కాంగ్రెస్, బిజెపీల కంటే నోటాకే ఎక్కువ శాతం ఓట్లు
కాంగ్రెస్, బిజేపీలకు 2019లో తగ్గిన ఓట్లు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో నోటాకు పెరిగిన ఓట్ల శాతం.;
By : The Federal
Update: 2024-03-25 13:44 GMT
జి. విజయ కుమార్
జాతీయ పార్టీలైన బిజెపీ, కాంగ్రెస్‌తో పాటు జనసేన పార్టీలు 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు పొందడంలో చతికిల పడ్డాయి. నోటా కంటే కూడా తక్కువ ఓట్లు లభించడం సంచలనంగా మారింది. అధిక శాతం మంది ఓటర్లు నోటాకు ఓట్లేసి ఆ పార్టీలను తిరస్కరించారు. సగానికి పైగా స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు పార్లమెంట్ స్థానాల్లో కూడా ఇది స్పష్టంగా కనిపించింది. 25 పార్లమెంట్ స్థానాల్లో కలిపి నోటాకు 1.5 శాతం ఓట్లు రాగా, బిజెపీకి అంతకంటే తగ్గింది. కేవలం 0.96 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది. ఇక కాంగ్రెస్ కూడా తడబడింది. 1.29 శాతం ఓట్లు మాత్రమే రాబట్టుకోగలిగింది. అసెంబ్లీ స్థానాల్లో కూడా ఓట్లను పొందడంలో ఇదే పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలోని 175 స్థానాల్లో కలిపి నోటాకు 1.28 శాతం ఓట్లు రాగా, బిజెపికి 0.84 శాతం, కాంగ్రెస్‌కు 1.17 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆ పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డికి 28,883 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో రఘువీరారెడ్డికి మాత్రమే అధిక సంఖ్యలో ఓట్లు వచ్చాయి. 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి డిపాజిట్లు కోయిన బిజెపీ రెండు పార్లమెంట్ స్థానాల్లో కాస్తా ఓట్లు తెచ్చుకోగలిగింది. నర్సరావుపేట పార్లమెంటు స్థానం నుంచి ఆ పార్టీ తరఫున బరిలో నిలచిన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు 15,468 ఓట్లు రాగా విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి బరీలోకి దిగిన మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరికి 33,892 ఓట్లు లభించాయి.
అధికంగా ఉత్తరాంధ్రలో..
ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువుగా ఈ పరిస్థితి చోటు చేసుకుంది. అక్కడి ఓటర్లు బిజెపీ, కాంగ్రెస్ అభ్యర్థుల కంటే నోటా వైపు అధికంగా మొగ్గు చూపారు. అరకు అసెంబ్లీ నియోజక వర్గంలో బిజెపికి 3.1 శాతం, కాంగ్రెస్‌కు 1.62 శాతం ఓట్లు రాగా నోటాకు 6.46 శాతం ఓట్లు పోలయ్యాయి. పాడేరు అసెంబ్లీ నియోజక వర్గంలో జనసేనకు 4.29 శాతం, కాంగ్రెస్‌కు 3.49శాతం, బిజెపీకి 3.29 శాతం ఓట్లు రాగా నోటాకు 5.55 శాతం ఓట్లు పోలయ్యాయి. సాలూరులో జనసేనకు 2.18శాతం, బిజెపీకి 2.15శాతం, కాంగ్రెస్‌కు 1.14 శాతం ఓట్లు రాగా నోటాకు 3,21 శాతం ఓట్లు పోలయ్యాయి. కురుపాంలో బిజెపీకి 2.93శాతం, కాంగ్రెస్‌కు 1.54 శాతం ఓట్లు రాగా నోటాకు 3.17 శాతం ఓట్లు లభించాయి. చోడవరంలో బిజెపీకి 0.36శాతం, కాంగ్రెస్‌కు 0.68శాతం ఓట్లు రాగా, నోటాకు 2.88శాతం వరకు ఓట్లు పోలయ్యాయి. ఇదే ఎన్నికల్లో జనసేనకు నోటా కంటే రెండు శాతం కాస్తా అధనంగా లభించాయి. 3శాతం వరకు ఓట్లు వచ్చాయి. పాతపట్నంలో కాంగ్రెస్‌కు 1.12శాతం, బిజెపీకి 0.95శాతం ఓట్లు రాగా, నోటాకు అంత కంటే ఎక్కువుగా 2.76శాతం వరకు ఓట్లు లభించడం విశేషం. అయితే ఇక్కడ జనసేనకు నోటా కేంటే ఓట్ల శాతం పెరిగింది. 3.61శాతం వరకు లభించాయి. ఇక గజపతినగరం అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్, బిజేపీ, జనసేన కంటే అధికంగా నోటా వైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్‌కు 0.71శాతం, బిజెపీకి 0.74 శాతం, జనసేనకు 2.28 శాతం ఓట్లు రాగా నోటాకు 2.69శాతం వరకు ఓట్లు పోలయ్యాయి.
