టీడీపీలోకి మాగుంట.. ‘గౌరవం లేని చోట ఉండలేం’..

త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. వైసీపీలో గౌరవం లేనందుకే రాజీనామా చేశానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-03-11 12:05 GMT
Source: Twitter


లోక్‌సభ సహా అసెంబ్లీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సన్నద్ధం అవుతున్న వేళ రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా ఒంగోలు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీ మారుతున్నట్లు తేల్చి చెప్పారు. ఎన్ చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబీకులు కూడా టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్ రెడ్డి, బీఎన్ విజయ్‌కుమార్, దామచర్ల జనార్థన్, కందుల నారాయణరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని నేతలు సోమవారం ఉదయం మాగుంట శ్రీనివాసులు, మాగుంట రాఘవరెడ్డితో వారి నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబం వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్తూ వైసీపీ తీరుపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.

అందుకే రాజీనామా
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఒంగోలు ఎంపీ టికెట్‌ను తన కుమారుడు రాఘవరెడ్డికి ఇవ్వాలని కోరగా అందుకు వైసీపీ నిరాకరించింది. రాఘవరెడ్డికి టికెట్ ఇవ్వడం కుదరదని నిర్మొహమాటంగా చెప్పడంతోనే మాగుంట కుటుంబం ఆ పార్టీకి వీడ్కోలు పలికింది. అనంతరం కలిసి కట్టుగా టీడీపీలో చేరాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ఈ అంశంపై చంద్రబాబుతో కూడా చర్చించారు. త్వరలోనే చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరడానికి వాళ్లు సన్నాహాలు చేస్తున్నారు. తాము ఎప్పుడు, ఎక్కడ టీడీపీ తీర్థం పుచ్చుకుంటామన్నది మాత్రం చంద్రబాబు నిర్ణయిస్తారని ఆయన చెప్పారు.

కూటమి విజయానికి కృషి చేస్తా

నాకు రాజకీయంగా రిటైర్మెంట్ వయసు వచ్చింది. అందుకే ఒంగోలు ఎంపీ టికెట్‌ను మా కుమారుడు రాఘవరెడ్డికి ఇవ్వాలని చంద్రబాబును అభ్యర్థించా. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. పెద్దన్న మోడీ, చంద్రబాబు, సోదరుడు పవన్ కల్యాణ్, యువనేత లోకేష్‌తో కలిసి కూటమి విజయం కోసం కృషి చేస్తాం. ఈ సారి ఎన్నికల్లో తప్పకుండా కూటమే గెలుస్తుందన్న నమ్మకం మాకుందని మాగుంట వ్యాఖ్యానించారు.

గౌరవం లేని చోట ఉండలేం

ఫిబ్రవరి 28న మాగుంట కుటుంబం వైసీపీకి రాజీనామా చేసింది. పార్టీలో గౌరవం లేకపోవడమే తమ రాజీనామాకు కారణమని ఆయన అప్పుడే ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ‘‘మా కుటుంబ సభ్యులు ఎనిమిది సార్లు పార్లమెంటుకు, రెండు సార్లు అసెంబ్లీకి, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. మాగుంట అంటే ఒక బ్రాండ్ అని అభిమానులు చెప్తారు. మాకు మేము గొప్ప అన్న ఇగో, అహం లేదు. మాకున్నదల్లా ఆత్మగౌరవం మాత్రమే. మేము రాజకీయాలను గౌరవాన్ని పణంగా పెట్టి చేయం. ఏం చేసినా గౌరవాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటాం. ఆ గౌరవం లేని చోట ఉండలేం. ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాబట్టే వైసీపీ నుంచి తప్పుకున్నాం. పార్టీకి రాజీనామా చేయడం బాధాకరమే అయినా గౌరవాన్ని నిలుపుకోవడమే మాకు ముఖ్యం. కొన్ని అనివార్య పరిస్థితుల నడుమ వైసీపీ నుంచి బయటకు వచ్చాం’’అని చెప్పిన మాగుంట ఈ సందర్భంగానే టీడీపీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు.

అయితే పార్టీలకు అతీతంగా అందరితో స్నేహపూర్వకంగా, కలిసి మెలిసి పనిచేసే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వంటి నాయకుడు టీడీపీలో చేరనుండటం చాలా సంతోషకరమైన విషయం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అయిన కొన్ని రోజుల్లోనే మాగుంటకు కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానిస్తారని కొందరు చెబుతుంటే మరికొందరు మాత్రం చిలకలూరి పేటలో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా జరిగే భారీ సభ వేదికగా మాగుంట.. టీడీపీలో చేరతారని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News