ఇసుక లేదు... పాలసీ పనిచేయదు...

ఉచిత సుక పాలసీని తీసుకొచ్చామని, సెప్టెంబరు 11 నుంచి అమలులోకి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. ఆన్ లైన్ లో ఇసుక బుకింగ్ సక్రమంగా కావడం లేదు. క్వారీల్లో ఇసుకే లేదు.

Update: 2024-10-05 13:02 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక పాలసీ అబాసుపాలైంది. గత నెల 11 నుంచి ఉచిత ఇసుక పాలసీ అమలులోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఇసుక ఎక్కడా అందుబాటులో లేదు. వరదల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఇసుక బుకింగ్ కోసం రూపొందించిన ఏపీ శాండ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో, మద్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎవరైనా వ్యక్తిగతంగా బుకింగ్‌ చేసుకునేలా పోర్టల్‌ను రూపొందించారు. అయితే 24 గంటలూ బుకింగ్‌కు అవకాశం ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు మార్పులు చేస్తున్నారు. వాగులు, వంకల నుంచి ఇసుక తీసుకెళ్లే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు. నూతన ఇసుక పోర్టల్‌ ద్వారా ఇసుక సరఫరాపై వివిధ దశల్లో అనుక్షణం నిఘా ఉంటుందని సీఎం చెప్పారు.

అధికారులు మొదలుకొని రవాణాదారుల వరకు ఎవరూ తప్పులు చేయలేని విధంగా పోర్టల్‌ను రూపొందించినట్లు అధికారులు వివరించారు. ఉచిత ఇసుక విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్‌ఫ్రీ నంబరు 1800 599 4599కు లేదా ఈ-మెయిల్‌ dmgapsan-dcomplaints@yahoo.com ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. https://www.mines.ap.gov.in/ వెబ్‌సైట్‌లోని ఏపీ శాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (APSMS) పోర్టల్‌లో తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత జనరల్ కన్‌జ్యూమర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆధార్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. మెయిల్ ఐడీ, చిరునామా ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ ఖరారవుతుంది. ఆ తర్వాత నిర్మాణ వివరాలు నమోదు చేయాలి. పేమెంట్ పూర్తిచేశాక ఏ రోజు డెలివరీ అవుతుందో మెసేజ్ వస్తుంది.

ఇదీ ప్రభుత్వం చెబుతున్నది. ఆన్ లైన్ లో బుకింక్ చేసుకునేందుకు ఆధార్ కార్డ్ జిరాక్స్, ఫోన్ నెంబరు, వాహనం నెంబరు ఇవ్వాలి. ఇవన్నీ తీసుకుని అప్ లోడ్ చేసిన తరువాత ప్రస్తుతానికి స్టాక్ లేదు అని పోర్టల్ లో రావడం విశేషం. దీంతో భవన నిర్మాణదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కూలీలకు, బేల్తార్లకు పనులు లేకుండా పోతున్నాయి.

నిండుకున్న నిల్వలు

గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి ఒక ఇసుక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసింది. కొన్ని జిల్లాల్లో ఎక్కువ డంపింగ్ యార్డ్ లు ఉన్నాయి. నిల్వలు లేకపోవడంతో ప్రస్తుతానికి యార్డులు క్లోజ్ అయ్యాయి. దీంతో పోర్టల్ లో నో స్టాక్ అని చూపిస్తోంది. భవన నిర్మాణ కార్మికులకు ఇది గొడ్డలి పెట్టుగా మారింది. వరదలు రావడం వల్ల నదుల్లో ఇసుక తీసే అవకాశం లేకుండా పోయింది. ఎక్కువగా వేసవి కాలంలో ఇసుకను డంపింగ్ యార్డుల నుంచి తీసి నిల్వ ఉంచాలి. గతలో తీసిన ఇసుక తప్ప ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తరువాత ఇసుకను తవ్వి డంపింగ్ యార్డులకు తరలించలేదు. దీంతో నిల్వలు నిండుకున్నాయి.

ఉచితమంటూ సీనరేజీ ఏమిటి?

ఉచిత ఇసుక అంటూనే ప్రభుత్వం సీనరేజీ వసూలు చేస్తోంది. దీనికి తోడు జిఎస్టీ కూడా చెల్లించాల్సి వస్తోంది. లారీకి లోడ్ చేసేందుకు ఖర్చును కూడా చెల్లించాలి. దూరాన్ని బట్టి ఇసుక టన్ను ట్రాన్స్ పోర్టు చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. నెల్లూరు నుంచి ప్రకాశం జిల్లా మార్కాపురం ఇసుక తీసుకు వెళ్లలంటే టన్ను కనీసం రూ. 1600లు పడుతోంది. సీనరేజీ చార్జీ ప్రభుత్వం రూ. టన్నుకు రూ. 98లు వసూలు చేస్తోంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ దూరాన్ని బట్టి సీనరేజీ ఎంతనేది నిర్థారిస్తుంది. దీని ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. లారీకి 20 టన్నులకు తగ్గకుండా ఇసుకను తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించినా నదుల్లో నీరు నిండుగా ఉండటంతో ఇప్పట్లో ఇసుక తీసే అవకాశం లేకుండా పోయింది.

