ఏపీలో కొత్త ప్రాంతీయ పార్టీ రాబోతుందా!

ఆంధ్ర రాజకీయాల్లో చర్చకు తెరలేపిన వివి లక్ష్మీనారాయణ ఎలియాస్‌ జేడీ

Update: 2023-12-01 11:38 GMT
V V Lakshminarayana alias JD Lakshminarayana


జేడీ లక్ష్మీనారాయణ ఎలియాస్‌ వివి లక్ష్మీనారాయణ  పేరు తెలియని తెలుగు వాళ్లుండరు. నిజాయితీకి, ధైర్యానికి ఆయన పేరును పర్యాయపదం గా తెలుగు ప్రజలు చెబుతారు. ఆయన పేరు వివి లక్ష్మినారాయణ , అయితే, జెడి లక్ష్మీ నారాయణ అంటారు. జెడి అంటే జాయింట్ డైరెక్టర్. అదేమి ఇంటిపేరు అనే అనుమానం వస్తుంది. దానికి వెనక ఒక కథ ఉంది. 
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద 2010లో  ఆక్రమ అస్తుల ఆర్జన   ఆరోపణలు వచ్చాయి. వాటిమీద విచారణ జరపాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ కేసు మీద విచారించేందుకు అపుడు సిబిఐ, జాయింట్ డైరెక్టర్ గా  వివి లక్ష్మినారాయణ ను నియమించి హైదరాబాద్ కు పంపిచింది. ఈ ఆరోపణలమీద దర్యాప్తు చేసి, జగన్ ను   అరెస్టు చేసిన తీరు అందరికి నచ్చింది. అప్పటినుంచి ఆయన జెడి లక్ష్మీనారాయణ అయ్యారు.  ఆయన సిబిఐ జెడిగా రావడం  మంచికో చెడుకో తెలుగు రాజకీయాలను మార్చేసింది. నిజానికి ఆయన స్ఫూర్తితో చాలా మంది ఐపిఎస్ కోసం సివిల్స్ పరీక్షలు కూడా రాశారట.
ఆయన మహారాష్ట్ర క్యాడర్ ఐపిఎస్ అధికారి. సిబిఐ డెప్యుటేషన్ పూర్తి చేసుకుని  తిరిగి మహారాష్ట్ర వెళ్లినా ,  లక్ష్మీనారాయణ ముంబైలో ఎం సంచనాలను సృష్టిస్తున్నారోనని తెలుగు ప్రజలు  గమనిస్తూ వచ్చారు. ఆయన ఐపిఎస్ కు రాజీనామా చేయగానే, ఆంధ్రా వచ్చి రాజకీయాల్లోకి వస్తారని అంతా వూహించారు. వూహించిందే నిజమయింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఇది ఆశించిన రీతిలో సంచలనం సృష్టించలేదు.  అయితే, ఇపుడాయన రాజకీయ సంచలనం సృష్టించేందుకు మరొక ప్రయత్నం చేస్తున్నారు. అదే ఆయన కొత్త రాజకీయపార్టీ పెట్టాలనుకోవడం.
ఇంకా సీబీఐ మాజీ జేడీగానే గుర్తున్న లక్ష్మీనారాయణ  ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టబోతున్నట్లు స్వయంగా ప్రకటించదారు. ఇటీవల విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. అయితే పార్టీ పేరు కానీ, విధి విధానాలు కానీ ప్రకటించలేదు.
ఆయన చాలా కాలం రాజకీయ ప్రవేశం మీద వూగిసలాడాకా, మొత్తానికి గత ఎన్నికల ముందు ఆయన నిర్ణయం తీసుకున్నారు.
జనసేన పార్టీ తరపున విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఓడిపోయారు. 2019  లోక్ సభ ఎన్నికల్లో ఆయన జనసేన అభ్యర్థిగా పోటీ చేసి రెండు లక్షల తొంభై వోట్ల తో మూడో స్థానంలో నిలబడ్డారు. అపుడు విశాఖ నుంచి వైసిపి అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ  గెలుపొందారు. అయితే, ఆయన  జనసేన లో క్రియాశీలంగా కొనసాగ లేకపోయారు. జాతీయ భావాలను, పర్యావరణాన్ని, మేలు వ్యవసాయాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. ఆయనకు మంచి భావాలు బాగున్నాయి.
