చంద్రాబాబు నాయడి ‘ఉచిత డీఎస్సీ కోచింగ్‌’ కు ఆదిలోనే నిధుల్లేవ్

గిరిజన విద్యార్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. వేలాది మంది గిరిజన విద్యార్థులకు ఉపయోగపడే ఈ కార్యక్రమం ముందుకెళ్తుందా? సీఎం చంద్రబాబు సహకరిస్తారా?

Update: 2024-08-07 07:45 GMT

ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన విద్యార్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్‌కు నిధుల సమస్య వెంటాడుతోంది. మరో వైపు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పరిస్థితి. దీంతో ఏమి చేయాలని తలలు పట్టుకుంటున్నారు. ఏమి జరిగిందంటే.. గిరిజన విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో ఉచిత డీఎస్సీ కోచింగ్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. అయితే నిధుల విషయంలో మాత్రం ఎలాంటి హామీ ఇవ్వ లేదు. ముందుగానే నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న గిరిజన సంక్షేమ శాఖ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో ఏమి చేయాలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.

సహజంగా ఏదైనా ఒక కార్యక్రమం ప్రాంరభించే సమయంలో ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చుకు అయ్యే నిధులను ఎక్కడ నుంచి సమకూర్చుకోవాలి, కార్యక్రమాన్ని ఎలా అమలు చేయాలి వంటి అంశాల ప్రాతిపదికగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిస్తారు. అది ఫైనల్‌ అయిన తర్వాత నిధులు మంజూరు చేస్తారు. అనంతరం ఆ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. కానీ అలాంటి ప్రతిపాదనలు కానీ, యాక్షన్‌ ప్లాన్‌ కానీ ఏమీ లేకుండానే గిరిజన విద్యార్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్‌ను తమ ప్రభుత్వం ప్రతిష్మాత్మంగా తీసుకుందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాల్సిందేనని గిరిజన సంక్షేమ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో అధికారులకు నిధుల గురించి సీఎం వద్ద నోరెత్తలేని పరిస్థితి నెలకొంది.
స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడంతో తూచా తప్పకుండా దానిని పాటించడం గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు తప్పనిసరిగా మారింది. ఒక పక్క నిధుల కొరత సమస్య వేధిస్తోన్నా.. మరో పక్క తలపెట్టిన కార్యక్రమం పది మంది గిరిజన నిరుద్యోగుల జీవితాలకు వెలుగు నింపేది కావడంతో ఎలాగైనా దీనిని ముందుకు తీసుకెళ్లాలని అధికారులు నడుం బిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2వేల మంది గిరిజన విద్యార్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్‌ ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చారు. మూడు నెలల పాటు కోచింగ్‌ ఇవ్వనున్నారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేయనున్నారు. కోచింగ్‌ సమయంలో భోజనం, వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. దీనికి సుమారు రూ. 70 నుంచి రూ. 80 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఈ నిధులను ఎలా సమకూర్చుకోవాలనేది అధికారులకు చాలెంజ్‌గా మారింది.
ప్రతి ఐటీడీఏల్లో ఎంత మేరకు నిధులు ఉన్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు. పాడేరు, రంపచోడవరం, సీతంపేట, చింతూరు, కేఆర్‌పురం, శ్రీశైలం తదితర ఐటీడీఏలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. వీటితో పాటు మైదాన ప్రాంత ఐటీడీఏతో పాటు జిల్లాల్లోని గిరిజన సంక్షేమ శాఖల్లో ఎస్టాబ్లిష్‌మెంట్‌ కోసం కేటాయించిన నిధులు ఏమేరకు ఉన్నాయనే అంశంపై దృష్టి సారించారు. దీంతో పాటు మినిస్ట్రీ ఆఫ్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌(మోటా)ను కూడా సంప్రదించాలని ఆలోచనలు చేస్తున్నారు. ఇది కాకుండా మరో వినూత్న ఆలోచనలు కూడా చేయాలని భావిస్తున్నారు. కార్పొరేషన్‌ రెస్పాన్సిబులిటీ ఫండ్‌(సీఎస్‌ఆర్‌ ఫండ్‌) ద్వారా కూడా నిధుల సమీకరణకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ మేరకు రాష్ట్రంలోని ప్రముఖ సంస్థలతో కూడా చర్చలు జరపాలని చూస్తున్నారు. దీంతో పాటుగా కనెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ను కూడా సంప్రదించాలని భావిస్తున్నారు. గిరిజన విద్యార్థుల జీవితాలకు వెలుగు నింపే కార్యక్రమం కావడంతో ఎలాగైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధికమించి ముందుకు తీసుకెళ్ళాలనే సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News