ఆ ఎన్నికల్లో ఓటు చూపించి వేయాల్సిందే..

రాజ్యసభ ఎన్నికలు ఓపెన్‌ బ్యాలెట్‌ పద్దతి ద్వారానే జరుగుతాయి. పార్టీ వారు నియమించిన ప్రతినిధికి చూపించి ఎమ్మెల్యేలు ఓటు వేయవాల్సి ఉంటుంది.;

Update: 2024-02-13 08:46 GMT
సీఎం జగన్‌తో రాజ్యసభ అభ్యర్థులు

రాజ్యసభ ఎన్నికలు ఓపెన్‌ బ్యాలెట్‌ విధానంలో జరుగుతాయి. ఈ ఓపెన్‌ బ్యాలెట్‌ విధానంలో సంబంధిత ఎమ్మెల్యే తాము ఎవరికి ఓటు వేసింది తమ పార్టీ అధీకృత ఏజెంటుకు చూపించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న రహస్య బ్యాలెట్‌ స్థానంలో ఓపెన్‌ బ్యాలెట్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

2003లో రాజ్యసభ ఎన్నికలలో రెండు మార్పులు చేశారు. ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడానికి, ఆ అభ్యర్థికి ఆ రాష్ట్రంలో తప్పనిసరిగా ఓటరు కావాలనే నిబంధనను తొలగించారు. అలాగే ఓపెన్‌ బ్యాలెట్‌ విధానం ద్వారా ఎమ్మెల్యే ఎవరికి ఓటు చేస్తున్నారో చూపించి వేయాలి.
15 రాష్ట్రాల్లో ఎన్నికలు
15 రాష్ట్రాలలో ఖాళీ అవుతున్న మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదల అయింది. ఫిబ్రవరి 27న ఎన్నికల సంఘం ప్రకటన మేరకు ఎన్నికలు జరుగుతాయి. ఆంధప్రదేశ్‌ నుంచి ఖాళీ అవుతున్న 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. రాజ్యసభ నుంచి రిటైర్‌ అయ్యేవారిలో వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్‌ ఉన్నారు.
తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్‌ స్థానాలు ఖాళీ కానున్నాయి.
ఎన్నిక ద్వారా కొందరు, నామినేషన్‌ ద్వారా కొందరు రాజ్యసభకు..
రాజ్యంగంలోని ఆర్టికల్‌ 80 ప్రకారం రాజ్యసభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 250. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు.
వీరిలో 233 మందిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్నుకుంటాయి. మిగిలిన 12 మందిని సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవా రంగాలనుంచి రాష్ట్రపతి నామినేట్‌ చేస్తారు.
రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ, కొత్త రాష్ట్రాల ఏర్పాటు కారణంగా రాజ్యసభ సీట్ల కేటాయింపు 1952 నుంచి ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది.
ప్రతి రెండేళ్లకోసారి సభ్యుల పదవీ విరమణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 18 రాజ్యసభ స్థానాలు ఉండేవి. ఆంధప్రదేశ్‌ విడిపోయాక ఏపీకి 11, తెలంగాణకు 7 స్థానాలు కేటాయించారు.
సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3వ వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్తవారు ఎన్నికవుతారు.
రాజ్యసభ ఎంపీగా పోటీ చేసే అభ్యర్థిని కనీసం 10మంది ఎమ్మెల్యేలు బలపరచాల్సి ఉంటుంది.
అభ్యర్థికి కోటా ఓట్లు రావాల్సిందే..
రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నిక కావాల్సిన అభ్యర్థికి నిర్ణీత ఓట్లు వచ్చి తీరాలి. ఈ నిర్ణీత ఓట్లనే కోటా అంటారు. ప్రస్తుతం ఆంధప్రదేశ్‌లో ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మరొకరు కూడా రంగంలోకి ఉంటే వీరిలోంచి ముగ్గురిని ఎలా ఎంపిక చేస్తారో చూద్దాం.
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు 100 పాయింట్లు కేటాయిస్తారు. మొత్తం సభ్యుల సంఖ్య 175, ఒక్కో సభ్యుని విలువ 100 పాయింట్లు, మొత్తం విలువ 175గీ100 = 17500.
దీని ప్రకారం ప్రస్తుతం ఏపీలో రాజ్యసభ ఎంపీగా నిలబడే అభ్యర్థికి కనీసం ఎమ్మెల్యే నుంచి 44 ఓట్లు పడాల్సి ఉంటుంది.
ఇలా నిర్ణీత ఓట్లు రావడాన్ని కోటా అంటారు. అంటే 4వ వంతుకంటే ఎక్కువ ఓట్లు రావాలి. అలాగే ప్రాధాన్యతా క్రమంలో ఓట్లను లెక్కిస్తారు.
ఎమ్మెల్యేలు వేసే ఓటును సింగిల్‌ ట్రాన్స్‌ఫరబుల్‌ ఓటు (ఎస్టీవీ) అంటారు. ఒకే ఓటు ద్వారా ప్రాధాన్యతా క్రమంలో అభ్యర్థులకు ఓటు వేయడాన్నే ఎస్టీవి అంటారు.
కోటాకు తగ్గట్టుగా పార్టీల ఏర్పాటు
ప్రాధాన్యతా ఓట్లు వేసే క్రమంలో ఎమ్మెల్యేలు గందరగోళానికి గురవుతారననే ఉద్దేశంతో చాలా పార్టీలు ముందుగానే తాము నిలబెట్టిన రాజ్యసభ ఎంపీకి ఏ ఎమ్మెల్యే మొదటి ప్రాధాన్య ఓటు వేయాలో చెప్పి, వారందరిని (కోటాకు తగినట్టుగా) ఓ గ్రూపులా తయారుచేసి, సంబంధిత అభ్యర్థికి కేటాయిస్తాయి. వీరంతా తమ అభ్యర్థికి కేవలం మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వచ్చేస్తారు.
Tags:    

Similar News