 ఎన్నికల్లో గెలిచేందుకు మంచితనం, మంచి భావాలు మాత్రమే చాలవు.  రాజకీయీలను ఆయన అంచనా వేసుకున్నట్లు లేవు. జగన్‌ను విచారించినంత మాత్రాన జనం ఓట్లు వేసి గెలిపిస్తారా? వేయలేదు.  ఆయన వోడిపోయారు. ఆయన టికెట్ ఇచ్చిన పార్టీ జనసేన , దాని అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా ఓటమి పాలయ్యారు. మంచి ఉద్దేశ్యంతో ప్రజా సేవకోసం వచ్చారనడంలో సందేహం లేదు. అయితే, జనం అదొక్కటే చాలదు అనుకున్నారేమో!
కొత్త పార్టీ వెనుక ఉద్దేశ్యం ఏమిటి?
జేడీఎల్‌ కొత్త పార్టీ ప్రకటన వెనుక ఉద్దేశ్యం ఏమిటనేది అంతుచిక్కడం లేదు. 2019 విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసిన వివి లక్ష్మీనారాయణకు (జెడీ) 2,88,874 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన ముతుకుమిల్లి భరత్‌కు 4,32,492 ఓట్లు వచ్చాయి. అలాగే వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చే సిన ఎంవీవీ సత్యనారాయణకు 4,36,906 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి పురందేశ్వరికి 33,892 ఓట్లు వచ్చాయి. జేడీ పోటీ చేయడం వల్లే వైఎస్‌ఆర్‌సీపీ గెలిచిందని లేకుటే టీడీపీ గెలిచేదని అప్పట్లో రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు. ఇపుడు ఆయన మరొక ప్రయోగం చేయాలనుకుంటున్నారు.
జేడీకి కాపుల బలం ఉంది
జేడీ లక్ష్మీనారాయణకు కాపు/ బలిజ కులానికి చెందిన వ్యక్తి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కుల రాజకీయాల్లో కులం తప్పక నింపాల్సిన కాలం లాంటిది.  కాపులు పెద్ద సామాజిక వర్గం.  రాజకీయంగా ఎదగలేని నిస్పృహతో ఉన్న ఉన్నత వ్యవసాయ కులం. తెలుగురాష్ట్రాల్లో వ్యవసాయకుల్లాల్లో మూడు కులాలు రాజకీయాల్లో విజయవంతమయ్యారు. రెడ్లు  ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. కమ్మలు ముఖ్యమంత్రి పదవి గెల్చుకున్నారు. తెలంగాణలో వెలమల ముఖ్యమంత్రులు వచ్చారు. అయితే, కాపుల నుంచి ముఖ్యమంత్రి ఇంకా రాలేదు. అందువల్ల కాపుల్లో ముఖ్యమంత్రి పదవి ఒక తీరని ఆకాంక్షగా ఉంది. ఈ కలని నెరవేర్చుకునేందుకు కాపులు అనేక ప్రయత్నాలు చేశారు. ఇతర పార్టీలలో ఉంటూ రెడ్లు, కమ్మలతో పోటీ పడ్డారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక ముఖ్యమంత్రి గా ప్రచారమయిన పేర్లలో కాపునేత కన్నా లక్ష్మీనారాయణ పేరు వినిపించింది. కాంగ్రెస్  నుంచి బిజెపిలో చేరినపుడు కూడా  బిజెపి సిఎం క్యాండిడేట్ అనుకున్నారు. కొంతమంది కాపునేతలు సొంతంగా పార్టీలు పెట్టారు. ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం అనే పార్టీపెట్టి  ముఖ్యమంత్రి అయ్యేందుకు ఒక అసాధారణ ప్రయత్నం చేసి ఆపదవి అందుకోలేక, రాజకీయాల్లో ఇమడలేక మళ్లీ సినిమాల్లోకే వెళ్లిపోయారు. ఇక ఆయన తమ్ముడు పవన్ కళ్యాణో ఏదో విధంగా ముఖ్యమంత్రి కావాలని తహతహ లాడుతున్నారు. ఆయన జనసేన పార్టీ పెట్టారు. లక్ష్మీనారాయణ కూడా అందులో చేరారు. అయితే, అక్కడ ఇమడలేకపోయారు. ఇపుడు లక్ష్మీ నారాయణ  కొత్త పార్టీ అంటున్నారు.
కాపుల్లో బలం