నేరుగా వెళ్లి ఇసుక కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు

లారీ నేరుగా క్వారీ వద్దకు వెళ్లి ఇసుక కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. చాలా మంది పట్టణాలకు ఏదో లోడ్ తోని లారీల వాళ్లు వస్తుంటారు. తిరిగి వెళ్లేటప్పుడు డౌన్ ట్రాన్స్ పోర్టు చార్జీలు మాత్రమే తీసుకుని వినియోగ దారులకు ఇస్తుంటారు. ప్రస్తుతం ప్రభుత్వ పాలసీ వల్ల అలా తీసుకు పోయేందుకు అవకాశం లేదు. ముందుగా బుక్ చేసుకుంటేనే ఇసుక తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దీంతో లారీకి అప్ అండ్ డౌన్ ట్రాన్స్ పోర్ట్ చార్జీలు ఇసుక కావాల్సిన వారు చెల్లించాల్సి వస్తోంది. క్వారీ వద్దకు లారీ వెళ్లగానే వివరాలు నోట్ చేసుకుని ఇసుక ఇవ్వాలని వినియోగ దారులు కోరుతున్నారు.

వర్షాకాలం వెళ్లే వరకు ఇసుక లేనట్లే..

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 80 స్టాక్ పాయింట్లలో మాత్రమే కొద్దో గొప్పో ఇసుక ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అది కూడా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లోనే ఇసుక ఉంది. కోస్తా జిల్లాల్లో వరదల కారణంగా నదులు పొంగి పొర్లడంతో ఇసుక ఇప్పటి వరకు ఉన్నది మాత్రమే అమ్మారు. ఇక స్టాక్ లేక నోస్టాక్ అనే ఆప్షన్ ఆన్లైన్లో జనరేట్ అవుతోందని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వం సుమారు 43 లక్షల టన్నుల ఇసుక డంపింగ్ యార్డుల్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అది కాస్త అయిపోయింది. వర్షాకాలం కావడం వల్ల నదుల్లో నుంచి ఇసుకను బయటకు తీసే అవకాశం లేదు. అందువల్ల రానున్న మూడు నెలలు ఇసుక అందుబాటులో ఉండే అవకాశం లేదని పలువురు చెబుతున్నారు.

పూర్తి స్థాయి విధి విధానాలు ఇంకా ప్రకటించలేదు

ఉచిత ఇసుకకు సంబంధించి పూర్తి స్థాయి విధి విధానాలు ఇంకా ప్రకటించలేదు. ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లలో వాగుల్లో నుంచి ఇసుకను తీసుకెళ్లే వారిని అడ్డుకోవద్దని ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ వారిని, రెవెన్యూ వారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో విధి విధానాల కోసం చాలా మంది ఎదురు చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటున్నారంటే పూర్తి స్థాయిలో విధానాలు వచ్చినట్లేనని అధికారులు చెబుతున్నారు.

విధాన లోపాలు సవరించకుండా ఇసుక ఎలా ఇస్తారు?

అప్పట్లో గోపాలకృష్ణ ద్వివేది, ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా.. ఇద్దరూ ఈసీ సీఈఓలుగా పనిచేశారు. ఇద్దరికి మైనింగ్ శాఖలు దక్కాయి. ఇద్దరు ఇసుక విషయంలో రాజకీయ పార్టీలు చెప్పినట్టే చేశారు, లేదా చేస్తున్నారు. అందుకే ఇసుక సమస్య ఎంతకీ పరిష్కారం కావడం లేదు. ఇసుక ఉచితం అన్నా జనానికి అందుబాటులోకి రావడం లేదు. విధానాల్లో లోపాలను సవరించకుండా ప్రభుత్వం ఎంత మంచి చేయాలనుకున్నా చేయలేదు.. అసంఘటిత రంగ కార్మికులకు మేలు చేయాలంటే ఇసుక విక్రయాల్లో లోపాలను సవరించి ప్రతి మండల స్థాయిలో స్టాక్ పాయింట్లు పెట్టాలి. అసలైన నిర్మాణదారులకు ఇసుకను అందించాలి. పని అవసరాన్ని బట్టి ఇసుకను లోకేషన్‌ ఆధారంగా బుక్ చేస్తే అక్కడికికే వాహనాలు చేరేలా జీపీఎస్‌ లాగ్‌ క్రియేట్ చేయాలి. ఉచిత ఇసుకను ఎవరు కోరుకోరు. ఇసుక లభ్యత, సరసమైన ధరలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని చిన్నా పెద్ద నిర్మాణ దారులు కోరుకుంటారు. మధ్యలో రాజకీయ నాయకులు, దళారుల వల్లే ఈ సమస్యలన్ని వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించాలని ఎఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాధ్ ఫెడరల్ తో అన్నారు.

Tags:    

Similar News