విశాఖ సీటు కోసం బిజెపి, టిడిపి ఢీ

చేతులు కలిపి ఉమ్మడి ప్రచారం చేయాల్సిన పార్టీల అభ్యర్థులు సీటు తమదేనంటూ ప్రచార వాహనాలు, ఫ్లెక్సీలతో హడావుడి సృష్టిస్తున్నారు. ఇంతకు సీటు దక్కించుకునేది ఎవరు..?

Update: 2024-03-15 11:11 GMT

(తంగేటి నానాజీ)


 విశాఖపట్నం: విశాఖ సీటు కోసం  బీజేపీ, టీడీపీ మధ్య పోటీ జోరుగా నడుస్తూ ఉంది.  ఈ సీటు ఏ పార్టీదో కూడా ఇంకా తేల లేదు.  కూటమి నుంచి ఈ ప్రకటన  వచ్చాక అభ్యర్థి ఎవరో తెలుస్తుంది. అయినా  సరే  ఎవరికి వారే తానే అభ్యర్థి అంటూ ప్రచారం సాగించేస్తున్నారు బిజెపి, టిడిపి ఆశావహులు. విశాఖ ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్న బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక తానే  టీడీపీ అభ్యర్థిగా మోతుకుమిల్లి  శ్రీ  భరత్  మధ్య ప్రచార యుద్ధం జరుగుతుంది. ఫ్లెక్సీలతో జీవీఎల్,  ప్రచార రథంతో భరత్ ఇద్దరు సీటు తమదంటే తమదని విశాఖ కార్యకర్తల్లో గందరగోళం రేపుతున్నారు.


అభ్యర్థిని ఖరారు చేయని కూటమి...


విశాఖ పార్లమెంటు స్థానం అభ్యర్థిని టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఇంకా ఖరారు చేయలేదు. అయినప్పటికీ అధిష్టానం నుంచి తనకు స్పష్టమైన హామీ ఉందంటూ టీడీపీ అభ్యర్థి శ్రీ భరత్ ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం సాగించేస్తున్నారు. ఇదే కోవలో విశాఖ పార్లమెంటు సీటుపై ఆశలు పెంచుకున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ కూటమి నుంచి తనకే సీటు దక్కుతుందని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో జీవీఎల్‌ నగరంలోని ప్రధాన రోడ్లపై వెలసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా నిన్న బ్రాహ్మణ సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసి జీవీఎల్ నరసింహంకే విశాఖ పార్లమెంట్ సీటు కేటాయించాలని డిమాండ్ చేశాయి. సీటు కోసం ఇరువురి మధ్య జరుగుతున్న వార్ పార్టీ పెద్దలకు తలనొప్పిగా తయారైంది.




 

విశాఖ సీటు టీడీపీకే....


విశాఖ పార్లమెంటు సీటు టీడీపీకే దక్కుతుందని ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. విశాఖ ఉక్కు సమస్య, స్పెషల్‌ స్టేటస్‌, పోలవరం, రైల్వే జోన్‌ విషయంలో బీజేపీపై విశాఖలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందువల్ల ఈ సీటును బీజేపీ అడిగినా టీడీపీ మాత్రం ససేమిరా అంటూ వచ్చింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఈ సీటును ఆశించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ కూడా తాను అధిష్టానాన్ని సీటు అడిగానని, అయితే పార్టీ పెద్దలదే తుది నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు. అటు టీడీపీ అభ్యర్థి భరత్ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చాకే ప్రచారం సాగిస్తున్నానంటూ చెబుతున్నారు. ఇంతకీ విశాఖ పార్లమెంటు సీటు ఎవరికి దక్కుతుందా అన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది.


ఫ్లెక్సీల కలకలం...


విశాఖ సిటీలో వెలసిన జీవీఎల్‌ ఫెక్సీలు కలకలం రేపుతున్నాయి. ‘మీ వెంటే ఉంటా.. మీ బంగారు భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తా’ అంటూ పలుచోట్ల జీవీఎల్‌ ఫ్లెక్సీలు కనిపించాయి. ‘ఉత్తరాంధ్ర వెనుకబడిన కులాల అభ్యున్నతికి పాటుపడుతున్న జీవీఎల్‌ నరసింహారావు నాయకత్వం విశాఖకు చాలా అవసరం’ అంటూ అభిమానుల పేర్లతో పెట్టిన ఫ్లెక్సీల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. ఏది ఏమైనా విశాఖ పార్లమెంటు స్థానానికి కూటమి తరఫున అభ్యర్థి ప్రకటన జరిగినంత వరకు ఈ గందరగోళం తప్పదని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు.



Tags:    

Similar News