అడిగింది రూ. 7600 కోట్లు.. ఏపీకి రాల్చింది రూ. వెయ్యి కోట్లు..

ఎన్డీఏలో ఏపీ కీలక భాగస్వామి. కేంద్రం మంత్రి, కేంద్ర అధికారుల బృందం వరద పరిస్థితులను చూశారు. అయినా ఏపీలో జరిగిన ఘోర విపత్తుకు కేంద్రం అందించే సాయం ఇదేనా?

Update: 2024-10-02 04:20 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర విపత్తు జరిగింది. కుటుంబాలకు కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. నేటికీ పడుకునేందుకు చోటు లేని కుటుంబాలు లెక్కల్లో చెప్పలేని పరిస్థితి. ఈ ఘోర విపత్తును ఎదుర్కొని రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందా? అంటే మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. సెప్టెంబరు నెల 1వ తేదీ నుంచి వారం రోజుల పాటు విజయవాడలోని సగం నగరం వరద నీటిలో మునిగి పోయింది. ఇంతటి ఘోరం ఇంత ముందెన్నడు జరగ లేదు. జరిగిన ఈ ఘోర విపత్తుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష సాక్షి. ఆయన వారం రోజుల పాటు నిద్రాహారాలు మాని విజయవాడలోని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఉన్నారు. అర్థ రాత్రి వరకు వరద బాధిత ప్రాంతాల్లో స్వయంగా ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు ఏర్పాటు చేసిన బోట్లపై తిరిగారు. ప్రతి ఇంటిలో ఆ కుటుంబం ఎంత వేదన చెందుతుందో, ఎన్ని కష్టాలను అనుభవిస్తుందో స్వయంగా తన కళ్లతో చూశారు. మీ కన్నీటి కష్టాలు నా కష్టాలతో సమానం. మీకు నేను ఉన్నాను. ఆదుకుంటాను. అవసరాలు తీరుస్తాను. కష్టాల నుంచి గట్టెకిస్తాను. నాది బాధ్యత. అంటూ బాధితులకు భరోసా ఇచ్చారు. విజయవాడలో నీట మునగిన ప్రతి కుటుంబానికి రూ. 25వేలు ఆర్థిక సాయం, పై అంతస్తులో ఉన్న వారికి రూ. 10 వేలు, బైక్‌లకు రూ. 3వేలు ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తులు నీట మునిగితే దాని ఖర్చులు కూడా భరిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కొంత మందికి సహాయం అందింది. మరి కొంత మందికి సహాయం ఇంకా అందలేదు. సాయం కోసం వార్డు సచివాలయాల చుట్టు ప్రతి రోజు తిరుగుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అందించిన రూ. వెయ్యి కోట్ల సాయం ఏ మూలకు.

ప్రకృతి విపత్తు సంభవించి లక్షల కుటుంబాలు నీట మునిగి విలువైన వస్తువులు పనికి రాకుండా పోయి, కనీసం పొయ్యి వెలిగించుకునేందుకు కూడా అవకాశం లేని కుటుంబాల గురించి ఎందుకు కేంద్రం ఆలోచించడం లేదు. ప్రకృతి విపత్తు అనేది ఒకరు సృష్టిస్తేనో.. మీరు నేను చెబితేనో వచ్చేది కాదు. అది సహజమైనటువంటి పరిణామం. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలన్నీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. అయినా ఒక్కో సారి చెప్పుకోలేని అనుభవాలు, దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అటువంటి సందర్భాల్లో కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో అవే ప్రజలకు బంగారంతో సమానం. వారిని ఆదుకోవడంలో విఫలమైతే అంతకంటే ఘోరమైన ప్రభుత్వ వైఫల్యం మరొకటి ఉండదు. విజయవాడలో జరిగిన ఘోర విపత్తును కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్, మరి కొందరు కేంద్ర అధికారుల బృందం కూడా వచ్చి కళ్లారా చూశారు. ఎంత నష్టం వాటిల్లోందో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జరిగిన ఘోర విపత్తును పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి రూ. 7600 కోట్లు సాహయం అందించాలని కోరితే, రూ. వెయ్యి కోట్లు కేంద్రం ఇచ్చిందంటే దీన్ని సాయం అంటారా? భిక్షమంటారా? ఒక్క సారి ఆలోచించుకుంటే.. ప్రజల కష్ట సుఖాలను కేంద్రం గమనించినట్లువుతుంది. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థించి చెబుతున్నది కాదు.
ప్రకృతి బీభత్సం సృష్టించినప్పుడు ప్రజలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు లేనప్పుడు కేంద్రం కాక మరెవరు ఆదుకుంటారు? ఒక్క సారి పెద్ద మనసుతో ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం కోరిన పూర్తి సాయాన్ని అందించి నష్టపోయిన ప్రతి కుటుంబానికి మేమున్నామనే భరోసా కల్పించి కేంద్రం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులు రెండు చేతులు జోడించి వినమ్రంగా ప్రార్థిస్తున్నారు. మరి ఈ బాధితుల ప్రార్థనలను మన్నించి ఇతోధికంగా కేంద్రం సాయం చేస్తుందో లేదో ఎదురు చూడాల్సిందే.
Tags:    

Similar News