శుక్రవారం గాయత్రీ దేవి అలంకారంలో కనకదుర్గ అమ్మవారు
దేవీ నవరాత్రుల సందర్భంగా కనకదుర్గ అమ్మ వారు రెండో రోజు గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు.
విజయవాడ కనక దుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కూడా విజయవాడ కనక దుర్గమ్మ దసరా ఉత్సవాలు పేరుగాంచాయి. ఆ రాష్ట్రాల నుంచి కూడా వేలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ప్రత్యేక అంలకణలు చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు. రెండో రోజు శుక్రవారం గాయత్రీ దేవి రూపంలో అమ్మవారు ఉంటారు. స్వర్ణ పంచ ముఖాలు, బంగారం అభయ హస్తాలు, కంఠాభరణాలు, పచ్చల హారాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి శోభన మూర్తిగా అమ్మవారు కొలువయ్యారు.