కొంతవరకు కాపుల్లో ఆయనకు రాజకీయ బలం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో కాపుల సంఖ్య ఎక్కువ ఉన్నందున ఆ జిల్లాల వాసులను ప్రసన్నం చేసుకునే విషయంలో జేడీ ముందున్నారు. అయితే తిరిగి విశాఖపట్నం నుంచే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక పార్టీ ద్వారా పోటీ చేస్తే తన బలం రెట్టింపవుతుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కులబలం వల్ల గెలుపు సాధ్యమవుతుందని చెప్పలేము. ఇప్పటి వరకు కులాన్ని ప్రాతిపదికగా చేసుకుని వచ్చిన పార్టీలు పెద్దగా రాణించలేకపోయాయి.
జయప్రకాశ్ నారాయణకే అంతుపట్టని రాజకీయాలు
మాజీ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ సామాజిక ఉద్ధరణ కోసం చాలా ప్రయత్నాలు ప్రయత్నాలు చేశారు. లోక్‌సత్తా పేరు స్వచ్ఛంద సంస్థతో తన కార్యక్రమాలు ప్రారంభించారు. ఆయన కార్యక్రమాలకు దేశమంతా గుర్తింపు వచ్చింది. నిజానికి ఆ ఉద్యమం ప్రభావం చాలా మందిని సంస్కరణల వైపు మళ్ళించింది. ఆయన ప్రభావం యువకుల మీద, మధ్య తరగతి కుటుంబాల మీద బాగా పనిచేసింది. అందుకే అదే ఆశయాలతో లోక్ సత్తాను ఒక రాజకీయ పార్టీగా మార్చారు. జిల్లా స్థాయిలో కమిటీలు వేశారు. అక్కడక్కడా నియోజకవర్గ స్థాయిలోనూ కమిటీలు ఏర్పడ్డాయి. పార్టీ అభ్యర్థిగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి నుంచి   పోటీ చేసి ఒకసారి గెలుపొందారు. ఒకే ఒక్క ఎమ్మెల్యేగా తన గళం వినిపించగలిగారు.  అయితే ఏమైంది. పార్టీకి ఆదరణ లబించలేదు. ఆయన డీలా పడిపోయారు.  ఇప్పుడు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు మంచి ఆశయాలు ఒక్కటే చాలదని మరొక సారి రుజువయింది.
కొత్తపార్టీ ప్రభావం ఉంటుందా
ఏపీలో మరొక కొత్తపార్టీ ప్రభావం ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న . జనం మధ్య జేడీ లక్ష్మీనారాయణ పేరు చర్చకు నిత్యం వస్తూనే ఉంది. లోక్‌ సత్తా పార్టీ అనుభవం,  జనసేను అనుభవం చూశాక మరొక కొత్త పార్టీ విజయవంతం కావడం అంత సులువు కాదే మో అనిపిస్తుంది.  ఇదే అభిప్రాయాన్ని సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎస్‌కే బాబు వ్యక్తం చేశారు.   " ఆశయం బలంగా ఉన్నంత మాత్రాన రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టం. లోక్ సత్తా అనుభవం ఇదే చెపుతుంది. జనసేన ఎంత స్ట్రగుల్ పడుతూ ఉందో మనం చూస్తున్నా.  లక్ష్మీనారాయణ కొత్త  ఇలాగే ఉండొచ్చు," అని  ఆయన ఫెడరల్‌ ప్రతినిధితో అన్నారు.
ఎవరైనా పార్టీ పెట్టవచ్చు
 ప్రజల ఆదరణను బట్టి  రాజకీయ  ప్రయాణం సాగుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌ వ్యాఖ్యానించారు."ప్రజాస్వామ్యంలో బిన్న రాజకీయాభిప్రాయాలు ఉంటాయి. అాదేవిధంగా తమ భావాలతో కొత్త పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ అందరికి ఉంటుంది.వివి లక్ష్మీనారాయణకు కొత్త పార్టీ పెట్టాలనిపించింది, పెట్టుకుంటారు. ఆయన ఇష్టం. జనాదరణ లభిస్తే కొనసాగుతుంది, లేదంటే ఒక ప్రయత్నంగా మిగిలిపోతుంది," రఘురాం అన్నారు.


Tags:    

Similar News