లౌకిక భావాలతో దేశానికి బలమైన పునాదులు వేసిన నెహ్రూ
భారత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధికి జవహర్‌లాల్ నెహ్రూ హయాంలోనే పునాదులు పడ్డాయి. ఆయన కొనసాగించిన స్పూర్తి నేటి తరానికి అవసరం.;
భారతదేశంలో ప్రధమ ప్రధానిగా 17 సంవత్సరాలు కొనసాగి, భారీ పరిశ్రమలు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించి శాస్త్రీయ దృక్పదంతో, లౌకిక భావాలతో భారత దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేసిన స్ఫూర్తి ప్రధాత జవహర్ లాల్ నెహ్రూ అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మీడియా కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. నేడు గుంటూరులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో భారత నిర్మాణ సారథి నెహ్రూజీ అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, 9 సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని అనుభవించారని, రాజ్యాంగ పరిషత్‌లో మూడు కమిటీలకు నాయకత్వం వహించి భారత రాజ్యాంగ రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. భారత ప్రధానిగా ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసి వయో జనులందరికి ఓటు హక్కు కల్పించారని వివరించారు. అమెరికాలో మహిళలకు ఓటు హక్కు అమెరికా స్వాతంత్య్రం పొందిన 150 సంవత్సరాల తర్వాత లభించిందని, ఇంగ్లాండ్ లో 700 సంవత్సరాల తర్వాత లభించిందని, అలాంటిది భారతదేశంలో స్త్రీ, పురుషులకు ఒకేసారి ఓటు హక్కు అందించడం జవహర్ లాల్ నెహ్రూ సమ దృష్టికి నిదర్శనమన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో కలిసి 585 సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమగ్రతను, ఐక్యతను కాపాడారన్నారు. ఐఐటి, ఐఐఎం, ఐఐయస్, ఇస్రో లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను స్థాపించి సైన్స్ అండ్ టెక్నాలజీకి పునాదులు వేశారన్నారు.