ట్రంలో ఈ పరిస్థితికి కారకులు ఎవరు? రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు సంపన్నుడికైనా, సామాన్యుడికైనా ఒకటే. కొనుగోలు శక్తి లేని వారి కష్టం గురించి వారి మాటల్లో అర్థమయింది.
పెట్టుబడిదారుల కోసమే..
దీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపన్నులకు, పేదలకు కూర్చోబెట్టి సుద్ధులు చెబుతున్నారు. ప్రపంచం మొత్తం శోధించి ఎక్కడా లేని విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టానని సీఎం చంద్రబాబు ఘనంగా ప్రకటించారు.
చంద్రబాబు చెబుతున్నట్టు ఇదేదో కొత్త పథకం కాదు. పెట్టుబడిదారీ విధానం సంక్షోభంలోకి వచ్చిన ప్రతిసారి పెట్టుబడుదారులపై భ్రమలు కల్పించేందుకు పాలకులు ఆడుతున్న డ్రామాలు ఇవి.
రాష్ట్రంలో పేదరికంలో ఉన్న 30 లక్షల కుటుంబాల బాధ్యత సంపన్నులకు కట్టబెడుతున్నామని ప్రకటించి ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి వైదొలిగింది.
సంపన్నుల దయాదాక్షిణ్యాలతో ఏ దేశంలోనైనా పేదరికం తొలగిందన్న ఉదాహరణ ఉందా? సంపద కూడబెట్టుకున్న వారిలో పరివర్తన ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చనే చంద్రబాబు సిద్ధాంతాన్ని గతంలో అనేకమంది వివిధ దేశాల్లో చెప్పి ఆచరణలో అది అమలు కాదని గ్రహించారు.
వారంతా ఆదర్శ పురుషులా..?
సీఎం చంద్రబాబు అంబేద్కర్, వివేకానందుడు, అబ్దుల్ కలాం, ఎన్టీ రామారావులను ప్రస్తావిస్తూ, వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు అంతవరకు బాగానే ఉంది.
ఆ తరువాత మెగా కృష్ణారెడ్డి, చలమల శెట్టి అనిల్ కుమార్, లోక్ సభ సభ్యులలోనే అత్యంత సంపన్నుడైన పెమ్మసాని చంద్రశేఖర్, పవన్ కళ్యాణ్, తనను కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పుకుని రావడ సమంజసమా? అనేది సీపీఎం నేత సూటిప్రశ్న.
మెగా కృష్ణారెడ్డి వ్యాపార రంగంలో ఎలా బలపడ్డారు??? అనే దానిపై అనేక వివాదాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి, మెషీన్ భగీరథ కాంట్రాక్ట్ లో పైపులు కుంభకోణం, వందల, వేల అపార్ట్ మెంట్ ల నిర్మాణంలో, ఆయనకు ఉన్న ప్రైవేటు విమానాలు రాజకీయ నేతలకు ఉపయోగపడుతున్న తీరు, కిర్లోస్కర్ కంపెనీకి సబ్ కాంట్రాక్టర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కృష్ణారెడ్డి అదే కిర్లోస్కర్ కంపెనీ ఆయనకు సబ్ కాంట్రాక్టర్ గా మారిన తీరు, మెడికల్ విద్యార్థుల నుంచి అడ్మిషన్ల పేరిట వసూళ్లు తదితర అనేక వివాదాల్లో కూరుకుపోయి ఉన్నారు.
ఇక చలమల శెట్టి అనిల్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో ఈ రేస్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. ఆయన స్థాపించిన గ్రీన్ కో ఎనర్జీ సంస్థ పలు వివాదాల్లో కూరుకుపోయి ఉన్నది. కృష్ణాజిల్లా మచిలీపట్నం కు చెందిన ఈ అనిల్ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదమైన కార్పొరేట్ వ్యక్తి. అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారు. ఈ ఇరువురు పారిశ్రామిక వేత్తలు అధికారంలో ఏ పార్టీ ఉన్నా తమ పనులను జరిపించుకోవడంలో ఘనులు.
ఇలాంటి ఘనమైన పేరున్న వివాదాస్పదమైన వ్యక్తులను సీఎం, డిప్యూటీ సీఎం తమతో సమానంగా వేదికపై ఆసీనులను కావించటం వారి ద్వారా పేదరికం రాష్ట్రంలో నిర్మూలిస్తామని ప్రగల్బాలు పలకడం.. ఏ మేరకు సమంజసమో పై ఇరువురునేతలు సమాధానం చెప్పాలి.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి 600 మంది మార్గదర్శకులలో వివాదం లేని వ్యక్తులను వేదిక మీదకు పిలిపించుకోవటానికి జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. ఆ జాగ్రత్త తీసుకోకపోగా వీరినే ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని ప్రకటించటం. రాజకీయ నాయకులకు కార్పొరేట్ కున్న బంధాన్ని మరోమారు వెల్లడి చేసింది. అని మురళీ విశ్లేషించారు.

Similar News