ఓ డ్రైవర్ గారు, ముఖం కడుక్కోండి, మత్తు వదలండి!
ఆకట్టుకున్న అనకాపల్లి జిల్లా పోలీసుల వినూత్న ప్రచారం;
By : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-09-09 12:05 GMT
రాత్రి వేళ హైవేలో రోడ్డు ప్రమాదాల నివారణకు అనకాపల్లి జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. అర్ధరాత్రి దాటాక నిద్ర మత్తులోకి జారకుండా వాహన డ్రైవర్లను ఆపి నీళ్లతో ముఖం కడిగించి పంపుతున్నారు.
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలతో పాటు మరణాలను తగ్గించేందుకు అనకాపల్లి జిల్లా పోలీసులు నడుం బిగించారు. ప్రధానంగా రాత్రి వేళ వాహనాలను నడిపే వారు అలసటతో నిద్రలోకి జారుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా పరిధి జాతీయ రహదారి-16 పై లంకెలపాలెం నుంచి పాయకరావుపేట వరకు 80 కిలోమీటర్ల మేర ఉంది. ఈ చెన్నై-కోల్కతా నేషనల్ హైవే మీదుగా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే ఈ జిల్లాలో హైవేకి ఇరువైపులా గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి, నిద్ర మత్తులో వాహనం ప్రమాదానికి గురైతే ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటోంది.
ప్రధానంగా విశాఖ పరిసరాల్లో స్టీల్స్టాంట్తో పాటు పలు పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు విశాఖ నుంచి విజయవాడ వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు పయనిస్తుంటాయి. అటు నుంచి చెన్నై, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి వాహనాలు వెళ్తుంటాయి. ఈ వాహనాలు తరచూ రాత్రి వేళ ప్రమాదాలకు గురవుతున్నాయి. వీటిలో ఎక్కువగా డ్రైవర్ల నిద్రమత్తు వల్లే జరుగుతున్నాయి.
డ్రైవర్లకు ముఖం కడిగిస్తున్నారు..
రాత్రి, అర్థరాత్రి సమయాల్లో అలసిపోయిన డ్రైవర్లు వాహనాలు నడుపుతున్న సమయంలో కునికిపాట్లు పడుతుంటారు. ఆ రెప్ప పాటు సమయంలోనే వాహనాలు అదుపు తప్పి ఘోరాలు జరిగి పోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై 'స్టాప్ అండ్ ఫేస్ వాష్' పేరిట స్పెషల్ డ్రైవ్కు అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా జాతీయ రహదారి 80 కిలోమీటర్ల పొడవున (లంకెలపాలెం నుంచి కాకినాడ జిల్లా సరిహద్దు తుని వరకు) తొమ్మిది చోట్ల ఫేస్ వాష్ పాయింట్లను ఎంపిక చేశారు. వీటిని ఏడు నుంచి 14 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఒక్కో పాయింట్లో ఒక మొబైల్ టీమ్ చొప్పున ఏర్పాటు చేశారు.
ఒక్కో మొబైల్ టీమ్ లో ఒక డ్రైవర్, హెడ్ కానిస్టేబుల్ లేదా ఏఎస్ఐ చొప్పున ఉంటారు. వీరికి ఫస్ట్ ఎయిడ్తో పాటు ఫేస్ వాష్పై కూడా శిక్షణ ఇచ్చారు. సంబంధిత పాయింట్లలో అర్థరాత్రి 12 నుంచి మర్నాడు ఉదయం వరకు ఇరువైపులా వెళ్లే లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్లు, జీపులు తదితర వాహనాలను ఆపి నీరిచ్చి డ్రైవర్లకు ముఖం కడిగిస్తున్నారు. ఇలా ముఖం కడిగించడం ద్వారా నిద్ర మత్తు వదిలి ప్రమాదాలకు ఆస్కారం ఉండదని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రాణంకంటే మించినది ఏమీ లేదని, సురక్షితంగా వాహనం నడిపితే మీపై ఆధారపడ్డ భార్యాపిల్లలు సంతోషంగా ఉంటారని వివరిస్తున్నారు.
ఫేస్ వాష్ సత్ఫలితాలనిస్తోంది..
'హైవేపై రోడ్డు ప్రమాదాలను, మరణాలను నియంత్రించడానికి మా ఎస్పీ గారు నిర్దేశించిన డ్రైవర్లకు ఫేస్ వాష్ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. డ్రైవర్లు కూడా సహకరిస్తున్నారు. వాహనం నడిపేటప్పుడు నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే వాహనాన్ని అపేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని, ఆపై మళ్లీ ప్రయాణించాలని డ్రైవర్లకు సూచిస్తున్నాం' అని హైవే మొబైల్ టీమ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లి పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ఎస్.రమేష్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు. 'సరకును టైమ్కి చేరవేయడం కోసం నిద్రను లెక్క చేయకుండా, విశ్రాంతి తీసుకోకుండా లారీని నడుపుతాం. అది ప్రమాదమని తెలిసినా అలాగే నడిపేస్తాం. ఈ మధ్యన అనకాపల్లి పోలీసులు అర్థరాత్రి హైవే మీద వాహనాలను ఆపి నీళ్లిచ్చి ముఖం కడిగిస్తున్నారు. ముఖం కడుక్కున్నాక నిద్ర మత్తు వదుల్తుంది. మేం ప్రమాదాలు చేయకుండా, ప్రమాదాలకు గురికాకుండా మంచి పనే చేస్తున్నారు' అని గొల్లపల్లి నాగేశ్వరరావు అనే లారీ డ్రైవర్ అనకాపల్లి పోలీసులను మెచ్చుకున్నాడు.
అనకాపల్లి జిల్లా హైవేలో ఫేస్ వాష్ లొకేషన్లు ఎక్కడంటే?
1) అనకాపల్లి (కొప్పాక-కశింకోట జంక్షన్)
2) కశింకోట జంక్షన్-ఎనీపాలెం
3) యలమంచిలి (ఎనీజీపాలెం-రేగుపాలెం
4) యలమంచిలి (రేగుపాలెం-ధర్మవరం)
5) ఎస్.రాయవరం
6) నక్కపల్లి (ఉపమాక జంక్షన్- ఉద్దండపురం)
7) పాయకరావుపేట (ఉద్దండపురం-తాండవా జంక్షన్)
8) సబ్బవరం (చిన్నయ్యపాలెం-మర్రిపాలెం) 7 కి.మీలు
9) పరవాడ (క్యాన్సర్ ఆస్పత్రి-కొప్పాక జం.)
ఇలా ప్రతి పది, పదిహేను కిలోమీటర్ల దూరంలో ఒక ఫేస్ వాషింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి తమ జిల్లా పరిధిలో ప్రమాదాలు జరక్కుండా అనకాపల్లి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.