ఆంధ్రలో ఈసీ తీరుపై ప్రతిపక్షాల విమర్శలు.. అనుమతి ఎవరిచ్చారంటూ..!
ఆంధ్రలో రాజకీయాలు ఏ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోవట్లేదు. ఎప్పుడు ఏ ట్విస్ట్ వస్తుందో, ఏ యాక్షన్ ఎపిసోడ్ వస్తుందో ఊహించడం అసాధ్యంలా ఉంటుంది
ఆంధ్రలో రాజకీయాలు ఏ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోవట్లేదు. ఎప్పుడు ఏ ట్విస్ట్ వస్తుందో, ఏ యాక్షన్ ఎపిసోడ్ వస్తుందో ఊహించడం అసాధ్యంలా ఉంటుంది. నిన్నటి వరకు హింసాత్మక ఘటనల చుట్టూ తిరుగుతున్న ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా రూట్ మార్చి ఈసీపై ఫోకస్ అయ్యాయి. ఆంధ్రలో ఈసీ కూడా వైసీపీ తొత్తుగా మారిపోయిందంటూ ప్రతిపక్షాలు గొంతులుచించుకుని అరుస్తున్నాయి. అందుకు గుంటూరులోని ఆంధ్ర యూనివర్సిటిలో ఎన్నికల సంఘం నిఘా వర్గాలు నిర్వహించిన సమావేశామే నిదర్శనమని ప్రతిపక్షాలు అంటున్నాయి. స్ట్రాంగ్ రూమ్‌లలో ఉన్న ఈవీఎంలు ఏమాత్రం సురక్షితం కాదని, వాటిని వైసీపీ అత్యంత సులభంగా యాక్సెస్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఈసీ మీటింగ్‌లో వైసీపీ పోస్టర్
గుంటూరు జిల్లా నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఆచార్య నాగార్జున యూనిర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. ఆ స్ట్రాంగ్ రూమ్‌లకు దగ్గర్లోనే వర్సిటీలోని డైక్‌మెన్ ఆడిటోరియంలో నిఘా వర్గాల అధికారులు, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ సిబ్బంది సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో అధికారులు ప్రసంగిస్తున్న సమయంలో వారి వెనక ఉన్న స్క్రీన్‌పై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ పోస్టర్ ప్రత్యక్షం అయింది. దీంతో ఈ సమావేశంపై ప్రతిపక్షాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈవీఎంలకు స్ట్రాంగ్ రూమ్‌లలో భ్రదత లేదని అంటున్నాయి.
ఎవరిచ్చారు అనుమతి?
ఈ సమావేశం నిర్వహించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ప్రశ్నలు సంధించాయి. అసలు స్ట్రాంగ్ రూమ్‌ల సమీపంలో సమావేశం ఎలా నిర్వహిస్తారు? అందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? డీజీపీ కార్యాలయం పక్కనే సీకే కన్వెన్షన్, ఏపీఎస్‌పీ బెటాలియన్‌లోని హాలు అందుబాటులోనే ఉన్నా ఏఎన్‌యూలోనే సమావేశం ఎందుకు నిర్వహించారు? దీనికి బాధ్యులు ఎవరు? అక్కడ ఈసీ సమావేశం జరగడానికి ముందు అక్కడ రహస్యంగా పార్టీ సమావేశం ఏమైనా జరిగిందా? అందుకే అక్కడ వైసీపీ ‘మేమంతా సిద్ధం’ పోస్టర్ ప్రదర్శితమవుతుందా? ఏఎన్‌యూను భద్రతా సిబ్బంది తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కూడా బయటి వ్యక్తులను ఎలా లోపలికి అనుమతించారు? అంటూ ప్రశ్నలు సంధిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు పొన్నూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ లేఖ రాశారు. ఈ అంశం సమగ్ర విచారణ జరపాలని, ఈ సమావేశానికి అనుమతులు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన లేఖలో కోరారు.
స్ట్రాంగ్ రూమ్‌లకు పెరిగిన సెక్యూరిటీ
నరేంద్ర కుమార్ ఫిర్యాదుతో గుంటూరు కలెక్టర్ వేణుగోపాల రెడ్డి, ఎస్పీ తుషార్ డూడీ హుటాహుటిని ఏఎన్‌యూకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను, స్ట్రాంగ్ రూమ్‌లను, ఆడిటోరియం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్‌లకు భద్రతను పెంచారు. స్ట్రాంగ్ రూమ్‌లకు 200 మీటర్ల దూరంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. చెక్‌పోస్ట్‌లు పెట్టారు. దాంతో పాటుగా అక్కడ ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందితో పాటు అదనంగా మరో 100 మంది పోలీసులను కూడా స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ విధుల్లో చేర్చారు.