లక్ష మంది మహిళలను వ్యాపార వేత్తలుగా తయారు చేస్తా
ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు.;
ఈ ఏడాది లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేయడమే మా ప్రధాన లక్ష్యమని, ఆ విధంగా చేసి తీరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తాను వినూత్న ఆలోచనలు చేస్తానని, వాటిని మీ ముందుకు తీసుకొస్తానని, వాటిని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత అంటూ మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మహిళలు వ్యాపార రంగంలో రాణించే విధంగా 24 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మహిళలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గతంలో తాను ఆర్టీసి బస్సుల్లో మహిళా కండక్టర్లకు అవకాశం కల్పించామన్నారు. డ్రైవర్లుగా కూడా ఏర్పాటు చేద్దామనుకుంటే ఎవ్వరు ముందుకు రాలేదన్నారు. పొదుపు సంఘాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళలు తమ ఊర్లల్లోనే కూర్చుని డబ్బులు సంపాదించుకునే విధానానికి శ్రీకారం చుడతానన్నారు. ఆదాయం ఆర్జించాలనే ఉద్దేశంతోనే డ్వాక్రా సంఘాలకు నాంది పలికామని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని డ్వాక్రా సంఘాలు నిలబడ్డాయన్నారు. ఆడబిడ్డల కష్టం తీర్చేందుకు దీపం పథకం తీసుకొచ్చామన్నారు. ప్రపంచాన్ని మెప్పించే శక్తి. సామర్థ్యాలు మహిళలకు ఉందన్నారు.