జగన్‌తో సెల్ఫీ.. మహిళ కానిస్టేబుల్‌కు ఛార్జ్ మెమో

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అధికారం పోయినా.. అభిమానుల్లో ఆదరణ మాత్రం అలానే ఉంది. ఇప్పటికి కూడా జగన్‌ వస్తున్నారంటే అభిమానులు చేసే హడావుడీ అంతాఇంతా కాదు.

Update: 2024-09-13 07:23 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అధికారం పోయినా.. అభిమానుల్లో ఆదరణ మాత్రం అలానే ఉంది. ఇప్పటికి కూడా జగన్‌ వస్తున్నారంటే అభిమానులు చేసే హడావుడీ అంతాఇంతా కాదు. ఆయనకు కుర్రకారులోనే కాదు దాదాపు అన్ని శాఖల్లో కూడా అభిమానులు ఉన్నారు. వీటిలో పోలీసు శాఖకు ఏమీ మినహాయింపు లేదు. చాలా మంది పోలీసు వృత్తిలో ఉన్నవాళ్లు జగన్‌ను అభిమానిస్తుంటారు. అందులో తప్పు లేదు. వృత్తి వృత్తే.. వ్యక్తిగత అభిమానం.. అభిమానమే. కాగా జగన్‌ను చూసిన వెంటనే చాలా మంది అభిమానులు తాము ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నాం అన్నది కూడా మర్చపోతుంటారు. అలానే ఓ మహిళా కానిస్టేబుల్ జగన్‌ను చూసిన ఆదనందంలో తన కూతురుతో కలిసి జగన్‌తో ఓ సెల్ఫీ దిగారు. ఇప్పుడు ఆ సెల్ఫీనే ఆ కానిస్టేబుల్‌కు అనేక చిక్కుతు తెచ్చిపెట్టాయి. ఆమెకు ఛార్జ్ మెమో జారీ చేస్తామని ఉన్నతాధికారులు అంటున్నారు. ఆమె తన చర్యలపై వివరణ ఇవ్వాలని కూడా అంటున్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించడానికి వైఎస్ జగన్.. గుంటూరు జిల్లా జైలుకు వెళ్లారు. అక్కడే ఈ ఘటన చోటు చేసుకుంది. సురేష్‌ను పరామర్శించిన తర్వాత జగన్ బయటకు వచ్చారు. దాంతో ఆయనతో సెల్ఫీ దిగడానికి భారీ సంఖ్యలో ఆయన అభిమానులు పోటీ పడ్డారు. వారిలోనే కానిస్టేబుల్ అయేషాబాను కూడా ఉన్నారు.

అందుకే సెల్ఫీ..

జగన్‌ను చూసిన ఆయేషా భాను తన కూతురుతో కలిసి జగన్ దగ్గరకు వెళ్లారు. ‘నేను మీ అభిమానిని అందుకే ఒక సెల్ఫీ దిగుదామని వచ్చాను’ అని అన్నారు. అందుకు వైఎస్ జగన్ ఓకే చెప్పడంతో ఆమె, తన కూతురు కలిసి జగన్‌తో సెల్ఫీ దిగారు. అనంతరం జగన్ కూడా వాళ్లను ఆశీర్వదించి పంపారు. ఈ ఫొటోలు కాస్తా వైరల్ కావడంతో విధుల్లో ఉన్న కానిస్టేబుల్.. ఒక నిందితుడిని కలవడానికి వచ్చిన వ్యక్తితో ఎలా సెల్ఫీ దిగుతారంటూ పలువురు మండిపడుతున్నారు. ఇదే అంశంపై పలు ఫిర్యాదులు కూడా రావడంతో ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఘాటుగా స్పందించారు. ఈ ఘటనపై ఆరా తీస్తామని, తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పారు.

ఛార్జ్ మెమో జారీ..

విదుల్లో ఉండగా మహిళ కానిస్టేబుల్.. ఓ రాజకీయా నేతతో సెల్ఫీలు వంటి దిగడంపై ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. విధుల్లో ఉండగా ఇటువంటి చేయకూడదన్న విషయం ఆమెకు తెలియదా అని కూడా అంటున్నారు. కాగా ఈ విషయంపై కానిస్టేబుల్ ఆయేషాబానును వివరణ కోరామని తెలిపారు అధికారులు. ఆమె ఇచ్చే వివరణను బట్టి.. తదుపరి చర్యలు ఉంటాయని జైలర్ రవిబాబు వెల్లడించారు. ఆమె వివరణ సమంజసంగా లేకుంటే ఛార్జ్ మెమో జారీ చేస్తామని, ఓ కమిటీ వేసి చర్యలు చేపడతామని రవిబాబు చెప్పారు. అంతేకాకుండా జగన్ వచ్చిన సమయంలో మరో కానిస్టేబుల్ కూడా జగన్‌కు అనుకూలంగా, అభిమాని తరహాలోనే చిన్నపాటి నినాదాలు చేశారని, అతనిని కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. అతనిని గుర్తించిన తర్వాత అతనిపై కూడా చర్యలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఉన్నతాధికారులు.

Tags:    

Similar News