ఆంధ్రలోనూ ఉగ్రమూలాలు..అన్ని ఇక్కడే ఉన్నాయ్‌గా..!

ఆంధ్రప్రదేశ్ కాస్తా అక్రమాల ప్రదేశ్‌గా మారిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వాస్తవమే అనిపిస్తోంది.

Update: 2024-05-21 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ కాస్తా అక్రమాల ప్రదేశ్‌గా మారిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వాస్తవమే అనిపిస్తోంది. ఎక్కడ ఏం అసాంఘిక కార్యకలాపాలు జరిగినా వాటి మూలాలు ఆంధ్రలో లభ్యమవుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఇతర రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ లభ్యమైతే వాటి మూలాలు ఆంధ్రలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కొన్నాళ్ల క్రితం ఇద్దరు పోలీసులు డ్యూటీకి సెలవు పెట్టి వేరే రాష్ట్రంలో గంజాయి సరఫరా చేయడానికి వెళ్లి పట్టుబడిన ఘటనలు కూడా ఉన్నాయి.

ఒక నెల క్రితం ఎన్నడూ లేని విధంగా విశాఖ పోర్ట్‌లో 2,500 కిలోల డ్రగ్స్ కూడా లభ్యమయ్యాయి. ఈ డ్రగ్స్ కంటైనర్‌ను పక్కా సమాచారం అందడంతో సీజ్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. దీనిపై ఇంకా దర్యాప్తు జరుగుతూనే ఉంది. వీటిని మరువక ముందే తాజాగా ఆంధ్రలో ఉగ్ర మూలాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అందుకు ఈరోజు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్‌ఐఏ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేయడమే ఇందుకు కారణం. పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యుడు అబ్దుల్ ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు చేసింది.

ఆయన కుమారుడు సోహెల్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల సోహెల్ బ్యాంక్ ఖాతాలో అధిక మొత్తంలో నగదు జమ కావడంతో అనుమానం వచ్చిన అధికారులు సోహెల్ సహా అతని కుటుంబీకులను విచారించారు. వారికి ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని విచారిస్తున్నారు. రామేశ్వరం కఫెలో జరిగిన బాంబు పేలుడు ఘటనకు వారికి సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశంపై ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.

రామేశ్వరంలో పేలుడు

రామేశ్వరం కేఫ్‌లో ఈ ఏడాది మార్చి 1న భారీ పేలుడు సంభవించింది. బిజీ బిజీగా ఉన్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి పేలుడుకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో నాలుగురు గాయపడ్డారు. ఈ ఘటన వెనక ఉగ్రవాదుల హస్తం ఉందని అనుమానించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత పటిష్టమైన నిఘా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా రామేశ్వరం పేలుడు వెనకున్న ఉగ్రవాదులకు, సాహెల్‌కు సంబంధం ఉండి ఉంటుందని, ఆ పేలుడు జరిగిన కొద్ది రోజులకే సోహెల్ బ్యాంక్ ఖాతాలో అధిక మొత్తంలో నగదు జమ అయిందని ఎన్ఐఏ వర్గాలు చెప్తున్నారు. దాని ప్రకారమే వారిని విచారిస్తున్నామని ఆ వర్గాలు తెలిపాయి. అసలు సోహెల్‌కు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? అనే ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు చెపతున్నారు.

ఆగ్రహిస్తున్న ప్రజలు

ఈ ఘటనపై స్పందిస్తున్న నెటిజన్లు అక్రమాలకు అడ్డాగా ఆంధ్ర మారుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్, గ్యాంగ్స్, గంజాయి, వ్యభిచార స్కాండల్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఆఖరికి ఉగ్రవాద మూలాలు కూడా ఆంధ్రలో ఉండటం సిగ్గుచేటుగా ఉందని, ఐదేళ్లలో ఆంధ్ర ప్రదేశ్ అధఃపాతాళానికి పడిపోయిందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రాష్ట్రంలో తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని, అసలు రాష్ట్రం ఎటు వెళుతుందని నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి యుద్దప్రాతిపదికన పరిష్కరించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News