పార్లమెంట్ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి..
పార్లమెంట్ స్థానాల్లో కూడా నోటా వైపు ఓటర్లు మొగ్గు చూపారు. అరకు పార్లమెంట్ నియోజక వర్గంలో నోటాకు ఏకంగా 4.48 శాతం వరకు ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ పోటీ చేసిన జనసేనకు 3.95శాతం, బిజెపీకి 1.65శాతం, కాంగ్రెస్‌కు 1.65 శాతం మాత్రమే ఓటర్లు మద్ధతు పలికారు. అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌కు 0.82శాతం, బిజెపీకి 1.07శాతం ఓట్లు రాగా నోటాకు 2.81 శాతం వరకు ఓట్లు పోలయ్యాయి. జనసేన కాస్తా మెరుగైన ఓట్ల శాతాన్ని నమోదు చేసుకుంది. 6.6 శాతం వరకు జనసేనకు లభించాయి. విజయనగరం పార్లమెంట్ స్థానంలో బిజెపీకి 0.59, కాంగ్రెస్‌కు 1.29శాతం ఓట్లు పోలవగా, నోటాకు నోటాకు 2.42 శాతం ఓట్లు పోలయ్యాయి. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్‌కు 1.18శాతం, బిజెపీకి 0.72శాతం ఓట్లు లభించగా నోటాకు 2.19 శాతం ఓట్లు పోలయ్యాయి. విశాఖపట్నం పార్లమెంట్‌లో బిజెపీ కాస్తా పుంజుకోగా కాంగ్రెస్ మాత్రం చతికిల పడింది. కాంగ్రెస్‌కు 1.18 శాతం ఓట్లు రాగా పురందేశ్వరీ రంగంలోకి దిగడంతో బిజెపీకి ఓట్ల శాతం నోటా కంటే పెరిగింది. నోటాకు 1.34శాతం పోలవగా, బిజెపీకి 2.73 వరకు ఓట్లు లభించాయి.
కాంగ్రెస్‌పై రాష్ట్ర విభజన ప్రభావం
2014తో పాటు 2019 ఎన్నికల్లోను కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేసింది. రాష్ట్ర విభజన ప్రభావం ఓటర్లలో ఇంకా ఉంది. దీని వల్ల ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ సారి దాని నుంచి గట్టెక్కేందకు అవకాశం ఉంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రావడంతో సీన్ మారే చాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ పొత్తులతో తెరపైకి వచ్చిన బిజేపీ 2019లో మాత్రం ఒంటరిగానే బరీలోకి దిగాలని నిర్ణయించుకుంది. నాటి ముఖ్యంత్రిగా ఉన్న చంద్రబాబుతో సఖ్యత లోపించడం, బిజెపీని వ్యతిరేకించడం, కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో బిజెపీ ఒంటరిగానే బరీలోకి దిగి తన బలాన్ని నిరూపించుకోవాలని భావించింది. అయితే ఓటర్ల మద్దతు పొందడంలో చతికిల బడింది. జనసేన కూడా ఇదే పద్దతిలో నడిచింది. ప్రజల నుంచి పెద్ద ఆదరణ లభించ లేదు. దీంతో 2024 పొత్తులతో పోటీకి దిగినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.